1897 * వ రోజు....           21-Jan-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1897* వ నాటి వీధి శుభ్రతలు.

స్వచ్చ చల్లపల్లి సంప్రదాయానుసారం నిన్న సోమవారం నిర్వహించవలసిన ప్రధాన వీధి స్వచ్చ-సుందరీకరణలు ఈ మంగళ-బుధ-గురువారాలలో జరుగుతున్నవి. నేటి వేకువ 3.59-6.18 నిముషాల నడుమ జరిగిన శ్రమదాన వేడుకలో పాల్గొన్న కార్యకర్తలు 25 మంది. శుభ్ర సుందరీకృత ప్రాంతం బందరు మార్గంలోని 6 వ నంబరు కాల్వ వంతెన నుండి అమరావతి రాజా గారి భవనం దాక.

స్టేట్ బ్యాంక్ దగ్గర తమ పరికరాల వాహనమును ను నిలిపిన స్వచ్చంద శ్రమకారులు వివిధ పనిముట్లతో చేసిన పని వివరాలు:

- ఆస్పత్రి ఎదుట టీ దుకాణం దగ్గర కాస్త తక్కువగానే ఉన్న కాఫీ, టీ, ఖాళీ గ్లాసులు, ప్లేటులు, కాగితపు-బీడీ ముక్కల వంటి వ్యర్ధాలను ఊడ్చడం.

- దారి పొడవునా రెండు ప్రక్కల గల రంగు రాళ్లమీది దుమ్మును, మురికిని, చెత్తా చెదారాలను ఒకటికి రెండు మార్లు ఊడ్చి, దారి అందాలకు మెరుగులు దిద్దడం.

 

- రహదారి మీద రెండు వేగ నిరోధకాల(స్పీడ్ బ్రేకర్ల) మధ్య ఎక్కువగా పోగు బడుతున్న మట్టి-ఇసుక, దుమ్ముల్ని కాస్త బలం ప్రయోగించి, లాగి, ఊడ్చి, ఆ పోగులన్నిటినీ ట్రాక్టర్ లో నింపి, ఇతర వ్యర్ధాలతో బాటు చెత్త కేంద్రానికి తరలించడం.

- కూన మొక్క(నర్సరీ) ల పంపిణీ కేంద్రాల వద్ద , లాబొరేటరీ ఎదుట, రిజిస్ట్రార్ కార్యాలయం ముంగిట, ముల్పూరి ఉద్యానవన ప్రాంతాలన్ని- దుమ్ము-ధూళి రేగుతుండగా – మూతులకు చిక్కాలు కట్టుకొని,అలిసి పోకుండ మధ్యలో నీళ్లు తాగుతూ –అక్కడక్కడ కనిపించిన పిచ్చి-ముళ్ల మొక్కల్ని ఛేదిస్తూ-విశాలమైన జాతీయ రహదారిని మరింత ఆకర్షణీయం చేస్తూ నేటి కార్యకర్తల శ్రమదాన ఉత్సవం కొంత మందికైనా ఉత్తేజకరంగా సాగింది.

 

కాఫీ-టీ ల సరదా సమయంలో ఉడత్తు రామారావు గారు కార్యకర్తలకు బిస్కెట్టు పొట్లాలు పంచడం , సూక్తుల వల్లెవేత పద్ధతిలో గొంతెత్తి అడపా గురవయ్య స్వగ్రామ స్వచ్చ-సుందర సంకల్ప నినాదాలను ముమ్మారు ప్రకటించడంతో 6.45 నిముషాలకు నేటి స్వచ్చోద్యమ ప్రసక్తి ముగిసింది.

దూర ప్రాంతంలో ఉన్నందున నేటి ఈ శ్రమదాన లబ్ది డా. పద్మావతి, డా. రామకృష్ణ ప్రసాదు లకు దక్కలేదు!

సజ్జా ప్రసాదు గారి ఒక క్రొత్త ప్రతిపాదన : ఇకమీద వారంలో ఒక్క రోజు సోమవారం మాత్రమే కాక, మరొక రోజు కూడ ప్రధాన వీధుల స్వచ్చ సుందరీకరణం చేస్తుండాలని.

రేపటి మన బాధ్యతా నిర్వహణ కోసం మునసబు గారి వీధి దగ్గర ఆగి, అక్కడ నుండి తూర్పు-పడమర దిశలలో జాతీయ రహదారిని మెరుగుపరిచే పని చేపడదాం!

         ఇది ఆశ్చర్యార్ధకమా?

దినదిన మొక గంటన్నర జనహిత కృషె లోకోత్తరమా!

స్వచ్చ భటుల-స్వచ్చోద్యమ చరిత ఇంత ఘన తరమా!

మనకోసం మన పనే మహత్తర సందేశమా!

ఇంత జగద్విఖ్యాతికి ఈ సైన్యం అర్హమా!

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు- మనకోసం మనం ట్రస్టు,

మంగళవారం – 21/01/2020

                                                          చల్లపల్లి.