1900* వ రోజు....           24-Jan-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం చారిత్రాత్మకమైన 1900* వ నాటి ఘట్టాలు.

దట్టమైన మంచులో-చలిలో నేటి వేకువ 4.05 నుండి 6.12 నిముషాల దాక, కాలంతో పోటీ పడుతూ 32 మంది స్వచ్చ కార్యకర్తల శ్రమ విరాళ విన్యాసాలు చల్లపల్లి మూడు రోడ్ల ప్రధాన కూడలి నుండి విజయవాడ మార్గంలో కస్తూరి మామ్మగారి రహదారి ఉద్యానం దాక జరిగినవి!

 

దారి పొడుగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు.... అనే శ్రీ శ్రీ లాంగ్ మార్చ్ గేయం గుర్తుకు వచ్చేలా-బడ్డీ కొట్ల, టీ, కాఫీ దుకాణాల-మాంస విక్రయ కేంద్రాల కాలుష్య కారక వ్యర్ధాలన్నిటినీ ఏరుతూ, ఊడ్చుతూ, శివాలయం దగ్గరి టీ కొట్ల కప్పుల్ని, భోజన శాలల ముందరి కంగాళీలను తుడిచి పెడుతూ ఈనాటి కార్యకర్తల స్వచ్చోద్యమ ప్రస్థానం నిరాఘాటంగా సాగిపోయింది.

 

సుందరీకరణ కార్యకర్తలు శ్రీమంతు క్లబ్ ఎదుట తామే నారుపోసి, నీరుపోసి, సంరక్షించి పెంచిన ఉద్యాన వనాన్ని క్షుణ్ణంగా-ఒకరి తర్వాత ఒకరు ఐదుమార్లు ఊడ్చి, రంగు రాళ్లను తుడిచి గాని వదల్లేదు. (కని- పెంచిన మమకారం మరి!)

 

చల్లపల్లి గ్రామ రక్షక దళం తన పనిలో తాను పట్టుదలగా-సంపటాలమ్మ గుడి దగ్గరి సారవంతమైన మట్టిని గురవారెడ్డి బహూకృత వాహనంలో నింపి, గంగులవారిపాలెం దారిలో పూల మొక్కల వినియోగానికై దింపి వచ్చారు. ఆ పిదప గొర్రుల వారు, చీపుళ్ల వారు పోగులు చేసిన మట్టి, దుమ్ము, వ్యర్ధాలను ట్రక్కులో నింపి, చెత్త కేంద్రానికి తరలించారు.

 

నేటి రహదారి శుభ్రత ముగిసి, 6.20 కి కరీముల్లా సెంటర్ కు చేరుకొన్న తరువాత జరిగిన సమీక్షా సమావేశంలో రామకృష్ణ ప్రసాదు గారు 3 రోజుల తమ భోపాల్ పర్యాటక విశేషాలు వివరించి, స్వచ్చోద్యమ చల్లపల్లి లక్ష్య సాధన కోసం అన్ని గ్రామాల స్వచ్చ కార్యకర్తల- ఆటో, టాక్సీ చోదకుల సమావేశాన్ని త్వరలో నిర్వహించే ఉద్దేశాన్ని ప్రతిపాదించారు.

 

శ్రీ శ్రీ కవిత్వ అనుసరణ ధోరణిలో ఈ నమ్మశక్యంగాని1900* రోజుల చల్లపల్లి ఉద్యమం గురించి, అప్పటికప్పుడు నేను వ్రాసి చదివిన రెండు పద్యాలతో ను, నేను ముమ్మారు ప్రకటించిన స్వచ్చ- ఆరోగ్య- ఆనంద- ఆదర్శ చల్లపల్లి సాధనా సంకల్ప నినాదాలతోను 6.43 నిముషాలకు మన నేటి కర్తవ్య దీక్షకు తాత్కాలిక స్వస్తి!

 

కొర్రపాటి వీరసింహుని మిఠాయి పంపకం, ట్రస్టు వారి తీపి పదార్థం పందేరంతో నేటి మన ఈ సమావేశం సుమధురమై పోయింది.

 

రేపటి మన శ్రమదాన వేడుక నాగాయలంక రోడ్డులో బస్టాండ్ వద్ద కోట మలుపు దగ్గర కలుసుకొందాం!

 

           సమర్పణం x పరి గ్రహణం.

ఇన్ని వేల దినాల చర్యలు- సేవ కాదది బాధ్యతోయ్!

ఎవరి కొరకీ శ్రమ విరాళం? ఎందుకీ స్వచ్చోద్యమం?

ఎంత మనము పరిగ్రహిస్తిమి? ఎంత ఊరికి సమర్పిస్తిమి?

లెక్క-డొక్కలు తేల్చుకొనుటకు లేదు సమయం- కదలవోయ్!

 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు- మనకోసం మనం ట్రస్టు,

శుక్రవారం – 24/01/2020

చల్లపల్లి.