2309* వ రోజు.......           23-Dec-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి?

అలవోకగా -  సమయమే తెలియనట్లుగా 2309* వ నాటి శ్రమానందం.

          నిన్నటి కన్న కాస్త ముందుగానే - 4.18 కే బైపాస్ వీధిలో మొదలైన వీధి పారిశుద్ధ్య కృషి విజయ్ నగర్, అశోక్ నగర్ లలో  మూడు చోట్ల - కాలుష్యం మీద ముప్పేట దాడిగా నడిచింది! విజయ్ నగర్ 3 వ లైను ఆసాంతం వంక పెట్టలేనంత గానూ, అశోక్ నగర్ 2 వ వీధిలో పాక్షికం గాను, సాగర్ ఉపమార్గ సుందరీకరణం ఒక నలుగురు కార్యకర్తల ఇష్టానుసారంగానూ ముగిసినవి!

          ఏడెనిమిదేళ్ల నుండి సమాధానం దొరకని సులభమైన ప్రశ్నేమంటే - 29 మంది - అందులో స్థితి మంతులూ, వయోధికులూ, మణికంఠ – జగదీష్ లనే చిన్నారులూ, గృహిణులూ 2 గంటలపాటు తమ ముంగిళ్ల కశ్మలాల మీద దండెత్తుతుంటే కత్తుల, దంతెల, ట్రాక్టర్ల, మైకు నుండి పాటల - సందడి నెలకొంటే - ఏదో ముగ్గురు నలుగురు తప్ప – 30 ఇళ్ల వారింత నిశ్చింతగా - నిష్పూచీగా - నిర్మొహమాటంగా ఎలా దూరంగా ఉండగలరా అని! నిద్రాదేవతకీ, బద్దకానికీ వాళ్ల మీద ఇంత వల్లమాలిన ప్రేమ ఎందుకా అని!

          ఐతే – ఏ మాటకామాటే చెప్పుకోవాలి - ఇతర వార్డుల కన్న, వీధులకన్న ఈ ప్రాంతం కొన్ని విషయాల్లో నయం! రోజువారీ తడి - పొడి చెత్తల సేకరణలో, ఆర్థిక సహకారంలో, పనిగట్టుకొని బైట చెత్త విరజిమ్మక పోవడంలో, ఈ మాత్రం పాక్షికంగానైనా - నలుగురైనా వచ్చి శుభ్ర - సుందరీకరణంలో కాలో - వ్రేలో పెట్టడంలో ఇక్కడి వాళ్లను అభినందించాల్సిందే! మంచి దిశగా గ్రామ సామాజిక మార్పు ఇలా నెమ్మదిగానే మొదలౌతుంది గాబోలు!

          ఈనాటి 55 పని గంటల శ్రమదానంలో ఆసక్తికర అంశాలివి:

- అశోక్ నగర్‌కు చెందిన విశ్రాంత RTC ఉద్యోగి - సుబ్బారావు గారి ఇంటి ప్రక్క ఖాళీ స్థల కల్మషాలు తొలగిపోయి ఆ వీధికి ఇంకొంచెం స్వచ్చ - శుభ్రతా హంగు! - చీకట్లో - మంచు, చలిలో ఇందుకు పూనుకొన్న నలుగురు కార్యకర్తలకు అభినందనలు.

- దివంగత RMP వైద్యుడు కోటేశ్వరరావు గారి ప్రహరీ బారునా - డ్రైను అంచుల్తో సహా గడ్డినీ, తుక్కునీ, పిచ్చి కంపనీ తొలగించిన - ఒక మహిళతో సహా ఐదుగురి పనిమంతనం !

- సుందరీకరణ సంఘం సంగతి చెప్పేదేముంది? వాళ్ల కత్తులు, కత్తెర్లు, చీపుర్లు - ఎప్పుడేవి ప్రయోగించాలో అలావాడి, ప్రధాన వీధిలో మరికొంత భాగాన్ని తీర్చిదిద్దారని నేను వ్రాయడమెందుకు - వాట్సప్ చిత్రంలోనే కనిపిస్తున్నది !

- ఎక్కువ మంది – 16 కు పైగా కార్యకర్తల శక్తి యుక్తులూ, ఉత్సాహమూ అంకితమైపోయింది మాత్రం విజయ్ నగర్ మూడవ వీధికే! వీధి ప్రక్కల ఖాళీ నివేశనాలను పాక్షికంగాను, డ్రైనుల్ని, వీధి అంచుల్ని కుణ్ణంగాను వీధి పొడవునా చెమట సంతర్పణ చేస్తూ, తుక్కులన్నిటినీ ట్రాక్టర్ లో నింపుతూ... ఆ రెండు గంటలూ వాళ్లదొక ప్రత్యేక ప్రపంచం!

          6.30 తర్వాత ఇందులో సగం మంది నేటి తమ శ్రమ ఫలితంగా ముస్తాబైన చోటుల్నీ, వీధినీ సంతృప్తిగా మళ్ళీ మళ్ళీ చూపుల్తో తడమటం కూడ గమనించాను!

          అ తరువాత కాఫీల సరదా ముగిశాక - కొన్ని రోజుల ఎడబాటు తర్వాత పునః ప్రవేశంచిన అడపా గురవయ్య మూడు మార్లు - మూడు రకాల గ్రామ మెరుగుదల నినాదాలను ప్రకటించి, నేటి శ్రమ సందేశాన్ని విరమించారు!

          మరింత మందిమి - మరింత ఉత్సాహంగా రేపు కలిసి, శ్రమించ దగిన ప్రాంతం అశోక్ – విజయ్ నగర్ల – బైపాస్  మార్గమే గదా !

 

     సమర్పిస్తున్నాం ప్రణామం – 68

సత్కరిస్తే – గౌరవిస్తే - శాలువల సన్మానమిస్తే –

“అహో! ఓహో ! ఇంతవాళ్లని అంతవాళ్లని” ప్రశంసిస్తే

కార్యకర్తలు పొంగిపోవరు గ్రామ జనములు కలిసి వస్తే

అదే తృప్తట కార్యకర్తల కందుకే మరి నా ప్రణామం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

23.12.2021.