2315*వ రోజు....           29-Dec-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి?

సామ్యవాద వీధిలో 2315* వ నాటి శ్రమదాన వినోదం.

        బుధవారం (29-12-21) నాటిది చల్లపల్లి స్వచ్చోద్యమ మంటారో – గ్రామ ప్రముఖులు, వీధి ముఖ్యులు తమ బజారు మొత్తాన్ని మరింత స్వచ్ఛ - సుందరంగా మార్చిన శ్రమవినోదమంటారో లేక 35 మంది నెరవేర్చిన సామాజిక బాధ్యత అంటారో –ఏదన్నా సమంజసమే (జన్మల మీద - కర్మల మీద వాటి కేంద్ర స్థానమైన దైవం పట్ల నాకే గనుక నమ్మకం ఉంటే... ఇది ఈ గ్రామం ఏనాడో చేసుకున్న పుణ్యం”....! అనేసే వాణ్ణి!)

        నేటి శ్రమదాన ఘట్టంలో విశేషాల మీద విశేషాలు! 58 ఏళ్ల, 79 ఏళ్ల ఇద్దరు నాదెళ్ల పూర్ణలూ, ఆరేళ్ల నుండి - 83-90 ఏళ్ల వయస్కులూ – వేకువ 4.15 నుండి 6.22 నిముషాల దాక 2 గంటలకు పైగా మైకు నుండి పాటలు వింటూ, పరస్పరం సహకరించుకొంటూ, చలినీ మంచునీ ఏకాస్తయినా గౌరవించక – తమ స్వార్ధం కాక ఊరి ఉమ్మ డి ప్రయోజనమే లక్ష్యంగా పాటుబడినందునే దీన్ని శ్రమదాన వినోదంఅంటున్నది.

        శరీర కష్టం సాధ్యపడని స్థానిక సీనియర్ నాదెళ్ల పూర్ణ గారు తమ పొదుపు మొత్తం నుండి 5000/- స్వచ్చోద్యమానికి విరాళం ఇవ్వడమొక విశేషమైతే (అమెరికాలో ఉంటూ మనకోసం మనంట్రస్టుకు హార్దిక - ఆర్థిక సహకార వ్యసనపరుడైన నాదెళ్ళ సురేష్ సంగతి గుర్తుచేసుకోండి - జన్యువుల లక్షణం - తప్పదు మరి!) వీధి ప్రముఖులు - మండవ, మాలెంపాటి, సబ్బినేని, నాదెళ్ల, కంఠంనేని, సూర్యదేవర కుదుళ్ల వారు క్లుప్తంగా, బలంగా స్వచ్చంద శ్రమదానం పట్ల తమ ఆరాధనా భావాన్ని ప్రకటించడం రెండో విశేషం!

        అసలు ఈ స్వచ్చ కార్యకర్తల అభినివేశం నానాటికీ చిక్కబడి, పదును తేలుతున్న సంగతిని గుర్తించారా? ఒక ప్రక్క ఈ ఉషోదయ గ్రామ సేవ! ఇది ముగిస్తే ట్రస్టు కార్మికుల సుందరీకరణమో, పటిష్టీకరణమో వేరొక వంక! సాయంత్రం మళ్ళీ 2 గంటల పాటు ముఖ్య వీధుల్లో (నిన్న సాయంత్రమైతే 20 మంది) రకరకాల వ్యాపారులకు గ్రామ  స్వచ్చ – సుందర స్పృహ కల్గించే ప్రయత్నం! అంటే ప్రతిరోజూ - ముప్పూటలా ఊళ్ళో ఏదో ఒక చోట ఈ స్వచ్చోద్యమ పతాకం ఎగురుతూనే ఉంటుందన్న మాట!

        మరి ఇలాంటి తప్పనిసరి పరిస్థితిలో విజ్ఞత గల చల్లపల్లి గ్రామం దేశంలోని లక్షలాది గ్రామాలకు తలమానికంగా - ఆదర్శంగా మారక ఎంత కాలం మిగిలిపోగలదు? ఊరికంకితభావం వంటబట్టిన ఈ 30 కి పైగా కార్యకర్తల నేటి 60 కి పై బడ్డ పనిగంటల ఫలితంగా:

- అసలే ఊరికి, ప్రాంతానికి ఒక అద్భుత సందర్శక వీధిగా పేరొందిన కమ్యూనిస్టు బజారు మరింత శుభ్ర - సుందరంగా మారింది.

- అందులో కమ్యూనిస్టు ఆఫీసు గా పిలవబడే భవనం ఆవరణ 15 మంది శ్రమదాతల పట్టుదలతో బాగా మెరుగుపడింది!

- కొసరుగా బందరు రహదారిలో కొంతభాగం, ఏడెనిమిది మంది ఉత్సాహంతో ప్రక్కనున్న సూరి డాక్టరు వీధిలో కొంతమేరకు కూడ స్వచ్చ - శుభ్రతల భాగ్యం కలిగింది!

- బైపాస్ మార్గంలో ఆరేడుగురు సుందరీకర్తలు, సూరి డాక్టరు గారి బజారులో మరో ఏడుగురు సాధించిన వీధి పారిశుద్ధ్య మెరుగుదల దీనికదనం!

        7.00 సమయంలో - కృషి సమీక్షకు ముందు – ఊరి శుభ్ర – స్వచ్ఛ - సౌందర్యాకాంక్షను ముమ్మారు నినదించినది, చల్లపల్లి స్వచ్చోద్యమ విశిష్టతను కొనియాడి ముక్తాయించినదీ మండవ బాలవర్ధనరావు.

        ఈ సాయంత్రం 4.00 కు NTR పార్కు దగ్గరకూ, రేపటి వేకువ వీధి పారిశుద్ధ్య  శ్రమదానానికి బైపాస్ మార్గంలో - సూరి డాక్టరు బజారుకూ మనం హాజరు కావలసి ఉన్నది!

 

             ఒక తీపి పాట

ఔను సుమా! నేనన్నది ఔను నిజం! ఔను నిజం!

చల్లపల్లి స్వచ్చోద్యమ సంరంభం తీపి నిజం!

జన జాగృతి పెరగాలని – శ్రమ సంస్కృతి విరియాలని

గ్రామస్తులు స్వచ్చ కార్యకర్తలుగా మారాలని

స్వస్తతకై నిత్యం శ్రమదానం చేస్తుండాలని

దేశాలకు చల్లపల్లి దిక్సూచిగ నిలవాలని

 

అది - కష్టంగా కాక భలే ఇష్టంగా జరగాలని

ఈ ఉద్యమ రథసారథి స్వప్నం ఋజువవ్వాలని.....

ఔను సుమా నిజం - నిజం! నేనన్నది నిజం - నిజం!

(శ్రీ శ్రీ మహా ప్రస్థానం లోని చేదుపాట గేయం పట్ల కృతజ్ఞతతో...)

 

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   29.12.2021.