2314*వ రోజు....           28-Dec-2021


ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...

 

సోమ-మంగళ వారాల నాటి- రక్షకదళ, ట్రస్టు కార్మికుల ప్రయత్నాలు (2314* వ రోజు)

 

నిన్నటి గ్రామ రక్షకుల రోడ్డు భద్రతా చర్యలు కాక మరి రెండు చోట్ల- రెండు, రకాల విశేషాలు జరిగాయి.  అవి-

 

1 తరిగోపుల ప్రాంగణం వెనుక చెత్త కేంద్రం ఉత్తరాన చిల్లలవాగు గట్టుపైన,

 

2 కోమలానగర్, వివేకానంద నగర్ కాలనీల్లో సాయంత్రం జరిగిన తడి-పొడి చెత్త సేకరణల అవగాహన.

 

ట్రస్టు కార్మికులు ఇన్నేళ్లుగా చేస్తున్నవి సేవలెలా ఔతాయనీ, వేతనం పొందుతున్నందున అవి ఉద్యోగ విధులేననీ గ్రామస్తులెవరైనా భావిస్తారేమో!  (లక్షల్లోజీత భత్యాలు పొందే ప్రభుత్యోద్యోగులెందరు ఇలా అంకితభావంతో విధులు నెరవేస్తున్నారో, ఉద్యోగాలను అదనపు ఆదాయ వనరులుగా మార్చుకోని పవిత్రులెందరో తెలియనిదెవరికి?)  ‘మనకోసం మనం ట్రస్టుపనివాళ్లు అందరిలాగే నెల నెలా ప్రతిఫలం పొందుతున్న మాట నిజమే గాని, పనిలో చిత్త శుద్ధి, గ్రామ మెరుగుదల పట్ల అంకిత భావం, తమ పనిలో నిమగ్నమై ఒక ఆనందం పొందే స్వభావం కాదన లేనివి! ఆహ్వానించదగినవి!

 

అరకిలోమీటరు పొడవునా చిల్లల వాగు ఉత్తరపు గట్టును (దీన్ని కనీసం 4 మార్లు స్వచ్చ కార్యకర్తలు బాగుచేశారు) ఈ ఉద్యోగులు మొక్కలు, తీగలు నరికి, గడ్డి తొలగించితుక్కుల్ని లాగేసి శ్రమించక ముందెలా ఉన్నదో తదుపరి ఎంత చూడ ముచ్చటగా ఉన్నదో వాట్సప్ చిత్రాలలో పరిశీలించండి.

 

నిన్న సోమవారం సాయంత్రం 5.00 నుండి గంటన్నరకు పైగా డజను మంది స్వచ్చ కార్యకర్తలతో బాటు కోమలా నగర్‌ కు చెందిన తాత్కాలిక కార్యకర్తలు 20 మంది  రెండు కాలనీల ఇళ్లన్నీ తిరిగి, ఏ చెత్తను ఏ రోజు పంచాయతీ ట్రాక్టరుకు అప్పగించాలో వివరించారు. కాలనీ వారి నుండి ఇంత మంచి స్పందన రావడం, 15 మందికి పైగా స్వచ్చ కార్యకర్తలతో కలిసి తమ సమయాన్ని ఊరి కోసం వెచ్చించడం విశేషం, శుభ పరిణామం!  ఉదయ సాయంసంధ్య ల్లోనూ ఇలా గంటల తరబడి గ్రామ సంక్షేమానికి ప్రయత్నించే ఇంత అంకితులైన కార్యకర్తలు కాగడాలు పెట్టుకొని వెదికినా దేశంలో ఇతర గ్రామాల్లో కనిపిస్తారా?

 

రెస్కూదళం ఐదారుగురు మళ్ళీ ఈ వేకువ 4.30 కే రహదార్ల గుంటల పూడిక కోసమూ, నిన్న, మొన్న పూడ్చిన గుంటల్ని తడిపి గట్టి పరిచేందుకూ సంసిద్దులైపోయారు!  ఏ యే రోడ్ల గుంటలెక్కడ - ఎన్ని ఉన్నాయో, ఎప్పుడెలా పూడ్చాలో-ఇదంతా వాళ్ల ప్రణాళిక ఒకటుంటది. ఆ లక్ష్యాల కనుగుణంగా వాళ్ళు శ్రమిస్తుంటారు.

 

కమ్యూనిస్టు వీధి మలుపు దగ్గర పూడ్చిన పల్లాన్నీ, భారత లక్ష్మి వడ్లమర వీధి కూడలిలో వెడల్పు చేసిన మార్జిన్లనూ వాట్సప్ లో ఒకసారి పరిశీలించండి.

 

6.30 తరువాత ఈ టీము సభ్యుడు మాలెంపాటి అంజయ్య గారు గ్రామ స్వచ్చ-శుభ్ర-సౌందర్య స్ఫోరక నినాదాలిచ్చి, తమ శ్రమదానాన్ని ముగించారు!

 

రేపటి మన గ్రామ వీధి మెరుగుదల కోసం కమ్యూనిస్టు వీధి(బైపాస్) చివర కలుద్దాం!

 

        షష్టి పూర్తి శివోహం! – 4

మానవ జీవన మర్మం తెలియజెప్పు పెద్దమనిషి

స్వచ్చోద్యమ నట్టనడుమ షష్టిపూర్తి జరుపుకొనే

ఒక వినూత్న సంప్రదాయ ప్రవర్తకుడీ క్రొత్త మనిషి.

అను నిత్యం పరుల క్షేమ మభిలషించు గొప్ప మనిషి!

    - నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

  ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

       28.12.2021.