2325*వ రోజు....           08-Jan-2022

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి?

 

గ్రామ సుందర-సుస్థిర-భవిత కోసం శ్రమదాన యజ్ఞం-@2325* వ నాడు.

 

            శనివారం నాటిది-4.20 సమయంలో మొదలై- 6.20 దాక నడచిన 33 మంది భాగస్వాముల- వేలాది దినాల శ్రమదాన వైభవం! సాధారణ గృహస్తులు తమ ఇళ్లలోనైనా ఇంతగా పట్టి పట్టి- మళ్ళీ మళ్ళీ ఈ కార్యకర్తలు వీధి సౌందర్యాలకు మెరుగులు దిద్దినట్లుగా చేసుకొంటారా అనేది సంశయం! ఈ అందరి స్వార్థ రహిత కృషికి నేడు వెచ్చించింది అక్షరాలా 55 పని గంటల సమయం!( ఈ ఒక్కనాటి ఇందరి, వాహనాల-కాఫీ తదితరాల ఖర్చు ఏ మూడు వేలో ఉంటుంది! ఇలా ఆలోచించడం సరైంది కాదేమో గాని- నేటి వీరి శ్రమ విలువ డబ్బు రూపేణా ఏడెనిమిది వేలు కావచ్చు!)

 

            ఐతే ఆత్మ సంతృప్తి రూపంలో, ఆరోగ్య లబ్ది పరంగా వీళ్లు పొందేది అంతకు రెట్టింపే! మరి గ్రామస్తులు ఇంత గొప్ప పరిశుభ్ర-సుందర రహదారి మూలంగా పొందే ఆహ్లాద, ఆనందం విలువ ఎలా కొలవగలం? మనం సంఘ జీవులైన మనుషులం!- మనకు తెలిసో, తెలియకో- ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎందరెందరో మన బాధ్యతలు మోస్తుంటే ఇలా   బ్రతుకుతున్న వాళ్లం! మరి గ్రామ సమాజ పౌరులుగా మనమందరం ఊరి ఉమ్మడి ప్రయోజనం కోసం రోజుకొక్క గంటైనా పని చేయలేమా?

 

            మన చల్లపల్లి లో 2325* నాళ్లుగా- త్రికరణ శుద్ధిగా జరుగుతున్న, ఇప్పటికి ఏ మూడున్నర లక్షలో పని గంటల  శ్రమదానం కళ్ళెదుటి యదార్థం!( గ్రాఫిక్స్ కానేకాదు! కనికట్టు కానే కాదు!) దాని ఫలితం కూడ నిత్యం గ్రామస్తులకు సౌకర్యం- సౌందర్యం-సౌజన్యంగా అనుభవంలో కి వచ్చేదే! మరి కొన్ని వార్డుల చైతన్యవంతులు వచ్చి, కార్యకర్తల్తో కలిసిపోయినట్లు అన్ని వార్డుల వారెందుకు చొరవ చేయరు?

 

            నేను ఈ శనివారం నాటి శ్రమదానం గురించి ప్రత్యేకంగా రాయనవసరం లేదు. జై స్వచ్చ చల్లపల్లి సైన్యంవాట్సాప్ చిత్రాల్లోనే వివరాలు దొరుకుతాయి!

 

- వీళ్లలో ఒక కష్ట జీవి ఐన గృహిణి వస్తుంది, ఇక్కడ గంటన్నరకు పైగా శ్రమించి, తర్వాత హడావిడిగా ఇంటి బాధ్యతల పిలుపు విని గబగబా వెళ్ళిపోతుంది.

 

- ఇద్దరు విశ్రాంత ఉద్యోగులున్నారు! ఉదయం ఆరున్నరైపోయిందే- పంచాయతి కుళాయిలు కట్టేస్తారేమో- అని కొంత సంశయిస్తూనే- 2 గంటల పాటు పారిశుద్ధ్య  శ్రమ ప్రదానం తరువాతే వేగంగా ఇంటి కెళ్తుంటారు!

 

- రెస్క్యూ టీం వాళ్ల బండ చాకిరికేమో హద్దులే ఉండవు!

 

- వేకువ 2 గంటల పాటు ఏదో ఒక వీధిలో నెలకొనే ఈ పారిశుద్ధ్య ప్రమోదం, స్వార్థంగా కాక, పరార్థకంగా కనిపించే ఈ నిరంతర శ్రమైక జీవన సౌందర్యం-ఎప్పటికైనా  ఏ కాస్త సామాజిక స్పృహ ఉన్న గ్రామస్తులకైనా గమ్యస్థానం కాదగిందే!

 

            నిన్నటి శుభ్ర-సుందరీకృత ప్రాంతంలోను, రెండు రహదారి వనాలలోను, మరొక పర్యాయం బందరు వీధి పొడవునా శ్రమించిన కార్యకర్తలు 6.20 కు గాని పని ముగించలేదు.

 

            6.50 కి కాబోలు- నేటి కృషి సమీక్షా సమావేశంలో ఆస్పత్రి రిసెప్షనిస్టు లక్ష్మీ సెల్వం  తీరుబడిగా ముమ్మారు ప్రకటించిన గ్రామ స్వచ్చ-శుభ్ర-సౌందర్య సంకల్ప నినాదాలతో నేటి ఊరి మెరుగుదల కృషికి ముగింపు. కొర్రపాటి వీరసింహుని రెండు రకాల -  ద్వార పూడి దైవ ప్రసాదాలు కార్యకర్తలకు సకాలంలో అందాయి! ఎప్పటిలాగే కర్ణాటకం నుండి వేమూరి వారి పలకరింపులు కూడ!

 

            రేపటి వేకువ మన పునర్దర్శన స్థలం- బందరు మార్గంలోని భగత్ సింగ్ గారి- రాయపాటి రాధా కృష్ణుల వారి భవనాల దగ్గరే!

 

          స్వచ్ఛ సైన్య జయ పతాక

ఒక్కరిద్దరు ఉన్నా ఎగురు స్వచ్చోద్యమ జయ పతాక!

కోవిద్ విలయం లోనూ కొనసాగెను దాని  ఢాక !

అంగ-అర్థ బలాల కన్న ఆశయాల శక్తి మిన్న!

అనుసరింపు డాచరింపు  డా స్వచ్చ స్ఫూర్తి నెపుడు!

 

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

  ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   08.01.2022.