2339* వ రోజు....           03-Feb-2022

ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?

2339* వ నాటి శ్రమదాన సందడి.

        తాము నివసిస్తున్న గ్రామానికి - తాము వికసిస్తున్న సమాజానికి ఈ గురువారం (3.2.22) వేకువ 4.19 & 6.16 నడుమ చేతనైనంత సహాయపడిన ధన్యజీవులు 22 మంది. వారి శ్రమదానంతో మరింత శుభ్ర - సుందరమై శోభించిన ముఖ్య వీధి బందరు మార్గంలో అన్ని వేళలా నగదు (ATM) కేంద్రం నుండి ఇంధన విక్రయ కేంద్రం (బంకు) దాక! ఈ 120 గజాల పరిధిలోనే వస్త్ర విక్రయ శాలలు, ద్విచక్ర వాహన కేంద్రం, చిన్న కార్ల స్థావరం, బ్యాంకులు వగైరాలు!

        మరి - ఇక్కడ ప్రశ్నేమంటే - ఎనిమిదేళ్ల స్వచ్ఛ సుందరోద్యమ నేపధ్యంలో - సుమారు 3 ½  లక్షల పనిగంటల శ్రమదాన చరిత్రలో - ఇందరు దుకాణదారుల్లోను, గ్రామ – గ్రామేతర జనుల్లోను కనీస పౌర సామాజిక స్పృహ, ఊరిపట్ల ఉమ్మడి బాధ్యతా గుర్తింపు ఎందరిలో -  ఏమాత్రం కనిపిస్తున్నదా అని! అత్యధిక గ్రామస్తుల్లో గనుక అవి ఏర్పడినప్పుడు ఈ సుదీర్ఘ స్వచ్యోద్యమం అవసరం తీరిపోవాలి ! ఇందరు స్వచ్ఛ కార్యకర్తల ఆవశ్యకత తగ్గిపోయి, మహా ఐతే పంచాయితీ కార్మికుల సహాయంతోనే ఈ ఊరు స్వయం ప్రకాశితమై – దేశ ప్రసిద్ధమై నిలవాలి!

        ఈ 30 వేల మంది గ్రామస్తుల్లో, నిత్యం వచ్చే - పోయే ఏడెనిమిది వేల మంది జనుల్లో -  విద్యాధికులున్నారు, ఉద్యోగులు – రాజకీయులు - కుల సంఘనేతలు - రైతు పెద్దలు - వణిక్ప్రముఖులు తదితర చైతన్యశీలురున్నారు. అందరమూ గట్టిగా తలచుకొంటే - రోజులో ఒక్క గంట ఉమ్మడి శ్రేయస్సుకు, స్వస్తతకూ పాటుబడితే ఈ చల్లపల్లి స్వచ్ఛ – శుభ్ర – సుందర - నందనం కావడం ఎంతపని!

        ఇప్పటికివి ప్రశ్నలే – ఊహలే - స్వప్న దశలే కావచ్చు! స్వచ్ఛ కార్యకర్తల పరోపకారపారీణత, అభినివేశం, శ్రమ జీవనతత్వం చూస్తుంటే - ఎప్పటికైనా మన ఈ చారిత్రక గ్రామంలో అవి సాధ్యములెందుకు కాగూడదు?

        2 గంటల పాటు ఈనాటి కార్యకర్తల వీధి శుభ్రతా విన్యాసాలు షరా మామూలుగానే సాగిపోయాయి. ఉచ్చ మడుగుల మధ్య, మురుగు కాల్వల దుర్గంధాలలో పనిచేసే అలవాటున్న ఈ శ్రమదాతలకు ఎదురేముంది? బాధ్యతా రహితులైన గ్రామ ప్రజలుండేంత వరకు వాళ్లకు చేతినిండా పనే గదా మరి!

- నేటి ముఖ్య వ్యాపకం చీపుళ్లతో ఉడ్చినదే! 12 మంది పూనుకొన్నది అందుకే! నలుగురైదుగురు దుమ్ముగుట్టల్ని, ఆకులలముల్నీ, ప్లాస్టిక్ సంచుల్ని డిప్పల్తో

ఎత్తి ట్రక్కుల్లో నింపడమే సరిపోయింది!

- గతంలో తామే నాటి పెంచిన మూడు చెట్ల కొమ్మలు అక్రమ పద్ధతిలో పెరిగితే సహించలేని ఒక పోస్టల్ ఉద్యోగి సన్నగోడ మీది కెక్కి, వాటిని కత్తిరించి, సక్రమ రూపం ఇచ్చాడు.

- 6.10 సమయం నుండి కాస్త బ్రతిమాలితే గాని ఒక రైతు, ఒక కాంపౌండరు,

ఒక విశ్రాంత ఉద్యోగి పని విరమించలేదు!

- ఇంకొకాయనది అదొక లోకం – నిన్నశుభ్రపరచిన ATM కేంద్ర రంగురాళ్లను 2 గంటల పాటు మళ్ళీ గోకి, ఊడ్చి, సుందరీకరిస్తూనే ఉన్నాడు!

        6.40 సమయంలో ఆకుల దుర్గా ప్రసాదు మహోదయుని గ్రామ స్వచ్ఛ – పరిశుభ్ర సౌందర్య స్ఫోరక నినాదాలతోను, అనితర సాధ్యమైన నేటి కృషి సమీక్షతోను మన శ్రమదానం రేపటికి వాయిదా పడింది!

        బందరు దారిలోని పెట్రోలు బంకు ఎదుటనే మన రేపటి వేకువ పరస్పర పునర్దర్శనం!  

 

       మహానేతలూ V స్వచ్ఛ కార్యకర్తలు.  

అధికారో - ధనశాలో - అత్యున్నత నాయకుడో

అగుటకన్న స్వార్థ రహిత స్వచ్ఛ కార్యకర్తగుటే

అత్యున్నత పదవనుకొని గ్రామానికి అంకితమై

అనుసరించి తలదాల్చుము స్వచ్చోద్యమ ఆశయాన్ని!

 

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

 

   03.02.2022.