2312* వ రోజు....           26-Dec-2021

ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి?

స్వచ్చోద్యమ చల్లపల్లి నడకలో 2312* వ అడుగు!

            ఆదివారం (26-12-21) నాటి స్వచ్చ - సుందర ప్రయత్న ప్రారంభం 4.19 కి, ముగింపు 6.20 కి! వాట్సప్ మాధ్యమ తొలి చిత్రంలో వాళ్ల సంఖ్య పన్నెండేగాని, అది క్షణక్షణ ప్రవర్ధమానమై 39 కి ఎగబ్రాకింది. (నా అదృష్ట సంఖ్య – 30!)

            ‘సరే - ఈ కాలమానాన్ని, సంఖ్యల లెక్క డొక్కల్ని పక్కనబెట్టి శ్రీశ్రీ గారన్నట్లు ఏ ఉద్యమ మే సమయంలో సాధించినదే పరమార్థం!

గద్దెక్కిన నేతలు కాదోయ్ - శ్రమదాతల చర్యలు ఏమిటి...?

అనే ప్రస్తుత విషయాని కొస్తే:

ఈ వేళ కూడ మూడు చోట్ల – 3 విధాల పరి చర్యలు ఈ చల్లపల్లికి లభించాయి!

1) బైపాస్ మార్గం ప్రక్క వీధి మొదట్లో డ్రైను దగ్గరి సిమెంటు బాట మలుపును విశాల పరచడం, పటిష్ట పరచడం, సుందరీకరించడం ముగ్గురు మహిళల + నలుగురు యువకుల సమన్వయ కృషితో సాధ్యపడిన ఫలితమిది!

2) ఇదే వీధి మురుగు కాల్వలో సరిగా కనపడక మునిగి ఉన్న కరెంటు స్తంభాన్ని బైటకు ఈడ్చి, అవసరమైన చోట దారిని బలపరిచిన/మెరుగు దిద్దిన ఐదారుగురి కృషి.

3) ఇక ఊరి సమస్యలకు ఏకాస్త స్పందనా లక్షణం ఉన్న వారికైనా చూడదగినదీ, అనుసరించ దగినదీ విజయ్ నగర్ తొలి వీధి మలుపు దగ్గరి ఖాళీ స్థల పారిశుద్ధ్య సమరమే! ఆ స్థలం ఎగుడు దిగుళ్లలో, చీకటిలో 20 మంది కార్యకర్తల గంటన్నర శ్రమదానం అక్కరకు వచ్చి, చెట్లూ, ముళ్ల తీగలూ, ఈత గుబుళ్లూ మాయమై పోయి, ప్రస్తుతానికక్కడ ఒక పెద్ద కొబ్బరి చెట్టూ, మరొక మధ్యరకందీ మిగిలాయి!

4) చీపుళ్ల వారైతే - ప్రధాన రహదారి పొడవునా, రెండు వీధులు సగాన్నీ, ముఖ్యంగా పైన చెప్పిన స్థలాన్నీ పట్టి పట్టి శుభ్రపరుస్తూనే ఉన్నారు!

            మరో వారం తర్వాత - యజమాని పట్టించుకోని ఈ జాగాలో ఇళ్ల వ్యర్ధాల మూటల్ని విసిరితే, పందులు వాటిని విరజిమ్మితే, మళ్ళీ గడ్డి, ఖాళీ సీసాలు, ప్లాస్టిక్ సంచులు, ఆహారవ్యర్ధాలు పోగుపడితే సంగతేమిటి! హితబోధలు చేస్తున్నా, ప్రతి దినం కార్యకర్తలు పాటుబడుతున్నా, పంచాయతీ వారు పర్యవేక్షిస్తున్నా... ఇంకా అవే పాత అలవాట్లను గృహస్తులు కొనసాగిస్తారా?

            2 గంటల శ్రమదాన సందేశం తరువాత - కాఫీ కాలక్షేపం పిదప పరసా జగదీష్ - ఎనిమిదో తరగతి విద్యార్థి మారు మ్రోగించిన గ్రామ స్వచ్చ - సుందర నినాదాల పిదప, కార్యకర్తల నిర్ణయాలేమంటే:

- బుధవారం వేకువ కమ్యూనిస్టు వీధి, సూరి డాక్టరు వీధి, యడ్ల వారి బజారుల్లో కూడ ఇలాగే శ్రమించి, తీర్చి దిద్దాలని;

- సోమ, మంగళ వారాల్లో సాయంత్రం 5.00 నుండి కోమలా నగర్లో ఇంటింటికీ తిరిగి – 10 మంది కార్యకర్తలు తడి - పొడి చెత్తల సేకరణ గూర్చి అవగాహన కల్పించాలనీ!

            29-12-21- వేకువ మన పునర్దర్శన ప్రాంతం - కమ్యూనిస్టు వీధి - బైపాస్ బాటలోనే!

 

             షష్టి పూర్తి శివోహం! - 2

మనుషుల్లో తిరుగు మనిషి - మనసులు చదివే మనిషి -

వైద్య శాస్త్ర పరమార్థం ఒంట బట్టి కదలు మనిషి

ఆదర్శము నాచరణగ అనువదించి చూపు మనిషి

నిక్కమైన విలువలతో నిలిచి ప్రకాశించు మనిషి!

 

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

  ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   26.12.2021.