2318*వ రోజు.......           01-Jan-2022

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి?

ఎనిమిదేళ్ళవుతున్నా తగ్గేదేలేఅంటున్న గ్రామ స్వచ్ఛ ఉద్యమం - @2318*

          శనివారం నాటి ఆంగ్ల నూతన సంవత్సరాదిన కూడా సాగర్ టాకీస్ దగ్గర, వీధి మలుపులో చల్లపల్లి స్వచ్ఛ సుందర ప్రయత్నం కధ పాతదే! మంచు, చలిగాలి యదాతధమే! 4.20 కి, దైనందిన వీధి పారిశుద్ధ్యాన్ని ప్రారంభించేందుకు ఠంచనుగా వచ్చిన ఈ 43 మంది బాధ్యులు కాక - ఆలయాల దగ్గరి భక్త జనులు కాక - ఏ కొద్ది మందో అనివార్యంగా మేల్కొనడమే గాని, పాత ఏటిని మూలకు త్రోసి, క్రొత్త ఆశల ఏడాదిని కావలించుకొని - (కొందరైతే గానాబజానాల్లో మునకలేసి) - అలసిసొలసి, చాలా మంది ఏడెనిమిదింటికి గాని మేల్కొనరాయే! 

          ఇక అప్పుడు లేచిన అదృష్టవంతులు కాస్త పరిశీలించి చూస్తే ఏం కనిపిస్తుంది? తమ ఊళ్లో కనీసం 2 వీధులు నిన్నటికన్న భిన్నంగా మెరుగ్గా మారిన దృశ్యమే కదా?

          ఏడేనిమిదేళ్ళ క్రితం వలె కాక ఎక్కువ మంది గ్రామస్తులు ఇప్పుడు ఈ మైకు పాటల చప్పుళ్ళని కార్యకర్తల పలుగుల, పారల, కత్తుల, చీపుళ్ళ, రైల్వే పారల, గోకుడు పారల మ్రోతల్నీ పని హుషారులో కొందరి ఉద్వేగభరిత, ఉద్రేకనియత కంఠస్వరాలని సహిస్తున్నారు, భరిస్తున్నారు, కొంత మేరకు హర్షిస్తున్నారు. సదాలోచనాపరులైన నా చల్లపల్లి గ్రామ సోదరులు పబ్ ల వినోద సంస్కృతిని కాక మద్యపాన వికృత సంస్కృతిని కాక రహదారి మార్జిన్ల కబ్జా దుష్క్రతిని కాక, తమ ఊళ్లో తమకోసమే ఎనిమిదేళ్లుగా రెక్క విప్పుతున్న విజ్ఞాన, వినోద ఆరోగ్యాలే ధ్యేయంగా మొగ్గ తొడుగుతున్న ఒక వినూత్న స్వచ్చంద శ్రమదాన సంస్కృతికే ఓటేస్తారని నా సంపూర్ణ విశ్వాసం

          నా నమ్మకానికి ఆధారం ఇదిగో 2022 వ ఏటి తొలి వేకువనే 43 మంది గ్రామ వీధుల పారిశుద్ధ్య ప్రక్రియ. పాత కార్యకర్తలు 35 మందే కాక షాబుల్ వీధి, ఇరుగు పొరుగు వీధులకు చెందిన 10 మంది కొత్త వాళ్ల ప్రమేయం! వీళ్ళంతా ఏదో మొహమాటంతో కాక ఇదేదో గ్రామ సేవ అనుకోక – ‘ఇది కేవలం తమ కనీస సామాజిక బాధ్యతఅనే స్పృహతో రెండు గంటల పాటు పరుల కోసం శ్రమించడమే ఈ రాష్ట్రంలోని -  దేశంలోని వేలాది, లక్షలాది గ్రామాల నుండి చల్లపల్లిని వేరుచేసి చూపుతున్నది!

          కొంగ్రొత్త సంవత్సరం తొలి ఉషోదయాన ఈ 40 మందికి పైగా స్వచ్చ సంస్కృతి ప్రదాతలు సినిమా హాలు సమీపాన ఏం సాధించారని ప్రశ్నిస్తే – ‘30 వేల మంది నివసించే ఊళ్లో – 120 వీధులలో కనీసంగా రెండు వీధుల్లోనైనా వీళ్ళు చేయనిది ఏ పని?’  అనే ప్రశ్నే దానికి సమాధానం.

          6.40 సమయంలో మైకు సాక్షిగా గోళ్ళ వెంకటరత్నం ఉద్వేగంగా కనీసం ముమ్మార్లు గ్రామ స్వచ్చ శుభ్ర సౌందర్య ఉద్యమ నినాదాల్ని వినిపించడం కాక ఎవరు పంచుతున్నారో ఎవరు స్వీకరిస్తున్నారో తెలియనంతగా ఐదారుగురు ప్రాతూరి శాస్త్రి గారి రవ్వ లడ్లు, పల్నాటి వారి కిస్ మిస్ లడ్లు, మారుతి గారి చిట్టి లడ్లు, గంధం వారి నేతి బొబ్బట్లు, ధ్యాన మండలి తరపున తినుబండారపు ప్యాకెట్లు ఇవి గాక కాఫీ, టీ ల సత్కారాలు, తోట డ్రైవరు గారి పలహారాలు వగైరాలన్నీ చల్లపల్లి స్వచ్చోద్యమ వేడుక విశేషాలే. ఇక అప్పుడు  గానీ వేకువ 4 గంటలకే మేల్కొన్న స్వచ్ఛ కార్యకర్తలు 7 గంటలకి ఇళ్లకు చేరుకొని ఉంటారు.

          ఘంటా లీలాకృష్ణయ్య గారి 705/-  విరాళం నేటి మరొక విశేషం. కంఠంనేని జ్యోత్స్నాదేవిపాలడగు రత్న కుమార్ల 12,000/-, ఇంకా శోభారాణి పిచ్చియ్య గార్ల 10,000/- బ్యాంకు చెక్కు విరాళాలు కూడా మన స్వచ్చోద్యమానికి అంకితమైనవి. మన ఊరి కోసం ఇలాంటి ఆర్ధిక సమయ శ్రమదానాల రుచి మిగిలిన చల్లపల్లి గ్రామ సహోదరులకు సైతం తెలిసి రాగలదని విశ్వసిద్దాం!

          ఆదివారం వేకువ శ్రమ సంస్కృతీ పరివ్యాప్తి కోసం ఇదే బైపాస్ మార్గంలో పాత శిధిల ప్రభుత్వాసుపత్రీ వద్దనే మన పునర్దర్శనం.

 

          ఈ ఉద్యమ సంరంభం

ఇది కొందరి ఉద్వేగమొ - ఏ ఒక్కరి ఆవేశమొ -

మహారంభ శూరత్వమొ మరొకటో కాదు సుమా!

చల్లపల్లి స్వచ్చోద్యమ ప్రస్థానం నిబద్ధితం -

నిమంత్రితం - నియంత్రితం - నిరంతరం - తరంతరం!

 

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

  ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

  01.01.2022.