2317*వ రోజు....           31-Dec-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి?

అలుపెరుగని - స్ఫూర్తి తగ్గని గ్రామ స్వచ్చోద్యమం - @2317*.

        ఈ శుక్రవారం – 2021 వ సంవత్సరాంతపు వేకువలో - చలిగాలులు మనుషుల సహనాన్ని పరీక్షిస్తున్న 4.19 సమయంలో - ఇరుగో 17 మంది కార్యకర్తల వీధి పారిశుద్ధ్య సంసిద్ధత! అదే బైపాస్ మార్గంలో! కొన్ని క్షణాల్లో వచ్చి - ఇంకా 15 మంది - అంటే మొత్తం - 32 మంది - అడపా, యడ్ల వంశస్తులు కాక మరో ఇద్దరు స్థానిక మహిళలు కూడ – 2 గంటల పాటు సాగించిన సమరంతో - సాధించిన పారిశుద్ధ్య ప్రగతేమంటే - వంకరటింకరగా - ఇరుకుగా ఉన్న యడ్లవారి వీధి మరో మారు స్వచ్ఛ - సుందరమైపోవడం!

        ఐదారుగురు గ్రామ సుందరోద్యమ వీరుల ప్రధాన వీధి సుందరీకరణం దీనికదనం! రహదారి వనాల నవీకరణం, రోడ్డు మార్జిన్ల ఎగుడుదిగుళ్లను చదును చేయడం, ఆ దారిలో ప్రయాణికుల చూపుల్ని ఈ సుందరీకృత ప్రదేశం వంకకు త్రిప్పేయడం అందులో భాగం!

        20 మందికి పైగా కార్యకర్తల పెనుగులాటతో – యడ్ల వారి వీధి అరకిలోమీటరు మొత్తం మురికి వదిలిపోయి, మార్జిన్ల పిచ్చి - ముళ్ల మొక్కలు తొలగిపోయి, ఇసుక దుమ్ము - ఆకులలములు అదృశ్యమై, చివరకు 6.00 కు ముందే ఈ వ్యర్ధాల గుట్టలన్నీ ట్రాక్టర్లో కొలువు దీరి, డంపింగ్ కేంద్రానికి పయనించాయి! బైపాస్ - బందరు రహదార్ల నడుమ స్వచ్ఛ - శుభ్రతా సాధకులకు జేజేలు!

        నాకు ప్రతి రోజూ ఒక రకమైన దిగులు కల్గించే ఆలోచనేమంటే:

ఈ స్వచ్ఛ కార్యకర్తలే కనుక 2317* దినాలుగా - 3 లక్షలకు పైగా పని గంటలుగా –  ఊరి వీధుల కాలుష్యం మీద తిరుగుబాటు చేయకుంటే - రహదార్ల సుందరీకరణం పట్టించుకోకుంటే - బహిరంగ ప్రదేశాల, శ్మశానాలు, కొన్ని కార్యాలయాలు, దేవాలయాల కశ్మలాల మీద విప్లవించకపోయుంటే ఇప్పుడందరూ మెచ్చుకొంటున్న చల్లపల్లి గతి ఏమిటీ అని! స్వచ్చోద్యమ కారులు గనుక ఒక నెల పాటు సమ్మె చేస్తే ఇంత స్వచ్ఛ సుందర గ్రామం ఎలా మరి పోతుందో అని!

        ఇలాంటి వన్నీ లేనిపోని పిచ్చి సందేహాలే కావచ్చు –  ఎందుకంటే - గ్రామ స్వచ్ఛ -సుందరోద్యమ దీక్ష నరనరానా జీర్ణించుకొన్న –  దాన్నొక (మంచి) వ్యసనంగా మలచుకొన్న స్వచ్ఛ కార్యకర్తలు ఇంకొక దశాబ్దమైనా దాన్నుండి బైటపడలేరని నా నమ్మకం - అప్పటికి ఈ స్వచ్ఛ శుభ్ర - సుందరోద్యమ వ్యసనం ఊళ్ళో ఇంకెంత మందికో - తరువాతి తరానికో అంటుకోవచ్చు!

        నేటి స్వచ్చంద యడ్ల వీధి పారిశుద్ధ్య శ్రమ వేడుక 6.25 కు ముగిసి - 10 నిముషాల కాఫీ కబుర్ల పిదప - ఈ సంవత్సరాంతపు త్రివిధ స్వచ్ఛ శుభ్ర సౌందర్య సమగ్ర గ్రామ నినాదాలిచ్చిందీ - కొత్త సంవత్సర తిధి - వార - కాలమాన పట్టికల్ని కార్యకర్తలకు పంచిందీ - కొన్నాళ్ల ఎడంతో వచ్చిన వేముల శ్రీనివాస్.

        వరసక్రమం ప్రకారం మనం క్రొత్త సంవత్సర శ్రమదాన వేడుక జరుపుకోదగిన రేపటి చోటు - షాబుల్ బజారు తిన్నగా బైపాస్ మార్గమే!

 

            స్వచ్చోద్యమ సాఫల్యం

అసమంజస చర్చలేని - అహంకార మచ్చరాని

కుల మతాల గొడవెరగని గొప్ప ఉద్యమం ఇదే!

రాజకీయరచ్చెరుగని శ్రమదాన పథం ఆగని

స్వచ్చోద్యమ సాఫల్యత సంభవించు గ్రామమిదే! -

 

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

  ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

  31.12.2021.