1895 * వ రోజు....           19-Jan-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!   

*స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1895** *వ నాటి కృషి.* 

మబ్బులు క్రమ్మి- మంచు పట్టని ఈ చలి వేకువ 4.00-6.42 నిముషాల సమయాల నడిమి కాలంలో గ్రామ స్వచ్చంద శ్రమ దానానికి దిగిన కార్యకర్తలు 35 మంది. స్వచ్చ- శుభ్ర-సుందరీకృత ప్రాంతం గంగులవారిపాలెం బాట చివరలో ఉన్న మురుగు కాల్వ వంతెన దగ్గర. చిన్నపాటి విశేషం-స్థానికులు ఐదుగురి పునః ప్రాతినిధ్యం!

- వీరిలో 25 మంది బండ్రేవు కోడు మురుగు కాల్వ ఉత్తర దిశగా దారి అంచు మీదే పట్టి పట్టి శుభ్ర పరిచారు. అందులో ఏడెనిమిది మంది పారలతో, గోకుడు పారలతోగడ్డిని, పిచ్చి మొక్కల్ని గోకి, చెక్కి, దారి మీది మట్టిని చెక్కి బాటను విశాలంగా-శుభ్రంగా-అందంగా రూపొందించారు.

మరో పది మంది పొలం అంచు దాక-తీగల్ని, పనికిరాని మొక్కల్నీ, ఎండు కొమ్మల్ని, ఆకుల్నీ తొలగిస్తూ తమ కృషిలో తాము లీనమయ్యారు. నలుగురు మహిళలు బాటను ఊడ్చి-ఊడ్చి 6.00 కు తెలవారే సమయానికి దాన్ని కంటికింపుగా తీర్చిదిదారు. గొర్రుల వారు వ్యర్ధాలన్నిటినీ లాగి, పోగులు చేసి, కాలువ ఉత్తరపు టొడ్డు కోత పడకుండ అక్కడ సర్దారు.

- ఇక ఐదుగురు కరుడుగట్టిన స్వచ్చ కార్యకర్తలు ఈ దారి మలుపులో అడవిలా పెరిగిన ముళ్ల చెట్ల మీద యుద్ధం ప్రకటించి, గంటన్నర పాటు కత్తులు, గొడ్డళ్లతో ఒక ప్రైవేటు ఖాళీ స్తలాన్ని శుభ్ర పరచడంలో విజేతలయ్యారు.

నిజ జీవితంలో వీరంతా ఉద్యోగులు, వ్యాపారులు, వృత్తి నిపుణులు, కృషీవలురు; పింఛను దారులు. 1895 రోజులుగా ప్రతి వేకువలో ప్రవృత్తికంగా స్వచ్చోద్యమ కారులు! 2 లక్షల పని గంటల సమయ-శ్రమ అర్థ దాతలు!

6.50 నిముషాలకు సమీక్షా సమావేశంలో హాస్పిటల్ ఉద్యోగిని సుమతి ముమ్మారు ప్రకటించిన స్వచ్చ సుందర స్వగ్రామ సంకల్ప నినాదాలతో నేటి మన బాధ్యతలు రేపటికి వాయిదా!

జీవిత భీమా S.G.A బాష గారి కుమార్తె వివాహానికి కార్యకర్తలంతా 12.30 ప్రాంతంలో వాసవి కళ్యాణ మండపం దగ్గర కు వెళ్లవలసి ఉన్నది.

రేపటి మన కృషి కూడ గంగులవారిపాలెం దారిలో వంతెన సమీపంలో నే జరుగుతుంది.

      ఇదొక వింత వినోదం!

చూస్తున్నది స్వచ్చోద్యమ సంకురాత్రి సంబరమే

ప్రతి కదలిక-ప్రతి మాటా స్వచ్చ-శుభ్ర సందేశమె

సాంప్రదాయ వేడుకలో సామాజిక కర్తవ్యం

కలగలిసిన బోగి వేడుక దొక పెద్ద విచిత్రం!

   నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు- మనకోసం మనం ట్రస్టు,

ఆదివారం – 19/01/2020

                                                               చల్లపల్లి.