1896* వ రోజు....           20-Jan-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1896* వ నాటి పరిపూర్ణతలు.  

          ఈ వేకువ 4.00 నుడి 6.15 వరకు చేసిన గ్రామ స్వచ్చ-సుందర తపస్సులో 34 మంది భాగస్వాములు. కొద్దిపాటి అంతరాయాలతో 2 వారాలుగా నిర్వహిస్తున్న గంగులవారిపాలెం దారి(1 కి.మీ.కు తక్కువగా) స్వచ్ఛ - సుందరీకరణం 99 శాతం సంతృప్తిగా ముగిసిన ఈ నాటి వివరాలు:

 

          - స్థానికులు ఉత్సాహంగా పాల్గొనడం, గొర్రులు, చీపుళ్లతో దారిని, మురుగు కాల్వ గట్టును ఊడ్చి, శుభ్రం చేయడం.

 

          - గంగులవారిపాలెం వంతెన దాక కొందరు పెద్ద చెట్ల కొమ్మల్ని తొలగించి, మరింత అందమైన ఆకృతుల్ని తీర్చిదిద్దడం.

 

          - తారు రోడ్డు మీద అంగుళం మందాన పేరుకొన్న మట్టిని, ఇసుకను - అందులో మొలిచిన గడ్డిని, పారలతో గోకి, చెక్కి  ఆ దారి సహజతత్వాన్ని నిలబెట్టడం.

 

          - ఈ నాటి వ్యర్ధాలన్నిటితో బాటకు, మురుగు కాల్వ ఒడ్డుకు మధ్య పడుతున్న గోతులు పూడ్చి, రోడ్డుకు రక్షణ కల్పించడం.

 

          - ఏడుగురు కార్యకర్తలు వీధి లైట్లన్నా వెలగని - పావు భాగం చంద్రుని గుడ్డి వెన్నెలలోనే దారి మలుపు ప్రక్కన మిగిలిన సగం ఎండు గడ్డిని, పిచ్చి కంపనీ, చెట్లను తొలగించి, ఖాళీ స్తలాన్ని శుభ్రం చేయడం - అది కూడ ముళ్ల మధ్య పనికావడంతో కాస్త జాగ్రత్తగా చేయడం.

 

          కాస్త ఆలస్యంగా మొదలైన మంచుతో-చలి గాలితో ఈ అన్ని పనులు చేసిన కార్యకర్తలెవరూ ఇబ్బంది పడటం నాకు కనిపించలేదు సరికదా, ఒక్కొక్కరు నాలుగేసి మార్లు నీళ్లు త్రాగడం వారి శ్రమకు గుర్తు!

 

          ఒక వృద్ధుడు కూర్చునేందుకు కాళ్లు సహకరించక – మోకాళ్ల పైనే కూర్చుని 10 నిముషాల పాటు కత్తితో పచ్చి - ఎండు గడ్డిని నరుకుతున్న పట్టుదలను చూడగలిగాను.

 

          ఇలాంటి ప్రజోపయుక్త స్వచ్చంద శ్రమదానంతో ఇప్పుడు ఈ గంగులవారిపాలెం మార్గం మిగిలిన గ్రామ మార్గాలన్నిటి కన్న స్వచ్చ - శుభ్ర - మనోహరం గా కనిపిస్తున్నది.

 

6.40 నిముషాలకు జరిగే సమీక్షా సమావేశంలో:

 

- బొమ్మిశెట్టి ఆత్మపరబ్రహ్మం గారు కాస్త లయబద్ధంగా ముమ్మారు ఎలుగెత్తి చాటిన గ్రామ స్వచ్చ-సుందర సంకల్ప నినాదాలతో మన శ్రమదానం రేపటికి వాయిదా పడింది.

 

- ఈ మధ్యనే మల్లంపాటి ప్రేమానందం గారు పంచిన క్రొత్త రకం పర్యావరణ హిత సంచుల్ని రేపు-అందమైన రంగులు, నినాదాలు వ్రాయడం కోసం దేసు మాధురి గారికి అప్పగించాలని ప్రకటించారు.

 

కారణాంతరంతో ఈ సోమవారం కాక, రేపు- అనగా మంగళవారానికి వాయిదా పడిన బందరు రహదారి శుభ్ర-సుందరీకరణ కోసం రేపటి వేకువ 4.00 కు కీర్తి వైద్యశాల వద్ద కలుసుకొందాం.

 

         శతాంశమో- సహస్రాంశమొ

పందొమ్మిది వందల దిన బాధ్యత గమనించినపుడు

స్వచ్చోద్యమ చల్లపల్లి స్ఫూర్తి తోడ పోల్చినపుడు

నా స్పందన-నా వర్ణన వందో వంతుండు నేమొ!

నా నివాళి వారి కృషికి సహస్రాంశముండదేమొ!

 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు- మనకోసం మనం ట్రస్టు,

సోమవారం – 20/01/2020,

                                                చల్లపల్లి.