2323*వ రోజు.........           06-Jan-2022

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి?

గ్రామాభ్యుదయ కార్యాచరణలో ఇది 2323* వ రోజు.

            ఈ గురువారం వేకువ 4.30 కు బందరు రహదారిలో- గ్రామ ప్రవేశ   స్థలంలో SBI దగ్గర పారిశుద్ధ్య కృషి కోసం కలవాలనే నిన్నటి నిర్ణయానుసారం- ఇంకా అంతకన్న ముందుగానే – 4.15 కే అది మొదలై -32 మంది చేరికతో 6.23 దాక జరుగుతూనే ఉంది! అత్యధికుల శుభ్ర-సుందరీకరణ ప్రయత్నం రహదారి ఉత్తర దిక్కుగానే కేంద్రీకృతమయింది.

            కార్యకర్తల వేల దినాల శ్రమదానంలో ఈ ఊరికి స్వచ్ఛ - సుందర చల్లపల్లిఅనే బిరుదు స్థిరపడిన మాట నిజమే గాని- ఎప్పటికప్పుడు అది సార్థకం కావాలంటే మాత్రం ఈ 30 - 40 - 50 మంది కృషి కొనసాగుతూనే ఉండాలన్నమాట! గత 8 ఏళ్ల నిరంతర తీవ్ర ప్రయత్నం కాక-మరో ఏడెనిమిదేళ్ల బృహత్ప్రణాళిక సిద్ధం కావలసిందేనన్న మాట!

            సామ్యవాద సిద్ధాంత సారాంశాన్ని శ్రీ శ్రీ అనే కవి సినిమా పాటలో ఇలా తేల్చేశాడు. ఒక్కడికే అన్ని కాక - అందరికీ అన్నీ!.... మరి - ఇదేమంత కష్టమా? అలవికాని అసాధ్యమా?

అందరి కోసం ఒక్కడు కదలి - ఒక్కని కోసం అందరు కలిసి -

ఉపకారమే మన ఊపిరి ఐతే- సహకారమే మన వైఖరి ఐతే....” (రాముడు - భీముడు చిత్రం).

స్వచ్చోద్యమం 8 ఏళ్లు గడిచినా, మరి ఈ గ్రామంలో ఎక్కువ మంది వైఖరి ఏమిటి ? 30 వేల మంది కోసం ఈ 30-40 మందే శ్రమిస్తున్నారు! ఎవరి ఇంటి ముంగిలి, వీధి, వార్డు, వాళ్లే స్వచ్ఛ - సుందరం చేసుకుంటే-పంచాయతీకి, స్వచ్చ కార్యకర్తలకు వీలైనంత సహకరిస్తే-ఇంత పెద్ద గ్రామంలో కాలుష్యం మటుమాయం కాదా? పచ్చదనంతో-స్వచ్చ-శుభ్ర-సౌందర్యాల ఆహ్లాదంతో అందరి ఆరోగ్యం వర్థిల్లదా? స్వచ్చంద శ్రమదాతల ఆశ, ఆశయం, ఆదర్శం, ఆచరణం దానికోసమే కదా!

ఈనాటి గ్రామ స్వస్తతా ప్రయత్న విశేషాలేమంటే:

- 6 వ నంబరు పంట కాల్వ గట్టు మీద-శ్రావ్య ఆస్పత్రి తూర్పున మట్టి రోడ్డు ను, ఉద్యానం లోపల డజను మందికి పైగా కార్యకర్తలు, రెస్క్యూ టీం వాళ్ళూ పట్టి పట్టి పరిశుభ్ర పరచడం. తాము కొన్నాళ్ల క్రితం నాటిన పూల మొక్కల్ని పరామర్శించి, కుదుళ్లను సరి చేసి ఆనందించడం!

- ఇంకో డజను మందికి బాగా రద్దీ ఉండే టీ దుకాణ పరిసరాల్నీ, శ్రావ్య ఆస్పత్రి ఆవరణనూ, భవాని ఎలక్ట్రికల్స్ ఎదుటి దిబ్బ మీద గడ్డి మొక్కలు-ఇతర వ్యర్థాల తొలగింపూ, ట్రాక్టర్ లోకి తరలింపూ సరిపోయింది! (బిల్డింగ్ బాగానే ఉంది - దుకాణాల్లోనూ బాగానే ఉంటుంది. ఇంత ఎత్తైన దిబ్బ మీద వాన నీళ్లు రోడ్డు మీదకే గాని - డ్రైను లోకి పోయే వీలే కనపడడం లేదు - మరి పరిసరాల పరిశుభ్రత మాటేమిటి?

- మిగిలిన కార్యకర్తలకు విశాలమైన రహదారి మీది దుమ్ము - ఇసుక ఊడవడమూ, పేవర్ టైల్స్ మురికి వదిలించడమూ సరిపోయింది.

            6.45 సమీక్షా సమావేశానికి ముందు కాఫీ సమయంలో ఇదే వీధి గృహస్తు చేత బిస్కట్ల పొట్లాల పంపిణీ జరిగింది. నేటి గ్రామ స్వచ్ఛ సుందర - పరిశుభ్రతా నినాదాల వంతు లాబ్ రవీంద్రది! రెండు గంటల శ్రమదానంతో - వచ్చిన పారిశుద్ధ్య ఫలితంతో కలిగిన సంతృప్తి 32 మంది కార్యకర్తలది!

            ట్రక్కులో కెక్కి, కార్యకర్తలు అందిస్తున్న కశ్మలాల డిప్పల్ని అందుకొని, సర్దిన సాహసం ఒక సీనియర్ గైనకాలజిస్టుది!

            రేపటి వేకువ బందరు రోడ్డు శుభ్ర-సుందరీకరణ కోసం SRYSP కళాశాల ఎదుట కలుసుకోవాలనే నిర్ణయం అందరిదీ!

 

            అనుసరిద్దాం - అవశ్యంగా

ఏదనిత్యం - ఏది నిత్యం - ఏది స్వార్థం-ఏది త్యాగం?

పరోపకృతులకు మార్గమేదో - పరమ ధర్మ గరిష్టమేదో?

ఆ వితర్కం అంతులేనిది - స్వచ్ఛ సైన్యం బాట ఉన్నది

అనుసరిద్దాం- అనుకరిద్దాం! స్వచ్ఛ సైన్యం అడుగు జాడలు!

 

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

  ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   06.01.2022.