1899 * వ రోజు....           23-Jan-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1899* వ నాటి ముచ్చటలు.     

మంచు కుమ్మేస్తున్న ఈ నాటి వేకువ 3.59-6.16 నిముషాల నడుమ నిర్వహించిన గ్రామ స్వచ్చంద బాధ్యతలకు కలిసి వచ్చిన వారు (26+ముగ్గురు మహిళలు) 29 మంది. ఈ పరిశుభ్రతా కృషీ వలుల కార్యక్షేత్రం నిన్నటి తరువాయిగా-బందరు మార్గం లోని రక్షక భట కార్యాలయ వీధి నుండి నాగాయలంక బాటలోని తపాలా కార్యాలయం సందు వరకు.

 

రకరకాల దుకాణాల-దేవాలయాల-ఫలాహారశాలల- వాణిజ్య సముదాయాల-పూల అంగళ్ల- ఇంధన కేంద్రాలతో నిత్యం రద్దీగా ఉండే ఈ అర కిలో మీటరు జాతీయ రహదారి గంట గంటకూ కిలోలకొద్దీ కాలుష్య ఉత్పత్తికి ముఖ్య కేంద్రం! దట్టమైన ఈ మంచులో వాహనాల లైట్ల వెలుగు 10 గజాలకు మించి కనిపించని చోట చాకచక్యంగా అన్ని రకాల వ్యర్ధాలను, దుమ్మును, ఊడ్చి, కొండొక చోట మురుగు కాల్వల సిల్టు, తుక్కు పైకి లాగి, తాము పోగులు చేసిన ఈ అన్ని వ్యర్ధాలను ట్రాక్టరు లో నింపి, చెత్త కేంద్రానికి తరలించడమంటే నేను వ్రాస్తున్నంత తేలిక కాదు.

 

ఈ స్వయం ప్రేరిత స్వచ్చంద శ్రమదాతలు తమ గ్రామం కోసం 1899 రోజులుగా, ఇలా పాటుబడుతూనే ఉన్నారు. మూడు రోడ్ల ప్రధాన కూడలిలో వీరు ఈ రోజు 10 నిముషాలకు పైగా చేసిన స్వచ్చ-శుభ్ర చర్యలు వర్ణణీయం-స్మరణీయం!

 

అనిష్టంగానే 6.16 నిముషాలకు ఊడ్పు ఆపి, ఆపై 10 నిముషాలు వ్యర్ధాలను ట్రాక్టర్ లో నింపి, కాఫీ-టీ ల ఆస్వాదనా ఘట్టం తరువాయి జరిగిన సమీక్షా సమావేశంలో జూఝవరపు ప్రశాంతమణి గారు గత కొన్ని వారాలు తన స్వచ్చంద శ్రమదానానికడ్డు తగిలిన అనారోగ్యాన్ని ప్రస్తావించి, స్వచ్చ-సుందర సంకల్ప నినాదాలను ముమ్మారు ప్రకటించగా – 6.40 నిముషాలకు మన స్వచ్చ సంకల్పం నేటికి ముగిసింది.

 

రేపటి శ్రమదాన కార్యక్రమం అగ్రహారం మొదటి వీధి దగ్గర ఆగి విజయవాడ మార్గంలో నిర్వహించాలని నిర్ణయం జరిగింది.

 

              గ్రామమంటే....

వ్యష్టి తత్వం కృశించాలోయ్-సమష్టితత్వం రహించాలోయ్

నేను- నాకను పరిధి దాటి మనం-మనకని కదలవలెనోయ్

సమాజాన్ని వదలి ఎవ్వరు స్వస్త-సుఖములు పొందలేరోయ్

గ్రామమంటే మట్టి కాదోయ్-క్రమవికాస సమాజమేనోయ్!

 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు- మనకోసం మనం ట్రస్టు,

గురువారం – 23/01/2020

                                                  చల్లపల్లి.