2326* వ రోజు....           09-Jan-2022

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి?

 

2326* వ నాడు 36 మంది నిర్వహించిన వీధి పారిశుద్ధ్యం.

 

            ఈ ఆదివారం (09.01.2022) పూట-మరీ వేకువ 4.19 కే “ అయం ముహూర్తోస్సు ముహూ ముహూర్తః” అంటూ- చలిలో, మంచులో మొదలైన వీధి బాగు చేతల పని 6-15 దాక- (కొందరైతే 6.25 దాక) అమలు జరుగుతూనే ఉన్నది! కాఫీల సేవనమూ, దైనందిన సమీక్షా సమావేశమూ ముగియడానికైతే 7.00 ఐపోయింది. అంతకుముందే 6.15 కే కొందరి నిష్క్రమణమూ జరిగింది!

            “రోజుకొక గంట చొప్పున-కనీసం ఐదారుగురైనా, జన విజ్ఞాన వేదిక కార్యకర్తలం -ఒక సంవత్సరం పాటైనా ఊరి కోసం శ్రమదానం చేస్తాం” అనేది ఎనిమిదేళ్ల నాడు డాక్టర్ డి.ఆర్.కె గారి ప్రతిజ్ఞ!  తీరా అది ఇప్పుడేమో 30-40 మంది -ధ్యానమండలి – లయన్స్-మెకానిక్స్ – ప్రస్తుత, విశ్రాంత ఉద్యోగులు- గృహిణులు- రైతులు... ఇందులో వచ్చి చేరుతూనూ, కొద్ది మంది కారణాంతరాలతో నిష్క్రమిస్తూనూ, అడపా దడపా క్రొత్త కార్యకర్తలు చేతులు కలుపుతూనూ... ఇదుగో ఇప్పటికిలా స్థిర పడింది!

 

            వాలంటీర్లు వస్తూ – పోతూ ఉన్నా, అడపా దడపా చిన్న కుదుపులు వచ్చినా, 2326 * దినాలుగా స్వచ్చోద్యమం ప్రాతదే! ఒక ప్రక్కన ఆ ఉద్యమ స్ఫూర్తి ఎక్కడెక్కడి, ఎన్నెన్ని ఊళ్లనో- ఎందరినో కదిలిస్తూ ఉన్నా -10-12 దేశాల ప్రవాసుల్ని ఉత్తేజ పరుస్తూ పోతున్నా – ఇంకా ఇప్పటికీ ఈ ఊరిలో సగం మందిలో చలనం లేకుండడం ఆశ్చర్యకరమే! స్వచ్చంద శ్రమదాతలది నిష్కామ కర్మ గనుక, నిర్నిబంధ క్రియా శీలత గనుక, ఒక విశిష్ట తాత్త్విక బలంతో వచ్చిన స్థిత ప్రజ్ఞత కాబట్టి ఈ గ్రామం లో ఈ స్వచ్చోద్యమం నిరాటంకంగా నడుస్తున్నది!

 

            “గ్రామ స్వచ్చ-శుభ్ర-సౌందర్యాల బరువు బాధ్యతల్ని కష్టపడి మోస్తున్నాం” అని ఈ శ్రమ దాతలు భావించరు కనుక- గ్రామ పౌరులుగా  అది కేవలం తమ బాధ్యతే అనే ఆలోచనలే కాబట్టి- వాళ్లకి ఎవరి దూషణ-భూషణ-సన్మాన-తిరస్కారాలూ పట్టవు! వేకువనే పరస్పరం కలుసుకోవడం, సుమారు రెండు గంటలు శ్రమించడం అనే ఒక సంతోషదాయకమైన సందడిగా ఏనాడో మారిపోయింది!

            - ఉదయం 5.00 కే కోట పద్మావతి మట్టి కప్పుల్లో కార్యకర్తలకు కమ్మని అల్లం టీ అందించడం ఆ సందడిలో ఒక భాగం!

            -22 మంది కార్యకర్తలు కత్తులు, దంతెలు, చీపుళ్లు, గోకుడు పారల్తో సజ్జా వారి వీధిని, పడమరగా కోట వారి సందునీ తాపీగా శుభ్ర-సుందరీకరించారు.

            - మునసబు వీధి ముఖ ద్వారమూ, కొసరుగా 1 వ వార్డు ప్రవేశ స్థలమూ, పింగళి వారి ఆస్పత్రి ప్రాంతమూ కాలుష్యం తుప్పు వదుల్చుకొన్నవి.

            - ఐతే సజ్జా వారి రోడ్డులో ఒక ఇంటి పై నుండీ, మరొకరు ఆవరణలో నుండీ  అరగంటకు పైగా వినోదం చూడడంతప్ప-వచ్చి తమ వీధి శుభ్రతలో వేలు పెట్టనేలేదు!

            7.00 సమయంలో పంటి ఆస్పత్రి దగ్గర-సజ్జా వారి వీధికి చెందిన, గత లయన్స్ క్లబ్ అధ్యక్షుడైన కస్తూరి ప్రసాదు మూడు మార్లు గ్రామ స్వచ్చ-శుభ్ర-సౌందర్య సంకల్ప నినాదాలిచ్చి, అనారోగ్య కారణాన కొన్నాళ్లుగా శ్రమదానం చేయని అశక్తతను తెలిపి, తన పునరంకిత భావాన్ని ప్రకటించడం విశేషం!

            రేపటి వేకువ మన వీధి పారిశుద్ధ్య శ్రమదానం కోసం రాయపాటి-శిర్విశెట్టి భవనాల దగ్గరే మన పరస్పర అభివాదం!

          స్వచ్చ-సుందర- అడుగు గురుతులు

కలల మందిర స్వచ్చ సుందర గ్రామ మిది నీ చల్లపల్లి

దేశ దేశ విభాగములలో తేజరిల్లే పాలవెల్లి

కారణాంతర సైన్య విరమణ కాల మందున పూనుకోవోయ్

అనుసరిస్తూ- అనుకరిస్తూ స్వచ్చ సైన్యం అడుగుజాడలు !

 

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

  ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   09.01.2022.