2338* వ రోజు..........           02-Feb-2022

 ఒక్కసారికి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?

2338* వ నాడు పునః ప్రారంభమైన గ్రామ స్వచ్చోద్యమ వేడుక

        స్వల్ప వ్యవధి పిదప బుధవారం (2-2-22) వేకువ 4.19 కే బందరు రహదారి సంపూర్ణ స్వచ్ఛ - శుభ్రతలకు పునరంకితులైన 25 మంది కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పని ప్రారంభించినది షాబుల్ వీధి పిండిమర దగ్గర. ఐతే, ఏ.టి.యం. కేంద్రమే వాళ్ల ఓపికను బాగా పరీక్షించింది.

        ఇందరు కార్యకర్తల చీపుళ్లకు, గోకుడు పారలకు, రైల్వే పారలకు, గంటన్నర పాటు ఆ 50 - 60 గజాల జాగా పని కల్పించిందంటే - అది అక్కడి దుకాణదారుల, హాటళ్ల, తోపుడు బళ్ల, ఇతర చిరు వ్యాపారుల నిర్లక్ష్య ఫలితం కాదా?

        దయచేసి అందరూ గమనించాలి - అది క్రిక్కిరిసిన వ్యాపార కూడలి - అక్కడే బ్యాంకులు, ATM లు, ‘ఫుడ్ కోర్టుల పేరిట హోటళ్లు, తోపుడు బళ్లు, 10 - 12 దుకాణాలు ఎదురుగా రెండో మూడో గుడులు, మరో వంక కూరల అంగళ్లు - ఇన్నిటి నడుమ విచ్చల విడిగా బహిరంగ మూత్ర విసర్జన! అడిగే వాళ్లు లేరు - ఆపేవాళ్ళు లేరు - అందరూ మర్యాదస్తులేనాయె! మరి - ఈ మూత్రశాలను ఈ పూట శుభ్ర పరచిందెవరు? BSNL మాజీ ఉద్యోగులిద్దరు!

        ఈ నాటి పరిశుభ్ర - సుందరీకృత 160 గజాల వీధిలో మిగిలిందంతా ఒకెత్తు, ATM కేంద్రం ఇంకొక ఎత్తు! ప్రతి రంగు రాతి మీది దుమ్మునూ గోకి, పూల కుండీలనమర్చి, దుకాణాల ముంగిళ్లను ఊడ్చి, రెండు రకాల వ్యర్ధాలను రెండు ట్రక్కుల్లో నింపి, సువిశాల రహదారిని శుభ్రపరిచి, ఇసుక - దుమ్ముల్ని డిప్పల్తో ఎత్తి...ఇలా ఎనిమిదేళ్ళుగా ఊరి బాగు కోసం శ్రమిస్తున్న స్వచ్ఛ సైనికుల్ని పొగడవద్దు - ఇప్పటికైనా మరి కొన్ని చేతులు వాళ్లతో సహకరించాలనే మా విన్నపం!

        ఎందుకిలా రోజూ 30 - 40 మంది స్వచ్ఛంద శ్రమదాతలు 2 గంటల పాటు వారి కాలాన్ని శ్రమను వెచ్చిస్తున్నారో తెలిసికోని దుకాణదారుల్ని, వినియోగదారుల్ని, సభ్య సామాజికుల్ని నమస్కరించడం తప్ప మరో మార్గమేది!

        అలా 2 గంటలు శ్రమించాక - చెలరేగుతున్న దుమ్ము – ధూళి నడుమ ATM కేంద్రాన్ని సంతృప్తికరంగా - రంగురాళ్ల మెరుపులు మళ్ళీ కనిపించేంతగా శుభ్రపరిచాక - 6.10 పిదప గాని, కార్యకర్తలు తమ పట్టు సడలించ లేదు! ఈ గ్రామ ప్రయోజనకర శ్రమానందం తరువాత - సరదా కబుర్ల – కాఫీ పానీయానందం పిమ్మట - అడపా గురవయ్య ముమ్మారు వినిపించిన స్వచ్ఛ – పరిశుభ్ర – సౌందర్య నినాదాలు, గాంధీజీ సూక్తులు ముగిసి, 6.40 కి అందరూ గృహోన్ముఖులయ్యారు.

        రేపటి వేకువ సైతం మన శ్రమదాన గమ్య ప్రదేశం - బందరు మార్గంలోని “ఏ వేళైనా నగదు” (ATM) కేంద్రమే!

 

           ఎంత కష్టం కార్యకర్తకు!

రెండు వేల దినాల పైగ అఖండమైన సపర్యచేసిన –

అన్ని సొబగులు తీర్చిదిద్దిన – స్వచ్ఛ సుందర రూపమిచ్చిన

చల్లపల్లి స్వస్త సేవలు కరోనా అనుకారణమ్మున

నిలిచిపోవుట కార్యకర్తల నిండు మనసుల కెంత కష్టం!

 

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

  ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

  02.02.2022.