2324*వ రోజు....           07-Jan-2022

ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి?

నేటి స్వచ్చోద్యమ చల్లపల్లి సంగతులు @2324*వ రోజు.

            గురువారం (07.01.2022) వేకువ 4.19 కే బందరు వీధిలో - జూనియర్ కళాశాల వద్దకు చేరుకున్న 16+15 మంది శ్రమదాతల జోక్యంతో - 3 విధాల కృషితో శుభ్రవంతమైన ప్రాంతం మునసబు/ సజ్జా వారి వీధి వరకు. 6 వ నెంబరు కాలువ వంతెన దగ్గర ఒక మహిళతో సహా ఏడుగురు గ్రామ రక్షక దళం సృష్టించిన మినీ ఉద్యానం మరొకటి.

            అసలీ 30 మంది కార్యకర్తలకు ఏ మూడున్నర నుండో ఇక నిద్ర పట్టదనుకుంటా – (అంతకుముందు నిద్రలో సైతం వీరిలో కొందరు వీధి స్వచ్చ సౌందర్యాలే కలవరిస్తారేమో తెలియదు) లేకపోతే, ఇంత మంచులో - చలిలో హాయిగా ఇళ్ళలో ముసుగుతన్ని నిద్రించక తగుదునమ్మా అని 2324 రోజుల నుండి ఈ మురికి పనులు ఎందుకు? సరే - ఎవరి పిచ్చి వాళ్లకానందం అని సరిపెట్టుకుందాం! ఇంత మంచి పిచ్చి వీలైనంత తొందరగా అన్ని వీధుల వారికి సైతం పట్టుకోవాలని నా కోరిక.

            నేటి గ్రామ పారిశుద్ధ్య వివరాలకు వస్తే:

- ఇదెంత సువిశాలమైన జాతీయ రహదారో దాన్ని రెండు ప్రక్కల పేవర్ టైల్స్ వేసి మరింత విశాలపరచిన కార్యకర్తలే ఈ వేకువ డజను మందికి పైగా పూనుకుని రోడ్డును చీపుర్లతో ఊడ్చి, మార్జిన్ల టైల్స్ ను మళ్ళీ మళ్ళీ తుడిచి, వాటి అసలు రంగులు మెరిసేలా శ్రమించడం చూస్తే ఎంత ముచ్చటగా ఉందో!

- పనిలో పనిగా నలుగురైదుగురు ఎదుటి చిన్నారి పిల్లల హాస్పిటల్ ముందు, దానికి పడమర ప్రక్క పెరుగుతున్న పిచ్చి మొక్కలని మాయం చేశారు. కత్తులతో గడ్డిని కూడా తొలగించారు.

- పంట కాలువ దగ్గర గానీ, బందరు మార్గం పొడవునా గానీ, ఎన్ని వ్యర్ధాల పోగులను ఊడ్చారో వాటిని మళ్ళీ డిప్పలతో ట్రక్కులో నింపి డంపింగ్ కేంద్రానికి చేర్చడం మాత్రం తక్కువ శ్రమా?

            వీలైతే గ్రామస్తులు, నడక వాహ్యాళి వారు, కనీసం ఈ వీధుల గృహస్తులూ నేటి 30 మంది శ్రమదాతల - 60 పని గంటల ఫలితంగా ఈ జాతీయ రహదారి ఎంత శుభ్రంగా, అందంగా ఉన్నదో పరిశీలించవచ్చు. రేపు జరగబోయే బ్రహ్మముహూర్త వీధి సేవలలో ఈ పరిశీలకులలో కొందరైనా చేతులు కలుపవచ్చు.

            గ్రామ స్వచ్చోద్యమ సంధాన కర్తలు ఈ ఉదయం 6 గంటల తర్వాత గ్రామాంతర ప్రయాణంలో ఉన్నందు వల్ల నేటి శ్రమదాన సమీక్ష క్లుప్తంగా జరిగింది. అంతకుముందు కోట పద్మావతి చొరవ చేసి స్ధిరంగా మూడు మార్లు ప్రకటించిన చల్లపల్లి గ్రామ స్వచ్ఛ శుభ్ర సౌందర్య నినాదాలు నడక మిత్రులను కూడా ఆకర్షించాయి.

            రేపటి వేకువ మన పునర్దర్శన ప్రదేశమూ, మన శుభ్ర సుందరీకరణ కర్మ క్షేత్రమూ ఈ బందరు రహదారిలోని రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద!    

   

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

  ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   07.01.2022.