2319*వ రోజు....           02-Jan-2022

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి?

38 మంది 3 రోడ్ల పారిశుద్ధ్యం 2319* వేకువలు.

            ఇది క్రొత్త ఏడాదిలో తొలి ఆదివారం! తమ స్వార్థ చింతనను 2 గంటల 10 నిముషాల పాటు ప్రక్కకు తోసిన కార్యకర్తలు + స్థానికులేమో 33+5 మంది! వీరిలో ఇంటి పనుల కాలాన్ని, ఉదయం నడక సమయాన్ని, ఆస్పత్రుల బాధ్యతల్ని వాయిదా వేసుకొన్న, సర్దుబాట్లు చేసుకొన్న గృహిణులు, వైద్య సిబ్బంది ఉన్నారు! 8 ఏళ్ల విద్యార్థి మొదలు 73 ఏళ్ల పెద్దలూ ఉన్నారు! అందరూ గ్రామ స్వస్తతా సంక్షేమ నిబద్ధులే! ఈ రెండు గంటల పాటే కాదు - రోజులో వీలైన - అన్ని సమయాల్లో తమ గ్రామ పారిశుద్ధ్యం మీద, రహదార్ల మార్జిన్ల దురాక్రమణల మీద, ఓ కన్నేసి ఉంచేవాళ్లే!

            మరి - కంటికి రెప్పల్లాంటి వీళ్ల పర్యవేక్షణలతోనే - ఇన్ని లక్షల పనిగంటల శ్రమత్యాగంతోనే – “నా గ్రామం పారిశుద్ధ్య చైతన్యంలో దేశంలో అందరికన్న ముందుండాలిఅనే దీక్షతోనే గదా ఏడెనిమిదేళ్ల నుండి ఈ చారిత్రక గ్రామం పతాక శీర్షికల్లో నిలుస్తున్నది? ఇక - ఇప్పటికీ సహకరించని 50% మంది గ్రామస్తుల సంగతేమిటంటారా? “ఈ విషయంలో కూడ - ఏనాటికైన వాళ్లు సైతం మారక తప్పదుఅనే కార్యకర్తల - నమ్మకానిదే అంతిమ విజయం!

            ఈ ఆదివారం పూట - ఇంతమంది - ఇన్ని పనిగంటలు ఇంత మంచులో చలిలో ఏం ఊడబొడిచినట్లు అంటే :

1) బైపాస్ వీధిలో ఒక చోట రెండు ప్రక్కలా పడిన గుంటలు మరింత ప్రవర్థమానములై రోడ్డును దెబ్బతీయకముందే - వాహనదారుల సౌకర్యం దృష్ట్యా - సదరు గుంటల్ని రెస్క్యూ టీం వారు పూడ్చడం! అందుకుగాను బరువైన సిమెంట్ స్తంభాన్ని, దుంగనీ మోసుకొచ్చి, రాతి ముక్కల్ని అమర్చిన శ్రమ!

2) సాగర టాకీస్ ప్రహరీ ప్రక్కన - ముఖ్యంగా ఉత్తరపు ప్రవేశ ద్వారం దగ్గర సుందరీకర్తలు వంచిన నడుమెత్తకుండా (ఇందులో మరీ ఒకతని నడుమైతే ఇలా నిరంతరం వంగి - వంగి కొన్నాళ్ల తర్వాత ఇక అలానే ఉండిపోతుందని నా అనుమానం!) చదునుచేయడం!

3) అసలు ఈ నాటి ముందస్తు ప్రణాళిక ప్రకారం కార్యకర్తల లక్ష్యం - ఇటు కబేళా రోడ్డు మొదలు, సంత/రైతు బజారునంతా తీర్చిదిద్దాలనే గాని సినిమా హాలు వరకే పూర్తయింది! (వీళ్లలో కొందరు మరీ అత్యాశాపరులుంటారు - ప్రక్క సందుల్లో కాలుష్యాలను కూడ వదలరు -)

4) కాస్త వెలితిగానైనా సరే ఈ రోజు కూడ ట్రక్కు బండెడు చెత్తలు ట్రాక్టర్ లో కెక్కి డంపింగ్ యార్డుకు చేరుకున్నాయి!

            అదలా ఉంచి, ఇవాళ్టి శ్రమదానంలో శుభ్ర - సుందరమైన బైపాస్ వీధిని, సంత వీధిని, పాక్షికంగా రెండు చిన్న వీధుల్ని చూసి పులకించవలసిందీ, ధన్యవాదాలు చెప్పవలసిందీ, రేపటి నుండైనా వచ్చి కార్యకర్తలతో చేతులు కలపవలసిందీ....ఈ వీధుల నివాసితులా లేక వాళ్ల తరపుననేనా?

            6.45 కి చల్లపల్లి స్వచ్చోద్యమ ఆశయాలను చొరవచేసి మూడు మార్లు నవ్వు ముఖంతో నినదించినది - మూడో తరగతి విద్యార్థి మణికంఠ’.

            బుధవారం వేకువ సంత, రైతు బజార్ల మీదుగా బందరు రహదారి దాక శ్రమించవలసిందీ, సినిమా హాలు మలుపు దగ్గర కలుసుకోవలసిందీ 40 మంది కార్యకర్తలం!

           

            ఇన్నాళ్లుగ పొరబడినా...

శ్రమదానం సదాచార సంపన్నమె కాదనుకొని

ఎవరెవరో మన బాధ్యతలిన్ని నాళ్లు మోశారని

ఇకపైనా అదే రీతి ఎందుకింక సాగాలని

అనుసరించి తలదాల్చుడు స్వచ్చోద్యమ ఆశయాన్ని!

 

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

  ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

  02.01.2022.