2316*వ రోజు.......           30-Dec-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి?

కొనసాగుతున్న వీధి పారిశుద్ధ్య శ్రమదానం @2316*

          గురువారం వేకువ కూడ వీధి శ్రమదాన సమయం 4.14 నుండి 6.15 దాక! అందుకవకాశమిచ్చిన అదృష్టం బైపాన్ బాట, సూరి డాక్టరు వీధులది! పాల్గొన్న సామాజిక చైతన్యవంతులు 34 మందైతే - స్థానిక ప్రాతినిథ్యం సబ్బినేని బోసు, లైన్ మెన్ సాంబశివరావులతో సహా ముగ్గురిది! తమ వీధి శుభ్ర సౌందర్య సంరంభాన్ని ఖాతరు చేయని నిద్రాపరవశులు 30 కి పైగా ఇళ్ల వాళ్లు!

          తమ ఇరుకు వీధిలో - వాకిళ్లలో - నానా కంగాళీలను 30 మంది కార్యకర్తలు ఊడుస్తుంటే - అక్కడక్కడ అవరణల్లో కూడ కొన్ని చెట్లను ట్రిమ్ చేసి, మురుగు కాల్వల చెత్తదీసి, గడ్డికోసి....తమ వీధి స్వచ్ఛ సౌందర్యాభి వృద్ధికై శ్రమిస్తుంటే - ఇంత బృహత్ప్రయత్నాన్ని - ఇంత సందడిని - ఇంత ఆదర్శాన్ని పట్టించుకోని, పాల్గొనని, చలించని గ్రామ సోదరులు అదృష్టవంతులా - దురదృష్టవంతులా?

          ఈ నడుమ కాస్త మెరుగు పడుతున్నది గాని, సూరి డాక్టర్‌ బజారు అనబడే ఈ ఇరుకు వీధిలో క్రమం తప్పిన మురుగూ, ప్లాస్టిక్ తుక్కులూ, గడ్డీ - గాదం, రోడ్డెక్కిన ఇళ్ల ర్యాంపులూ, మెట్లూ, ఎంగిలాకులూ, ప్లాసిక్ సీసాలూ, ఖాళీ టిఫిన్ పొట్లాలు ఎంత భీభత్సంగా ఉండేవి? నాలుగైదు ఖాళీ స్థలాల్లో క్రిక్కిరిసిన పనికిరాని మొక్కలెలా పెరిగిపోయేవి? లారీలు ఈ చివర నుండి ఆ చివరకు నడవ గలిగేవా?

          గత ఏడేళ్లలో ఈ స్వచ్ఛ కార్యకర్తల తట్టుకోలేక నాలుగైదు మార్లు శ్రమకు కాలుష్యం తగ్గిపోతూ వచ్చింది. ఈ చిన్న వీధి నుండి ఈ వేకువ కనీసం ముగ్గురు కొత్తవారు వచ్చి శ్రమదానం చేస్తే అది అల్ప సంతోషమని ఎందుకనుకోవాలి? ఈ వీధిలో ఇన్ని ఇళ్ల ముందు రంగవల్లుల్తో అలంకరిస్తున్న గృహిణులు కొందరైనా ఈ ఉదయం కలసివస్తే ఇంకెంత సంతోషిస్తాము!

60 పని గంటల్లో – 34 మంది శ్రమదాతలు ఈ వేకువ కాలంలో సాధించిందేమనగా :

- ‘సుందరీకర్తలుఅనే విశిష్ట నామంకల ఆరేడుగురు సాగర్ టాకీస్ ఉపమార్గంలో

అటు బుల్లి అపార్ట్ మెంట్ ప్రక్కన కంగాళీలను ఏరి, తొలగించి, చదును చేయడమూ, ఇటు హద్దూ అదుపు తప్పిన మూల మలుపులోని డ్రైనును సంస్కరించి, విశాల పరచి, సుందరీకరించడమూ.

- ఇరుకు రోడ్డును బందరు రాదారి దాక ఆసాంతం అన్ని విధాల బాగుచేసి, ఒకటి పూర్తిగాను, రెండు ఖాళీ స్తలాలను పాక్షికంగాను, మొక్కలు నరికి, గడ్డి కోసి, పిచ్చి మేడి చెట్ల పని బట్టి... వీర విహారం చేసిన పాతిక మంది స్వచ్చ కృషీ వలురు!

- గుట్టల కొద్దీ తుక్కును ట్రాక్టర్ లో నింపినదీ, బాటనంతా అద్దంలా ఊడ్చినదీ వీళ్ళే!

- 6.45 కు ఊరంతటి స్వచ్ఛ శుభ్ర - సౌందర్య సాధనను ముమ్మారు ఎలుగెత్తి నినదించినదేమో ఎలక్ట్రిసిటీ లైన్ మెన్ సాంబశివరావు!

- చల్లపల్లిలో ఇంతగా శ్రమ జీవన సౌందర్య సన్నివేశాలకు పులకించి ప్రోత్సహించినది మాత్రం డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాదు గారు!

          రేపటి వేకువ కూడ మరింత మంది శ్రమ దాతలు వచ్చి, కలుసుకోదగిన చోటు - పాత కస్తూర్భాయి వైద్యశాల దగ్గరే! పురోగమించవలసింది మాత్రం యడ్లవారి, షాబుల్ వీధులే!

శ్రీశ్రీలాగా చెప్పాలంటే

ఓ మహాత్మా! ఓ మహర్షీ!

ఏది నష్టం - ఏది కష్టం? దురదృష్టమదృష్టమేమిటి?

గ్రామమంటే ఇసుక మట్టా? గ్రామమంటే జనం కాదా?

కార్యకర్తల తపస్సెందుకు ఊరి స్వస్తత కోరి కాదా?

మనం మన కోసం శ్రమిస్తే - గ్రామ సౌఖ్యం మెరుగుపడదా?

హరిత సంపద స్వచ్ఛ శుభ్రత అందలంలో తిరుగుతుంటే -

అందమే ఆనంద' మను కవి అంతరార్ధం బోధపడితే

కార్యకర్తలె కాకజనమూ కలిసి మెలిసీ శ్రమిస్తుంటే

ఊళ్ళు నందనమైతే దేశం ఉన్నత స్థితి చేరుకొనదా?

          ఓ మహర్షీ! ఏది స్పందన? ఓ మహాత్మా! ఎచట బాధ్యత?

నీవు నేర్పిన విద్యలేమిటి - నేడు జరిగే తంతులెందుకు?

 

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

  ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

  30.12.2021.