2327* వ రోజు....           10-Jan-2022

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి?

10-1-22 నాటి అవిరళ స్వచ్చోద్యమ నిర్వహణం - @2327*వ నాడు.

            సోమవారం - అతిశీతల వేకువలో – 4.15 మొదలు 6.18 దాక వీధి పారిశుద్ధ్య శ్రమదానం 27 మంది కర్తవ్య పరాయణులది. దుమ్ము, ధూళి తొలగిపోయి, రోడ్డు మార్జిన్ల గడ్డీ - గాదం, పిచ్చి - ముళ్ల మొక్కల, ప్లాస్టిక్ సంచులు - సీసాల, తగు మాత్రం ఖాళీ మద్యం సీసాల, ఇంకా తదితరాల దరిద్రం, అసౌకర్యం తొలగిపోయి, కంటికి సొంపు గాను, మనసు కింపు గాను మారిన చోటు ప్రధానంగా మునసబు వీధి, కొసరుగా బందరు దారిలోని అమరావతి రాజుల భవన ప్రాంతం!

            పూర్తి సమయం కాకున్నా - వచ్చి సంఘీభావం తెలిపిందీ, మొహమాటం చూపిందీ ఇద్దరు స్థానికులు! ఇప్పటి కదే మహా ప్రసాదం అనుకొందాం! చలీ, మంచూ, కరోనా కాఠిన్యం, వంటి సాకులున్న ఈ సీజనన్ ను వదిలేసి, మరొక ఏడెనిమిదేళ్లకైనా, ప్రతి వార్డులో - ప్రతి ఇంటి నుండి స్ఫూర్తి పొందిన గ్రామస్తులు వంతులేసుకొనైనా తమ వార్డు శుభ్ర – సౌందర్య కృషిలో పాల్గొనకపోరనే సానుకూల ఆశావహ వివేచనలో ఉందాం!

            ఉన్న ఊరి జనాల ఆహ్లాద – అనంద స్వస్తతల కల్పన కోసం ఇప్పటికే ఈ 100 150 మంది స్వచ్ఛ కార్యకర్తలది ఏడెనిమిదేళ్ల ఉడుంపట్టు - భల్లూక పరివ్యం గల, మానసిక - భౌతిక ఆరోగ్యాల రూపంలో ప్రతిఫలం చవి చూస్తున్న ఈ బాధ్యతా మూర్తులు ఈ చారిత్రక గ్రామ సంపూర్ణ శుభ్ర - సౌందర్యాలు చూసేదాకా, న్యూజిలాండ్ - స్విజ్జర్లాండ్ల - గామాల్తో తులతూగే దాకా ఆపట్టు వదలరనే చాలమంది అంచనా! ఎవరు గెలవాలి? కళ్లెదుటి నిర్విరామ గ్రామ సుందరీకరణను చూస్తూకూడా అంటీ - ముట్టని కొందరు గామస్తులా - ఊరి మెరుగుదల కోసం కాలుష్యాల, అసౌకార్యాల అంతు చూడక వదలం, తగ్గేదేలే అంటున్న స్వచ్ఛంద శ్రమదాతలా?

- ఈ రోజు కూడ కార్యకర్తలు తొలగించిన - పోగులు చేసిన రకరకాల వ్యర్ధాలు ట్రక్కుకు సరిపడా ఉన్నవి!

- ముగ్గురు, నలుగురు మహిళలు ఊడ్చి శుభ్రపరచిన రోడ్ల నిడివి ½ కిలోమీటరున్నది!

- అమరావతి జమీందార్ల భవనం ఇరు ప్రక్కలా వీళ్ల శ్రమదానంతో వచ్చిన పరిశుభ్రత, సౌందర్యాలున్నవి!

- రెండు గంటల చలి సమయం పాటు వాళ్లు కష్టించి, త్రాగిన సీసాల కొద్దీ నీళ్లు, మైకు నుండి విన్న శ్రావ్యమైన ఉత్తేజకరమైన చక్కని పాటలున్నవి!

- చిన్న కారణాంతరాన కాస్త ఆలస్యంగా త్రాగిన మంచి కాఫీ, మరి కొన్ని మంచి సరదా కబుర్లు కూడ ఉన్నవి!

            6.45 కు డాక్టర్ DRK గారి సమీక్షకు ముందు - చాల రోజుల తర్వాత విశాఖ నుండి వచ్చి, స్వచ్ఛ శ్రమదానంలో పాల్గొన్న మా గోత్రీకుని (నల్లూరి మోహన్ రావు) మూడు రకాల – స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య నినాదాలూ ప్రతి ధ్వనించాయి! ప్రతి నెలా కోడూరు వారు సమర్పిస్తున్న స్వచ్చోద్యమ చందా – 520/- కూడ అప్పుడు స్వీకరించడమైనది! భోగి పండుగ నాటికి మన తాత్కాలిక లక్ష్యం గ్రామ కేంద్రం దాక క్షుణ్ణంగా శుభ్రపరచడమే కనుక - రేపటి వేకువ మన పునర్దర్శనం కూడ ఈ దంత వైద్యశాల ఎదుటే!

 

               వలదిప్పుడు.

బాధ్యతలను మోయువాడు నాయకుడే కానప్పుడు

సమాజ ఋణం తీర్చువాడు మార్గదర్శి కానప్పుడు

ఉద్యమాల పేరు చెప్పి, ఉన్నత మహదాశయాల

మాటున - మాటలు చెప్పే మహనీయులు వలదిప్పుడు!

 

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

  ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

  10.01.2022.

కోడూరు వేంకటేశ్వరరావు గారి నెలవారీ చందా