2368*వ రోజు....           03-Mar-2022

 ఏక మాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా ఎందుకు వాడాలి?

శివరామపురం దారి శుభ్రత - @2368*

            గురువారం నాటి వేకువ - సమయం 4.18 స్వచ్చ కార్యకర్తలు 29 మంది, కళ్ళేపల్లి బాటలో గ్యాస్ కంపెనీ గోడౌన్ ప్రాంతం. అక్కడొక 100 గజాల దారికి ఉభయ దిశల్లో 3 - 4 రకాల శ్రమ సమర్పణం! రెండు గంటల 10 నిముషాల పెనుగులాటలో మారిపోయిన రహదారి, డ్రైన్ల స్వరూపం! “శ్రమయేవ జయతే” అని మనం చాల మార్లనుకొంటాం గాని - మరీ ఇంత కఠోర శ్రమా?

        ఫ్యాక్షనిస్టుల క్రౌర్యంలోనో, లాభపూరిత – కరడు గట్టిన స్వార్ధాల కోసమో ఎప్పుడైనా ఇంతటి కఠిన శ్రమను చూస్తామేమో గాని, ఒక గ్రామం సమిష్టి సంక్షేమం దృష్ట్యా ఇందరి సామూహిక సత్కృషి చల్లపల్లిలో మాత్రమే చూడగలమనుకొంటా!

        అందుకే ఈ స్వచ్చ కార్యకర్తలకు లక్షలు పోసినా దొరకని ఇంతటి దైనందిన సంతృప్తి! వానైనా – మంచైనా – గ్రీష్మతాపమైనా సుదీర్ఘ – సువ్యవస్థిత - సుప్రయోజనకర చల్లపల్లి స్వచ్చోద్యమం ఆదర్శంగా నిలుస్తున్నదీ ఇందువల్లనే!

        వేకువ సమయ చరితార్థ శ్రమ వేడుకలో పాల్గొనజాలని గ్రామస్తులు ఒక్కమారు జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం పేరిట సామాజిక మాధ్యమ చిత్రాలను చూస్తే కొట్టొచ్చినట్లు కనిపించే -  వినిపించే దృశ్యాలేమిటి?

- ఊరి జనంలో 5% కూడ మేల్కొనని 3.30 కి లేచి, 2 - 3 కిలోమీటర్ల దూరాన్ని వీధుల్ని దాటుకొని 4.15 కే నిర్దేశిత స్థలంలో నిలిచిన 30 మంది సుశిక్షితులైన స్వచ్చ సైనికులు! (వీళ్లది రష్యా - ఉక్రైన్ల పరస్పర హననం కాదు... గ్రామం మేలు కోసం జరిగే ఒక సాత్త్విక యుద్ధం!)

- రోడ్డుకు తూర్పున 10 - 12 గజాల క్రిక్కిరిసిన ముళ్ల - పిచ్చిచెట్ల, పనికి మాలిన తీగల పొదను కత్తుల్తో – గొర్రుల్తో – చుట్టు ముట్టిన డజను మంది కార్యకర్తలు! మూసుకుపోయిన డ్రైన్ లోని ఎండు కొమ్మలు, రకరకాల వ్యర్ధాల్ని దంతెలతో, మ్రోకుల్తో బైటకు లాగి -  గంటన్నర పాటు ఆ ప్రాంతం స్వరూపాన్ని మార్చిన వైనం!

- ఇక ఎండు చెట్లను నరికే వాళ్లు, ఖాళీ మద్యం సీసాల సేకర్తల ద్వయం, చీపుళ్ల గరగరల, పైకెగస్తున్న దుమ్ము మేఘాల నడుమ ఊడ్చే మహిళలు,  

- ఇంత చల్లని మంచు వేళ ఇందులో కొందరి చొక్కాలు చెమటకు తడిసి, బట్టలు దుమ్ము, బురద అంటుకొన్న కొన్ని దృశ్యాలైతే కొందరం కళ్లార్పకుండ చూస్తూనే ఉంటాం....

        6.45 కు మరొక అపురూప ఉద్వేగ సన్నివేశమేమంటే : 84 ఏళ్ళ వేమూరి అర్జున నామధేయునికి ఆత్మీయ వీడ్కోలు : కన్నడ దేశానికి బయలు దేరే ముందు అతని స్వచ్చ - శుభ్ర – సౌందర్య నినాదాలు! చల్లపల్లి స్వచ్చోద్యమాన్ని 2000/- విరాళంతో దీవించడం! ఇలాంటి ఎందరు సహృదయుల సౌజన్యంతోనో మన గ్రామ మెరుగుదలలో ఇన్ని విజయాలు!

        వారం రోజులుగా పూర్తిగాని ఇదే కళ్లేపల్లి బాటలోనే HP గ్యాస్ గోడౌన్ దగ్గరనే రేపటి వేకువ మన పునర్దర్శనం!

        ఒక అనివార్యత

ఇన్నాళ్లుగ - ఇన్నేళ్లుగ ఈ స్వచ్యోద్యమ కారులు

అలసి సొలసి విసుగు చెంది ఆపలేదు తమ విధులు

కనిపించని ఒక వైరస్ కల్లోలం కారణముగ

ప్రభుత్వ మార్గదర్శకాల వలననే అనివార్యముగా.....!

 

- నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

03.03.2022.