1898 * వ రోజు....           22-Jan-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1898* వ నాటి పట్టుదలలు.     

నేటి శుభోదయం 4.02 నుండి 6.18 నిముషాల వరకు తమ గ్రామ స్వచ్చ శుభ్రతల కోసం విరామమెరుగక పరిశ్రమించిన, పరిక్రమించిన చీపుళ్ల వీరులు 32 మంది. ఈ కార్యరంగం బందరు మార్గం లోని జూనియర్ కళాశాల మొదలు రక్షకభట నిలయ మార్గం దాకా – సుమారొక కిలోమీటరు !

 

సజ్జా వారి వీధి కొసలో ఆగి, పనిముట్ల వాహనాలు నిలిపి, అక్కడ మొదలైన శ్రమదాన సందడి దక్షిణ భాగంలోని నిన్న శుభ్రపరిచిన కళాశాల దగ్గర నుండి రిజిస్ట్రారు కార్యాలయ –కర్మ భవన– దంత వైద్యశాలల + మొక్కల దుకాణాల –మత్స్య విక్రయశాల –మసీదుల మీదుగా అప్రతిహతంగా -100 నిముషాలకు పైగా సాగి పోలీస్ స్టేషన్ వీధి దగ్గర ముగిసింది.

   ఈ స్వచ్చ యాత్రలో వీరు రహదారి రెండు ప్రక్కల ఊడ్చారు. రాళ్ల మాటున , మురుగు కలుగుల్లోని ప్లాస్టిక్ –తదితర అన్ని వ్యర్దాలను బయటకు లాగి, పోగులు చేసి, డిప్పలతో ట్రస్టు వాహనంలో నింపి చెత్త కేంద్రానికి  తరలించారు .

 

కర్మల భవనం దగ్గర దారి మీది కి వ్యాపిస్తున్న చెట్ల పెద్ద కొమ్మల్ని శ్రమతో, నేర్పుతో నరికి అక్కడి అందానికి మెరుగులు దిద్దారు .నర్సరీల సమీపం లో మహిళలు శుభ్ర పరుస్తూ –కొసరుగా భారత లక్ష్మి వడ్ల మరదారికి మళ్లి –కొంత శుభ్రపరిచారు.

 

చలిని –మంచును –గాలిని –యాతాయాత వాహనశ్రేణి పొగను, దుమ్మును –వేటిని లెక్కచేయక 100 నిమిషాల పాటు తదేక దీక్షతో (తమ లాభం - శ్రేయస్సుల కోసం కాదు !) గ్రామం ఉమ్మడి సంక్షేమం కోసం వేలాది దినాలుగా పాటుబడుతున్న ఈ స్వచ్చ కార్యకర్తలు ఎప్పటికీ స్పూర్తి ప్రదాతలే ! 

కాఫీ –టీ ఆస్వాదనానంతరం 6.35 నిముషాలకు జరిగిన సమీక్షా సమావేశం లో –ముందుగా పైడిపాముల కృష్ణ కుమారి గారి ప్రసంగరహిత స్వచ్చ సుందర సంకల్ప నినాదాలతో –గురవయ్య సూక్తులతో 6.40 నిముషాలకు మన కర్తవ్య దీక్ష రేపటికి వాయిదా పడింది. రేపటి మనకృషిని ఏ.టి.యం. కేంద్రం దగ్గర ఆగి , విస్తరిద్దాం!

        స్వచ్యోద్యమ కారుడ నగ........  

సంకుచితత్వం నశించి సద్భావన వికసిస్తే-

సముచిత సమయంలోనే సాహసించి పయనిస్తే –

వ్యష్టి కాక సమష్టి గా అడుగులు ముందుకు పడితే –

స్వచ్యోద్యమ మనగా అది ! అతడే స్వచ్చ సైనికుడట !

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు- మనకోసం మనం ట్రస్టు,

బుధవారం – 22/01/2020

                 చల్లపల్లి.