2310* వ రోజు....           24-Dec-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి?

చల్లపల్లి స్వచ్చోద్యమకారుల 2310* వ నాటి తడాఖా!

         ఈ మధ్య ఎక్కువ మార్లు స్వచ్ఛంద శ్రమకారులు కలుసుకొంటున్న వేకువ 4.18 సమయమే నేటి వీధి కాలుష్యం మీద సమర ముహుర్తం! ఆ సమర భూమి కూడ గత 10 - 12 రోజుల్లాగే బైపాస్ మార్గంలోని అశోక్ నగర్ 1, విజయ్ నగర్ రెండవ వీధుల దగ్గరే! కశ్మల రక్కసి మీద పోరు సాగించింది 27 మందే! వీరిలో ఏడుగురు స్థానికలైనందుకు నాకు సంతోషమే! గలీజుల విధ్వంసం జరిగి, పూర్తిగా బాగుపడింది 2 వ వీధి కాగా - పాక్షికంగా మెరుగుపడ్డవి రెండు బాటలు!

         “ఐకమత్యమే బలంఅని మన పూర్వికు లేనాడో చెప్పితే- "వ్యక్తికి బహువచనం శక్తి!" అని శ్రీశ్రీ తనసొంత స్టైల్ లో ప్రతిపాదించాడు. అన్ని వార్డుల్లో అన్ని వీధుల్లో - అన్ని రోజుల్లో ఈ విజయ్ నగర్ ప్రాంతంలో వలే స్థానికులు గనుక స్వచ్ఛ కార్యకర్తలకు సహకరిస్తే - ఎక్కడికక్కడ గృహస్తులు సామాజిక స్పృహను ప్రదర్శిస్తే - తమ గృహాల - వీధుల స్వచ్ఛ శుభ్ర - సౌందర్య - స్వస్తతల పట్ల ఒక కన్నేస్తే - వార్డు మెంబర్లు, పంచాయతీ పాలక వర్గాలు ఇంకాస్త బాధ్యత వహిస్తే.....మన ట్రస్ట్ చైర్మన్ గురవారెడ్డి చమత్కరించినట్లు చల్లపిల్ల”  కేవలం 100 రోజుల్లో సర్వాంగ భూషితురాలై స్వచ్ఛ జాతీయ సుందరిగానెగ్గదా?

         నా ఆలోచనల్ని పగటి కలలుఅని కొట్టేయ వద్దు. కలలు కనండి నిజం చేసుకొనేందుకు శ్రమించండి....అని ఈ దేశ మాజీ అధ్యక్షుడు (అబ్దుల్ కలాం) చెప్పి - ఋజువు కూడా చేశాడు!

         అలాంటిది - ఇందరు అవగాహనా పరులు, విద్యాధికులు, సానుకూల దృక్పధులు ఉన్న చల్లపల్లి గ్రామం ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వార్తలకెక్కిన ఊరు ఐకమత్యంతో కనుక అడుగేస్తే - ఎన్ని అద్భుతాలు జరగవు!

         “అసాధ్యం అనే మాట మనం కల్పించుకొన్నదే! సుసాధ్యంఅనే పదం కూడ ఎందరో ఎన్ని మార్లో అనేక రంగాల్లో ఋజువు చేసిందే!

         ఒక ప్రక్క 16 - 17 మంది కార్యకర్తలు విజయ్ నగర్ రెండన వీధి పొడవునా అశుద్ధతను, అస్తవ్యస్తాలను, డ్రైన్ల తప్పుడు నడకల్ని, పెరిగిన గడ్డిని, పిచ్చి వ్యర్ధ తీగల్ని, కొమ్మల్ని, మొక్కల్ని, డొక్కు ప్లాస్టిక్ సీసాల్ని, ఇతర వ్యర్దాల్ని చెండాడి, సరిజేసి, ట్రాక్టర్ లోకేక్కిస్తుంటే -  

         సంఖ్య తక్కువైనా సుందరీకర్తలు బైపాస్ మార్గంలో పట్టి పట్టి మెరుగులు దిద్దుతుంటే -

         విజయ్ నగర్ చివరి అడ్డ రోడ్డులో ఎండిన చెట్ల వ్యర్ధాల గుట్టల్ని మిగిలిన కార్యకర్తలు 6.15 దాక ట్రాక్టర్లో నింపుతూనే ఉన్నారు!

         ఇదీ - మన ఊరి ఆదర్శ - ప్రయోజనకర సుదీర్ఘ స్వచ్చంద శ్రమదానమంటే! స్వార్థం కోసం కాక గ్రామ ఉమ్మడి మేలు కోసం జరిగే ఎవ్వరూ వంక బెట్ట జాలని ప్రయత్నమంటే ఇదే! జాతిపిత ఆచరణ పూర్వకంగా దేశానికి చేసిన హితబోధ కూడా ఇదే! అంతే గాని స్వచ్ఛ కార్యకర్తలు వారిస్తున్నా బ్రతిమాలుతున్నా వీధుల్లో, డ్రైనుల్లో చెత్త విసరడం కాదు - కనపడిన ప్రతి వీధి మార్జిన్లను పోటీపడి కబ్జాలు చేయడం కానేకాదు అలాంటి చర్యలకు ఏ ఒక్క గ్రామ పాలక సభ్యుడైనా అధికారి ఐనా మద్దతు పలకడం అసలే కాదు!

         6.40 వేళ కాఫీ ఆస్వాదనానంతర గ్రామ స్వచ్చ శుభ్ర సౌందర్యాకాంక్షను నదురు బెదురు లేక ముమ్మారు నినదించింది చిరంజీవి పరసా జగదీష్ అనే 8 వ తరగతి కుర్రాడు!

         రేపటి మన స్వచ్ఛ - పరిశుభ్ర కర్మక్షేత్రం కూడ బైపాస్ వీధిలోని విజయ్ నగర పరిసరాలే!

 

           సమర్పిస్తున్నాం ప్రణామం – 69

ఒక విశిష్ట ప్రయోజనమును - ఒక సమంచిత జన హితమ్మును

సమాజ సేవకు లెన్నుకొనదగు సదాచరణాత్మక పథమ్మును

ఎంచుకొనిన - ఆచరించిన - నిర్వహించిన మహాశయులకు

చల్లపల్లి ప్రజల తరపున సమర్పిస్తున్నాం ప్రణామం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

24.12.2021.