2322*వ రోజు......           05-Jan-2022

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవరమైనా ఎందుకు వాడాలి?

2322* వ నాటి సంత/రైతు బజారుల పారిశుద్ధ్య కృషి.

          ఆదివారం నాడు తాత్కాలికంగా విరమించిన ఒక ముఖ్యవీధి శుభ్ర – సుందరీకరణ ఈ రోజు (5-1-22) రెట్టించిన ఉత్సాహంతో మొదలైంది. 4:18 కే 16 మంది, స్థానిక ముస్లిం సోదరసోదరీమణులతో సహా మొత్తం 27 మంది ప్రకటించిన యుద్ధంతో ఒకానొక అత్యంత రద్దీ రహదారిలో కాలుష్యాలు, అపరి శుభ్రతలు, దుర్గంధాలు పలాయనం చిత్తగించాయో లేదో వాట్సప్ మాధ్యమంలో చూడండి!

          గమనార్హమైన ఒక సంగతి ఏమనగా - సరే 2322* నాళ్లుగా గ్రామ శుభ్రత, భద్రత, స్వస్తత స్వచ్ఛ కార్యకర్తల నిత్య జీవితంలో ఎలాగూ ప్రముఖ భాగమైపోయాయి! ఈ నడుమ – గతనెల నుండీ ఏ వీధిలో గ్రామ వికాస కృషి జరుగుతున్నదో - అక్కడి స్థానికులు సైతం పరిమితంగానైనా పాల్గొనడం కూడ అభినందనీయమే అనుకోండి - మరి, ఇంత పెద్ద గ్రామం నుండి రావలసిన క్రొత్త కార్యకర్తల సంగతేమిటి? ఐదారాడేళ్ల క్రిందటి పాత కార్యకర్తల పునరంకితం మాట ఏమిటి?

          ఈ నాటి శ్రమదానంలో స్థానిక నూర్జహాన్’, ఆమె స్నేహితురాలు పాల్గొన్నారు గాని, మిగిలిన 20 కి పైగా ఇళ్ల వారి – 25 కు పైగా వ్యాపారుల - పోలీసు క్వార్టర్ల నుండి ప్రాతినిధ్యమేది? టీ కొట్ల, దర్జీ కొట్లవారూ, టీ - కాఫీ వినియోగదారులూ 50 మందికి పైగా ఏదో మంచి వినోదం చూస్తే చాలా? 20 మంది కార్యకర్తలు తమ షాపుల ముందు ఊడుస్తుంటే - టీ కాఫీ కప్పులు ఏరుతుంటే - నిన్నటి నుండి నలతగా ఉన్న ఒక ప్రముఖ పెద్ద డాక్టరు ఓపిక తెచ్చుకొని చెత్త ట్రాక్టరు నడుపుతుంటే – వయో వృద్ధ కార్యకర్తలు చెత్త గుట్టల్ని ట్రాక్టర్‌లో లోడు చేస్తుంటే.... 50 60 మంది గ్రామస్తులకు అదంతా నిలబడి చూసే గంట కాలక్షేపంలాగా ఉంటుందా?

          ఎవరి ఇళ్ల - షాపుల ఎదుట వాళ్ళు శుభ్రం చేసుకోక, ఇందరు కార్యకర్తలు వచ్చి ఆ కశ్మలాలన్నీ ఊడ్చి ఎత్తుతుంటే కల్పించుకోక ఉదాసీనంగా ఉండడం స్వచ్ఛ - సుందర చల్లపల్లి పౌరులకు మర్యాదేనా?

          ఈ వేకువ పాతిక మందికి పైగా స్వచ్ఛ కార్యకర్తలు సంత లోపల, బైట రైతు బజారు ముంగిట, టిఫిన్ బళ్ల, టీ అంగళ్ల, వివిధ వ్యాపార స్థలాల వ్యర్ధాలను, దుమ్మును, నిన్న మొన్నటి సంత అవశేషాలను, క్రుళ్లిన నిమ్మపళ్లతో సహా తొలగించి – 2 గంటల పాటు కష్టించారంటే - మరి అది వాళ్ళు ఇష్టపడి ఎంచుకొన్న కర్మ! ఈ వీధిని ఇప్పటికి ఏ 15 మార్లో శుభ్రపరిచి, సంత లోపల, రైతు బజారు ఎదుట రంగురాళ్లకు, ప్రహరీ గోడల సుందరీకరణకు లక్షలాది తమ కష్టార్జితాన్ని సంతోషంగా ఖర్చుపెట్టినందుకు - వాళ్లు అమాత్రం శ్రమించాల్సిందే!

          తాము సుందరీకరించిన - విశాల పరచిన రహదార్ల కబ్జాలు, కొందరు గ్రామస్తుల బాధ్యతా రాహిత్యాలు, క్రమశిక్షణ కలిగిన కొందరు ఆలోచనాపరులు కూడ ఈ సామాజిక కర్తవ్యానికి అంటీముట్టక ఉండడాలు .... ఇవన్నీ కొందరు దూరదృష్టి గల కారకర్తలు ముందుగా ఊహించినవే!

          “కాలో హ్యయమ్ నిరవధిః విపులా చపృధ్వీ...(కాలం అనంతమైనది – భూ లోకం  సువిశాలమైనది - మంచి కార్యక్రమాన్ని అర్థం చేసుకొని ఆచరించే వాళ్లు ఎప్పటికైనా తప్పక వస్తారు...) అని 18 - 19 వందల ఏళ్లనాటి సంస్కృత కవి సెలవిచ్చినట్లు - తన మంచి కోసం జరుగుతున్న స్వచ్చోద్యమాన్ని చల్లపల్లి పౌర సమాజం ఎప్పటికైనా విజయవంతం చేయకపోదు!

          ఈ ఊరికి చెందని వ్యక్తి – ఐదారేళ్ళ పాటు చల్లపల్లి ఔన్నత్యమే శ్వాసగా గడుపుతున్న వ్యక్తి – ప్రస్తుతం ఎక్కడో గుజరాత్ లో ఉన్న విశ్రాంత ఉద్యోగి ప్రాతూరి శంకర శాస్త్రి గారి నెలవారీ స్వచ్చోద్యమ చందా 5,000/- విరాళం చల్లపల్లికి దక్కినందుకు మన కృతజ్ఞతలు.        

          6.40 కి అలవాటైన గ్రామ స్వచ్ఛ - సుందర – నవీకరణ సంకల్పాన్ని మూడు మార్లు నినదించినది - కస్తూరి శ్రీనివాస్.

          రేపటి వేకువ మన శ్రమదాన గమ్యమూ, పునర్దర్మన ప్రాంతమూ బందరు రహదారిలోని “శ్రావ్య హాస్పిటల్” సమీపమే!

 

          సన్మానార్హుల సంగతి.

రెండు వేల దినాలుగా నిండగు దృఢ చిత్తంతో

సంచలించు - ఉద్యమించు స్వచ్ఛ సైన్య సాహసులా,

నిమ్మకు నీరెత్తినట్లు నిద్రించే పౌరులా?

ఎవరు ధన్యు, లెవరు మాన్యు, లెవ్వరు సన్మానార్హులు?

 

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

  ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   05.01.2022.