2321*వ రోజు.......           04-Jan-2022

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి?

గ్రామ పారిశుద్ధ్య ప్రగతిలో 2321* వ నాడు.

        (4-1-22) మంగళవారం వేకువ 4.30 కే గ్రామ స్వచ్చోద్యమ కారుల రంగ ప్రవేశం. ఐదుగురేమో “రెస్కూదళంఅనే ముద్రపడిపోయిన కార్యకర్తలు. ఇద్దరు మాత్రం స్థానిక ఉప్పల వారి వీధి గృహస్తులు. వీరు కాక ఇంకో సీనియర్ కార్యకర్త. ఇదంతా మళ్లీ ఉప్పల వారి వీధిలోనే!

        అ ఇరుకు వీధి చిన్నదే గాని, గ్రామ రక్షక దళానికి నాలుగైదు నాళ్లుగా బాగా ఉపయోగపడింది – మురుగు మట్టి, ఇసుక - దుమ్ము, రాళ్లు రప్పలు ట్రక్కుల కొద్దీ అప్పజెప్పింది. ఆవిధంగా సదరు రోడ్డూ మెరుగు పడింది, ఇతర వీధుల పల్లాలకూ పనికొచ్చింది!

        ఈ వేకువ అలా పల్లాలు పూడినది భారత లక్ష్మి రైస్ మిల్‌ బజారులో, దివంగత వా.కో. ఉద్యానవనం దగ్గరి పల్లం ఇప్పుడు సమతలంగా మారింది. అటుగా రాకపోకలు చేసే ద్వి - చతుశ్చక్ర వాహనాలకు సౌకర్యం, సౌలభ్యం, ఆహ్లాదం సమకూరింది.

        మరి ఇదంతా ఎవరి చలవ? సౌకర్యాల - ఆహ్లాదాల హక్కుదారులు గ్రామంలోని వందల మంది; వేకువ సమయాన శ్రమించిన స్వచ్ఛ – శుభ్ర - సౌందర్య సృష్టికర్తలేమో ఐదారుగురు కార్యకర్తలు!

        6.45 సమయంలో ఈ ఉభయ వీధుల మెరుగుదలను సంతృప్తికరంగా ముగించాక   తూములూరి లక్ష్మణరావు మూడు మార్లు స్వచ్చోద్యమ లక్షాలైన స్వచ్చ - శుభ్ర – సౌందర్య సంపాదనా కాంక్షను నినదించి, నేటి తమ గ్రామ బాధ్యతను ముగించారు.

        రేపటి - (5-1-22) వేకువ మన పునర్దర్శన వీధి- సాగర్ టాకీస్ మార్గంలోని సంత - రైతు బజార్లే!

 

        స్వచ్చోద్యమకారులే

ఉవ్వెత్తున లేచి సాగు ఉద్యమమిది ఎవరి కొరకు?

నిస్వార్థ - క్రమబద్ధ - శ్రమదాతలు ఎచట - ఎవరు?

సంఘం - బుద్ధం - ధర్మం శరణు జొచ్చు ధన్యులెవరు?

శ్రమ పతాక – శ్రమ వికాస సజ్జను లెచ్చోట గలరు?

 

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

  ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   04.01.2022.