2320*వ రోజు....           03-Jan-2022

ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి?

2320* వ నాడు కూడ 10 మంది పారిశుద్ధ్య శ్రమదానం.

          సోమవారం వేకువ (3-1-2022) సమయంలో మంచి చలి గాలిలో జరిగిన వీధి పారిశుద్ధ్య విన్యాసాలు సూరి డాక్టరు బజారు నామాతరం గల ఉప్పల వారి వీధిలో. తొలుత హాజరైనది రెస్క్యూ టీమ్ పంచపాండవులే గాని (ఇందులో భీముడు కాస్త లేటుగా ఎంట్రీ ఇచ్చాడు!)  వీళ్ల పనిలో ట్రస్టు ఉద్యోగులు వచ్చి వేలుపెట్టి, ఇద్దరు స్థానికులు కూడ కాలుపెట్టి - మొత్తం 10 మంది సమైక్య బలంతో చిన్న వీధి మరింత శుభ్ర - సుందర - సౌకర్యవంతంగా మారింది!

          ఈ మధ్య ఎప్పుడోగాని, చల్లపల్లి స్వచ్చోద్యమం 5 పని దినాల వారంగా మారింది. అయితే -  రెస్క్యూ దళం వాళ్ల ఉత్సాహంలో మార్పులేదు. ఆస్పత్రుల్లో అత్యసర కేసులు 7x24 గంటలూ చూడబడినట్లే రోడ్ల, వీధుల లోపాల తీవ్రతను బట్టి ఈ టీము ప్రణాళికలూ, పరిష్కారాలూ ఉంటాయి!

          ట్రస్టు కార్మికులూ అంతే! వాళ్లు గ్రామ మెరుగుదల చర్యలు కేవలం డ్యూటీగా కాక - ప్రతిఫలం లెక్కలేసుకొని కాక - అవసరాన్ని బట్టి చేస్తుంటారు. వీళ్ళు సరే - స్థానికులైన లైన్ మెన్ సాంబశివరావు, అతని మిత్రుడూ కేవలం స్వచ్ఛ స్ఫూర్తితో - సామాజిక స్పృహతో వచ్చి, కలిసి పనిచేయడం అభినందనీయం. ఊళ్ళోని చిన్న - పెద్ద - మొత్తం 125 వీధుల స్థానికులు సైతం ఇలాగే వచ్చి, రెస్క్యూ టీమ్ తోనో - స్వచ్ఛ కార్యకర్తలతోనో ఇలా బహుళ ప్రయోజక శ్రమదానంలో పాల్గొంటే స్వచ్ఛ సుందర చల్లపల్లిలో ఎన్నెన్ని అద్భుతాలు జరుగుతాయో మరి!

          4.30 కు చలిలో - మంచులో మొదలైన నేటి కృషి పొడిగింపులకు లోనై BSNL నరసింహరావు మూడు మార్లు ప్రకటించిన సుప్రసిద్ధ స్వచ్ఛ శుభ్ర సౌందర్య నినాదాలతో ముగిసేప్పటికి 7.00 అయింది. ఈ రెండున్నర గంటల కాలంలోనే :

- నాల్గు రోజుల నాటి ఈ ఇరుకు వీధి మార్జిన్ల డ్రైన్ ఎండు మట్టితో సహా ఇతర వ్యర్థాలన్నీ టాటా ఏస్ లో కొలువుతీరి, గంగులవారిపాలెం వీధి మార్జిన్ల అవసరాలను తీర్చాయి.

- అక్కడక్కడా ఉన్న పూల మొక్కల్ని తప్ప కార్యకర్తలు ఏ పెంకు ముక్కల్నీ, ఇసుకనీ, దుమ్మునీ, ప్రహరీలు దాటి బయటి కొచ్చి, వికారంగా ఉన్న ఏ చెట్టు కొమ్మనీ వదల్లేదు.

          గ్రామ వీధులన్నీ ఆదర్శంగా తీసుకోదగింది - ఇలా స్థానికులు తమ సొంత రోడ్ల పారిశుద్ధ్య నిర్వహణకు పూనుకోవడాన్నే!

 

          అదొక గట్టు ఇదొక ఒడ్డు!

విచిత్రములగు కీర్తి కాంక్షలు - వినశ్వరమగు ఎండమావులు

అవసరాలకు మించి సంపద - అలవి కాని దురహంకారం

వీటి కన్నా పూర్తి భిన్నం స్వచ్ఛ సైనిక శ్రమ విరాళం

అనుసరిస్తే ఆదరిస్తే - అదే భవితకు వర ప్రసాదం!

 

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

  ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

  03.01.2022.