1901* వ రోజు....           25-Jan-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!   

 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1901* వ నాటి పారిశుద్ధ్య కృషి.

ఈ స్థిర వార శుభోదయంలో 4.10 నుండి 6.26 నిముషాల నడుమ ప్రభుత్వ రవాణా నిలయానికి మూడు దిశలుగా జరిగిన రహదారి పారిశుద్ధ్య కృషిలో పాల్గొన్న ధన్యులు 32 మంది.

 

ఒక క్రమ పద్ధతిలో – పని విభజనతో నిర్వహించిన గ్రామ ప్రయోజనకరమైన నేటి ముప్పేట శుభ్రతా చర్యల్లో:

- నాగాయలంక దారిలోని వాహన ఇంధన శాల(పెట్రోలు బంకు) మొదలుకొని ¾ కిలోమీటర్ల దాక - మూల మలుపు –పోతురాజు గుడి దాక జాతీయ రహదారిని నలుగురేసి కార్యకర్తలు వంతులేసుకొని చెరొక ప్రక్క ఊడ్చి శుభ్రపరిచారు. ఏదో నామ మాత్రంగా కాదు సుమా! పాల విక్రయ కేంద్రాల, కట్టెల అడితీల- చిరు తిళ్ల విక్రయ శాలల- టీ-కాఫీ దుకాణాల-శీతల పానీయ విక్రయ శాలల సమస్త వ్యర్ధాలను చాటుమాటుల నుండి కూడ బైటకు లాగి, క్షుణ్ణంగా బాగు చేయనిదే వారికి తృప్తి ఉండదు!

 

- మరొక బృందం బస్టాండు మూడు రోడ్ల సంగమం నుండి పెదకళ్లేపల్లి వంతెన దాక నిర్వహించిన గ్రామ బాధ్యత ప్రత్యేకత దగ్గరగా గమనిస్తేనే తెలుస్తుంది. ఆటోల నుండి, రకరకాల దుకాణాల నుండి, సమీప గృహాల నుండి వచ్చి పడే వ్యర్ధాలతో వంతెన సమీపస్థ మురుగు కాల్వ చిన్నపాటి చెత్త కేంద్రంగా మారితే- ఆ మంచులో, చలిలో, ఈ కార్యకర్తల శ్రమదానం గమనిస్తే- ఒళ్లు గగుర్పొడుస్తుంది; మనసు ద్రవిస్తుంది. (కవిత ప్రవహిస్తుంది!)

 

ఒక గంట పాటు రెండు భిన్న దృశ్యాలను చూసి, ఆలోచించాను:

 

- ఒకాయన తన మెకానిక్ షాపు ముందరి పాత వాహనాలను సర్ది సరిచూసుకొనడం, కూల్ డ్రింక్ దుకాణ యువకుడు తన కొట్టు ముందు నీళ్లు చల్లి ప్రకటనా ఫలకాన్ని సరిచేయడం, ఆటో వాహన చోదకులు రేపల్లె ప్రయాణీకుల్ని పిలిచి, పిలిచి సమీకరించుకోవడం ఇత్యాది.

 

-అదే సమయంలో స్వచ్చంద శ్రమదాతలు ఇంత చలిలోనూ చెమట పట్టేలా దీక్షగా రోడ్లను, మురుగు వ్యర్ధాలను ఊడ్చి, తోడి శ్రమించడం. మొదటిది కూడ అవసరమే కాని మరి ఏది ఎక్కువ ఆచరణీయ ఆదర్శం?

6.55 నిముషాలకు ముగిసిన దైనందిన కృషి సమీక్షలో నాయుడు మోహనరావు ముమ్మారు విస్పష్టంగా గ్రామ స్వచ్చ సుందర సంకల్ప నినాదాలను ప్రకటించి, ఎదుటి వ్యక్తిని మన చర్యలతో బాధించరాదని గుర్తు చేయగా,  మన (స్వచ్చ సుందర) డాక్టరు గారు 900 సంవత్సరాల నాటి తెలుగు భారతంలో నిజమైన అచ్చ తెలుగు కవి తిక్కన ఇదే అర్థంతో వ్రాసిన కంద పద్యాన్ని-

“ఒరులేయవి యొనరించిన

 నరవర! అప్రియము తన మనంబునకగు తా

 నొరుల కవి చేయ కునికియె

పరాయణము పరమ ధర్మ పథముల కెల్లన్” గుర్తు చేశారు.

 

(ఇది విదుర నీతి. మానవ ప్రవర్తనా నియమావళిని ఒక్క వాక్యంలో ఇలా చెప్పేశారు. “ఓ రాజా! ఇతరులు  చేసే ఏ పనుల వల్ల మనకు మనస్తాపం కలుగుతుందో, మనము ఇతరుల పట్ల ఆ పనులు చేయక పోవడమే అన్నిటికన్నా ఉత్తమ ధర్మం”).

 

రేపటి మన స్వచ్చతా ప్రయత్నాన్ని రాష్ట్ర రహదారి రవాణా సంస్థ లో కొనసాగిద్దాం!

 

       నిజంగానే!  నిజంగానే?

నిజంగానే చల్లపల్లి లొ నిఖిల లోకం హసించేలా

ఇన్ని వందల నాళ్ల నుండీ- ఇంత గొప్ప శ్రమైక జీవన

మధురిమలతో మాతృగ్రామం పరవశించిందా!

స్వచ్చ-సుందర-శుభ్రతలతో ప్రమోదించిందా!

 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు- మనకోసం మనం ట్రస్టు,

శనివారం – 25/01/2020

చల్లపల్లి.