2367*వ రోజు....           02-Mar-2022

 ఏక మాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా ఎందుకు వాడాలి?

27 మందితో 2367* వ నాటి వీధి శుభ్ర - సుందరీకరణం.

            2-3-22 వ తేదీ బుధవారం - శివరాత్రి పర్వదినానంతరం - తిరునాళ్ల తరిలో పెదకళ్లేపల్లిలో కశ్మల భీభత్సం! లోపించిన ప్రజారోగ్య స్పృహతో ట్రక్కుల కొద్దీ - టన్నుల కొద్దీ పుణ్య క్షేత్ర పరిసరాల్లో పేరుకొన్న కాలుష్యం! ముక్తి అన్వేషణలో మరుగుపడిన ఉమ్మడి ఆరోగ్య సంక్షేమం! ఎంతటి విచక్షణారాహిత్యం! రహదారుల్నీ, గ్రామ వీధుల్నీ, కాల్వల్నీ, నదీనదాల్నీ చెడగొట్టుకొనే ఈ దురాచారం ఇంకా ఎంత కాలం?

            సరే - చల్లపల్లిలో ఐతే రోజూ 3040 - 50 మంది స్వచ్చోద్యమ కారులు 2367* రోజులుగా అదేదో వాళ్లకొక వ్యసనమనేంతగా ఊళ్ళో ఏదో ఒక మూల కాలుష్యం అరాచకాన్ని తగ్గిస్తూ, హరిత శుభ్ర సౌందర్యాల్ని కాపాడుతూ, పెంపొందిస్తూంటే - అదిప్పుడు స్వచ్చ సుందర చల్లపల్లిగా నిలుస్తున్నదనుకోండి! ఆ మార్గదర్శకత్వంలోనే ఘంటశాల, కోడూరు, యార్లగడ్డ వంటి 30 కి పైగా గ్రామాల ప్రయత్నం చూస్తున్నాం గాని, పెదకళ్లేపల్లి లాంటి ఊళ్ల సంగతేంటి?

            చల్లపల్లి స్వచ్చోద్యమం పరిస్థితి కొస్తే - అది రోజు రోజుకీ స్ధిరపడి, సుస్థిరపడి, క్రొత్త శ్రమజీవన సంస్కృతి నెమ్మదిగానైనా - కొంత మందికే పరిమితమైనా - వ్యాపిస్తున్నది. నిన్నటి పెద్ద పండుగ నాడు సైతం గ్రామ రహదారి మేలిమి కోసం 30 మంది పెనుగులాడడమే అందుకు నిదర్శనం!

            గ్రామ సమాజ సౌఖ్యం కోసం చేస్తున్న తమ శ్రమదానాన్ని వీళ్లెవరి బలవంతంతోనో చేయడం కాదు ఇష్టంగా, నానాటికీ సృజన శీలంగా, ఇంతటి మురికి, కరకు పనుల్లో ఆనందం వెదక్కొంటూ చేయడమే చల్లపల్లి స్వచ్చోద్యమ ప్రత్యేకత!

            బహశా అందుకేనేమో - క్రొత్త మంచిని ఆహ్వానించే వాళ్లకీ, సవ్యమైన సామాజిక పరివర్తనను ఎక్కడున్నా పసిగట్టగల వాళ్లకీ ఈ ఊరు పర్యాటకంగా మారిపోతున్నది!

ఈ వేకువ జరిగింది 100 గజాల రహదారి పవిత్రీకరణమే! ఐతే అందులో:

1) తమ ఇంటిని కాక - 3 కిలో మీటర్ల దూరంలోని బాటను, మురుగు కాల్వ గట్లనూ ఊడుస్తున్న నలుగురు మహిళలూ,

2) చూసే వాళ్లకి వింతగా తాము ఏరిన ఖాళీ మద్యం సీసాల డిప్పల్ని నెత్తి మీద మోస్తున్న ఇద్దరు వ్యక్తులూ,

3) లోతైన డ్రైనులో దిగి, ముళ్ల - పిచ్చి - మొక్కల వ్యర్ధాల పనిబడుతున్న 10 - 12 మందీ,

4) చెత్త డిప్పల్ని దూరం నుండే ట్రాక్టర్ లోకి విసురుతున్న ఐదారుగురూ,

5) ఆ విసుళ్లను కాచుకొంటూ, అందుకొంటూ, సర్దుతున్న ఒక పనిమంతుడినీ

6) కాళ్ళు తడబడుతున్నా రోడ్డును ఊడుస్తున్న ఇద్దరు (నాకంటే పెద్ద) వృద్ధులూ......ఇలాంటి సన్నివేశాలు రోజూ చూస్తున్నా ఏ రోజుకారోజు నాకు ఉత్తేజకరాలే! ప్రతి రాష్ట్రంలో - ప్రతి ఊళ్ళో ఆవశ్యకమైన చేష్టలే! ప్రజారోగ్యం దృష్ట్యా గ్రామ హితం కోణంలో ఇవన్నీ ఆచరణీయాలే అనుసరణీయాలే!

            క్రొత్త నెల వచ్చిందంటే ట్రస్టు ఖర్చుల కోసం ఉదయ శంకర శాస్త్రీజీ లోని వితరణ శీలి మేల్కొంటాడు కార్యకర్తలకు  మంచి నీటి సరఫరా కోసం 3 స్టీలు నీళ్ళ సీసాలను, వారి నెలవారీ 5,000/- విరాళాన్ని మేనేజింగ్ ట్రస్టీ, కాఫీలోకి అనుపానంగా బిస్కట్లను కార్యకర్తలు అందుకొన్నారు. నేటి గ్రామ మెరుగుదల సంకల్ప దీక్షా నినాదాలను ప్రకటించిన వంతు లంకే సుభాషిణిది!

            బండ్రేవు కోడు కాల్వ వంతెన దాక మిగిలిపోయిన రహదారి శుభ్రత కోసం రేపటి వేకువ మనం కలిసి కృషి చేయవలసిన చోటు బోసు గారి దాణా తయారీ కేంద్రం (కళ్ళేపల్లి రోడ్డు) దగ్గర!

 

            ఎవరికి వారే...

ఎవరి స్వచ్ఛతకు వారే - ఎవరి శుభ్రతకు వారే

కోవిడ్సమయంలో బాధ్యతలు వహించకున్న

ఎవరెవరో వచ్చి చూసి నీ ఇంటిని - నీ ఒంటిని

అనుక్షణం కనిపెట్టుదురని ఊహిస్తావా మరి?      

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   02.03.2022.