2366*వ రోజు..........           01-Mar-2022

 ఏక మాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా ఎందుకు వాడాలి?

మహా శివరాత్రి పండుగ వేళ – 2366* వ నాటి స్వచ్చ శుభ్రతా విన్యాసాలు.

            మంగళవారం (1-3-22) వేకువ మహా పర్వదినంలో కూడ 4.19 కే మేకలడొంక వద్ద స్వచ్ఛ కార్యకర్తల హాజరు! 31 మంది శ్రమదాతల రహదారి పారిశుద్ధ్య వీర విహారానికి దట్టమైన మంచు అడ్డంకులు! ఒక వంక ఆ పొగ మంచులోనే ఎడతెగని ద్వి త్రి - చతుశ్చక్ర వాహనాల ప్రమాదకరమైన వేగపూరిత రాకపోకలు!

            ప్రక్క శైవక్షేత్రానికి ఉరుకులు - పరుగులుగా భక్తుల తాకిడి; ఇటు మాత్రం 30 మంది సామాజిక కార్యకర్తల శ్రమదాన ఒరవడి! ఒకటి వైయక్తిక ముక్తి సాధన, మరొకటి సామాజిక ఋణ విముక్తి బోధన! స్వచ్ఛ కార్యకర్తల్లో గూడ భక్తులున్నారు కాని భక్తికన్నా వేలాది పుణ్యక్షేత్ర సందర్శకుల అవసరాలు గమనించడం వాళ్ల ప్రాధమ్యం!

            భారత కథలో బాల పాండవ కౌరవుల భోజనం వేళ దీపం ఆరిపోతే - ఆ చీకట్లో ఎందరు ఎలా తిన్నారో గాని, ఒక్క అర్జునుడికే చీకట్లో భోం చేసినట్లే చీకటిలో బాణం ఎందుకు వేయలేనుఅనే ఆలోచన తట్టిందట! 2 గజాల దూరం వస్తువైనా కనిపించని భారీ మంచులో చల్లపల్లి స్వచ్చ కార్యకర్తల శ్రమదానం కూడ అలాగే అనిపిస్తున్నది. జిమ్ లకీ, జాగింగ్ లకి వెళ్లేవాళ్ళు కొంత వార్మింగ్ పనులు చేస్తారట - మరి ఈ కార్యకర్తల పారిశుద్ధ్య కృషికి మాత్రం ఆ అవసరం రాదు! (3.30 కే లేచి, 4.15 కే శ్రమదాన కర్మక్షేత్రానికి రావడమే వాళ్ల మానసిక శారీరక సంసిద్ధత!)

            మేకలడొంక కాల్వ వంతెన మొదలు కొని, పడమరగా దాణా కర్మాగారం దిశగా కొంతమేర, 7 వ నంబరు పంటకాల్వ ఉత్తర దిశగా కొంత దూరం నేటి శ్రమదానం సాగింది! 600 ఏళ్ల క్రితం ఒకానొక పర్యాటక తెలుగు కవి శ్రీనాధుడు ఈ ప్రాంతాన్ని ఎక్కడ చూసినా మంచినీటి చెరువులే, గుడులే, వివేక శాలురైన మనుషులే...!అని పద్యాల్లో వర్ణించాడట! ఈ వేకువ శ్రమదానానికి పూనుకొన్న కార్యకర్తలకు అడుగడుగునా ఖాళీ మద్యం సీసాలే - ప్లాస్టిక్ గ్లాసులే, ప్లేటులే, తాటి - కొబ్బరి బుర్రలే, రోడ్డంతా దుమ్ము - ధూళి, ఆకులలములే!

            అందుకే అతి కష్టమ్మీద 2 గంటల వ్యవధిలో 120 గజాల రహదారి మాత్రమే శుభ్రపడింది. అందువల్లనే గాబోలు - 2366* పారిశుద్ధ్య పని దినాలైనా చల్లపల్లి స్వచ్చ పరిశుభ్ర - సౌందర్యాల అంతిమ విజయం కోసం ఇంకా ఎదురు చూస్తున్నది!

            ధ్యానమండలి వారి పులిహోర, దధ్యోజనాల అందజేత వల్ల ఆలస్యమైన సమీక్షా సమావేశంలో గట్టిగా ముమ్మారు గ్రామ స్వచ్ఛ శుభ్ర- సౌందర్య సాధనా ప్రతిజ్ఞల్ని వినిపించినది, చేయించినది BDR ప్రసాద్! ఈ నడుమ చల్లపల్లి స్వచ్చోద్యమానికి గుప్తదానాలు ఎక్కువౌతున్నట్లున్నవి. నేడు కూడ ఒక అజ్ఞాత భూరి విరాళం మనకోసం మనంట్రస్టుకు జమపడింది! వీరి గుప్త దానం మొత్తం 47 వేలకు పైగా లెక్క తెలుతున్నది. (మరొక విశ్రాంత ఉపాధ్యాయుని యార్లగడ్డ పుష్ప సుందరావతి గారు 2,000/-  విరాళాన్ని ట్రస్టుకు జమచేయనున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటి వరకు వీరు ఇచ్చిన దానం మొత్తం 7 వేలకు పైగా లెక్క తేలుతున్నది.)

            పండుగ వేళ స్వచ్ఛ కార్యకర్తలు పెదకళ్లేపల్లి తిరునాళ్లకు గనుక వెళ్తే - ఆ పరమశివుణ్ణి సత్వరమే చల్లపల్లే గాక సమస్త దేశమూ స్వచ్ఛ శుభ్ర - సుందరం అయ్యే వరం కోరుకోవాలని నా విజ్ఞప్తి!

            రేపటి స్వచ్ఛ స్వస్త శ్రమదాన కేంద్రంలో మరొక మార్పు - ఇదే రహదారిలో మేకలడొంక దగ్గర కాక, చల్లపల్లి దగ్గర్లోని సిమెంటు కొట్టు దగ్గరే మన పునర్దర్శనం!

 

            నాకీ ఒక తృప్తి చాలు

ఎడతెగక అలవోకగ రెండు వేల పై దినాలు

ఇరవై - ముప్పై - నలభై - ఏబై మంది శ్రమదాతలు

ఒక మాటగ - ఒక దీక్షగ ఉద్యమించు ఘట్టాలను

పాల్గొంటిని - గమనిస్తిని - వర్ణిస్తిని చాలు నాకు!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   01.03.2022.