2313* వ రోజు......           27-Dec-2021

ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి?

2313* వ నాటి పరిమిత సంఖ్యాకుల స్వచ్చ ప్రయత్నం:

            సోమవారం (27-12-21) వేకువ 4.30 కు బైపాస్ వీధిలో ప్రత్యక్షమైన కార్యకర్తల రాశి తక్కువే గాని - ప్రణాళికకు, పట్టుదలకు లోటులేదు - సిమెంటు రోడ్డుకు పడిన గుంటల్ని, అంచులకు రాబోవు నష్టాన్ని పూడ్చి, నివారించి, ప్రజల వాహన భద్రతకు పూచీపడే ఈ రెస్క్యూదళం కార్యదీక్షకు, బాధ్యతకు, జోహార్లు!

            ప్రాచీన కాలపు తెలుగువాళ్ల ప్రజా కవి - తాళ్లపాక అన్నమయ్య సగటు భక్తజనుల కష్ట - నష్టాల పరిష్కారంగాను, రోదనల - వేదనల ఓదార్పు గాను

అదివో! అల్లదివో శ్రీహరి వాసమూ

పదివేల శేషుల పడగల మయమూ....అని పాడి, ఏడుకొండల్ని చూపించాడు.

            మరి, ఈ చల్లపల్లి స్వచ్ఛంద శ్రమదాతలేమో 2313* దినాలుగా ఊళ్ళోని ఏదో ఒక మూల -  ఏ మురుగు గుంటలోనో - శ్మశానంలోనో సమస్యల్ని పరిష్కరిస్తూ, అపరిశుభ్రతల్ని అస్తవ్యస్తతల్ని బహిష్కరిస్తూ - వీధి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తూ పాటుబడతారు!

            ఇంత చలిలో, మంచులో ఈ ఐదారుగురు కిలోమీటరు దూరంలో మురుగు గుంటల దగ్గర పడి ఉన్న తారు పెచ్చుల్ని, కంకర గులకల్ని తెచ్చి, విజయ్ నగర్ ఉపమార్గంలోని గుంటల్ని పూడ్చి, గ్రామస్తుల సౌకర్యం కోసం పని చేయడమేమిటి? 3 వ లైను దగ్గర సిమెంటు రోడ్డుకు పడిన గుంటలను ఈ కార్యకర్తలు ఎక్కడెక్కడి నుండో ఇసుక, కంకర, సిమెంటు తెచ్చి సమపాళ్లలో కలిపి, పూడ్చి, అది ఆరి బిగిసే వరకు వాహనాలు గుంటల మీదకి ఎక్కకుండా ముళ్ల కంప పరిచారు. ఇవాళ్టి శ్రమ ఏ మేరకు ఫలిస్తుందో చూద్దాం! వీలైతే ఈ స్వచ్చోద్యమ వ్యసన పరుల్నుండి ఏ కాస్తేనా స్ఫూర్తిని పొందుదాం!

            టాటా ఏస్ ట్రక్కు ఖాళీ ఉన్నందున కాబోలు - గుంటలు పూడ్చాక ఈ వాలంటీర్లు కొన్ని వ్యర్థాలను అందులో నింపుకొని, డంపింగ్ కేంద్రానికి చేర్చారు.

            నేటి గ్రామ స్వచ్ఛ - శుభ్ర - సౌందర్య నినాదాలను ప్రకటించింది మాలెంపాటి అంజయ్య గారు కాక మరెవరు?

            బుధవారం వేకువ మన శ్రమదాన గమ్యస్థలం బైపాస్ దారిలోని కమ్యూనిస్టు వీధి!

 

             షష్టి పూర్తి శివోహం! - 3

బ్రతుకు వెతల కథలెన్నో పరిష్కరించి చూపు మనిషి

వింత వైద్య శిబిరాలతొ విర్రవీగు రోగాలను

అదుపు చేసి పేద వాళ్ల కందజేసి స్ధైర్యాలను

క్రొత్త వైద్య సంస్కృతి సమకూర్చెడి ఒక వింత మనిషి!

 

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

  ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   27.12.2021.