2311* వ రోజు....           25-Dec-2021

ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి?

చల్లపల్లి సృజన శీల స్వచ్చోద్యమంలో 2311*వ ఘట్టం.

          4.17 కే 16 మందితో శనివారం - క్రిస్మస్ పండుగ నాటి స్వచ్చంద శ్రమదాన వేడుక. 7.30 తరువాత- Dr. గోపాళం గారి షష్టిపూర్తి ఉత్సవంగా ముగిసింది. ఈ కార్యక్రమ వేదిక విజయనగర్ 1, 2 వీధులు, బైపాస్ మార్గం, తొలి కూడలిలోని 10 సెంట్ల ఖాళీ స్థలం. 7.35 కు ముగిసింది మాత్రం సామ్యవాద వీధిలోని అస్మదీయ నివేశన స్థలంలో!

          అప్పటికప్పుడు ఏ పొరుగూరి వాళ్ళో చూస్తే ఈ శ్రమదాన ఉత్సవం బొత్తిగా అర్థం కాక పోవచ్చు! ఈ మైకు పాటలు, కత్తుల రాపిళ్లు, దంతెల గరగరలు, ఉండుండి ఏ కార్యకర్తవో ఛలోక్తులు, మట్టి త్రవ్వే పారల ఒరిపిళ్లు, రోడ్డు మార్జిన్ల రిపేరులు, గోకుడు పారల చప్పుళ్లు, రైల్వే పారల మ్రోతలు వంటివి ఈ గ్రామస్తుల్లోనే సగం మందికి తెలుసేమో గాని, ఈ ఊరి నిర్విరామ - నిర్వికల్ప- సుదీర్ఘ స్వచ్చోద్యమం నిడివి, లోతు, అంతరార్థం తెలిసిన వాళ్లు తక్కువే కావచ్చు !  కాని

“Birds of same feather flock together” (ఏ గూటి పక్షులా గూటికే చేరుకొంటాయి) అనే సామెత ప్రకారం ఈనాటి వేకువ 67 కి.మీ. దూరంలోని విజయవాడ నుండి కనీసం 3 మంచి పక్షులు వచ్చి చల్లపల్లి  స్వచ్చోద్యమ జాతి పక్షుల్లో చేరి, రెక్కలు జాడించాయి!  వేరే భాషలో చెప్పాలంటే- ఈనాటి స్వచ్చంద శ్రమదానంలో రంకె లేసినవి - విజయవాడవి గాని- చల్లపల్లివి గాని - మొత్తం 36 నందులు!  వీటిలో నాలుగైదు మాత్రం పెద్ద డాక్టర్ నందులు!  90 ఏళ్ల, 84 ఏళ్ల సీనియర్ నందులు సైతం నేటి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నవి!

          మరి ఇన్ని నందులు- శివన్నారాయణ సిద్ధాంతం ప్రకారం చీమలు- 2 గంటల శ్రమ వేడుకలో ఏం సాధించాయట?

- విజయ నగర్ 2 వ వీధి మొదట- డ్రైను ప్రక్కన విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న ఒక సిమెంటు రోడ్డు అంచు మన్నిక కోసమూ, ఆమలుపు సుందరీకరణ కోసమూ ఐదుగురు కార్యకర్తల ముందుజాగ్రత్తలు,

- నిన్న మిగిలిన కొంత తుక్కుల్ని కొందరు కార్యకర్తలు ట్రాక్టరు లో నింపుకోవడం,

-1 వ వీధి తొలి ఇంటి ప్రక్కన అడ్డూ - అదుపూలేక పెరిగిన- చిక్కుపడిన వికృతమైన ముళ్ల పిచ్చి చెట్లనీ, తీగల్ని - వాటి మధ్య ప్లాస్టిక్ సంచుల ఖాళీ సీసాల వంటి వ్యర్థాలనీ ఇద్దరు నరికి, ఏరి, కాలుష్యం అంతు చూసిన వైనం,

          ఈ అన్నిటిని మించి, అంతకు ముందు నాలుగైదు మార్లు శుభ్రపరిచినా, మళ్ళీ చిట్టడవిలా మారిన ఒక పెద్ద ఖాళీ ప్రదేశాన్ని 10-12 మంది కొంత భాగం సంస్కరించిన విషయమే పెద్ద సంఘటన!

          6.45 సమయంలో 3 వ తరగతి చదివే ఏడేళ్ల మణికంఠ అనే బాల కార్మికుని స్వచ్ఛ పరిశుభ్ర - సౌందర్య సంబంధ నినాదాల పిదప - 67 కి. మీ. ప్రయాణించి, తన 60 ఏళ్ల జ్ఞాపకాల్ని పంచుకొనే అదృష్టాన్ని చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తలకి కలిగించిన గోపాళం శివన్నారాయణ గురించి ఇతరులు ప్రస్తావించిన - మానవుని సక్రమ జీవన వేదాన్ని రకరకాలుగా నిర్వచించిన, పోల్చిన ఆ ప్రజావైద్యుని ప్రసంగమే ముఖ్యవిశేషం! మనకోసం మనం ట్రస్టుకు కోమలి- శివన్నారాయణుల - 5,000/- విరాళమూ, 84 ఏళ్ల డాక్టర్ శివప్రసాద్ గారి 12 చెక్కుల (500 చొప్పున) విరాళమూ ఒక చిన్న పాటి విశేషం!

          ఆదివారం- 26-12-21 వ నాటి వేకువ స్వచ్ఛ కార్యకర్తల కార్యరంగం బైపాస్ వీధిలోని విజయ నగర్ ప్రాంతమే!

 

             షష్టి పూర్తి శివోహం! - 1

  ఆతని ప్రతి మాట సూక్తి - ప్రజాసేవ కతడే స్ఫూర్తి

 చల్లపల్లి స్వచ్చోద్యమమన్న అతని కెంతో భక్తి

 అతనిది నిత్యాన్వేషణ - అతడె శివన్నారాయణ

 ఆతని జన్మోత్సవాని కందిస్తా శుభకామన!

 

- నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

మనకోసం మనం ట్రస్టు బాధ్యుడు

25.12.2021.