2369*వ రోజు.......           04-Mar-2022

 ఏక మాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా ఎందుకు వాడాలి?

చల్లపల్లి స్వచ్చోద్యమంలో మరొక విజయవంతమైన రోజు @2369*

          4.3.22 - శుక్రవారం వేకువ కూడ తొలి స్వచ్చ వీరులు 14 మందికి మరీ 4.16 కే పని వేళ! మరో 16 మంది కాస్త వెనకా ముందుగా – ఈ 30 మందికీ 6.50 దాక - సుమారు 2 ½  గంటలు పని కల్పించింది పెదకళ్లేపల్లి దారిలోని గోడౌన్ల - దాణా ఉత్పత్తి కేంద్రాలే!

          కృతజ్ఞత ప్రకటించాల్సే వస్తే - ఎవరు ఎవరికి? 30 – 40 మందికి 10 రోజులుగా - ఐదారు వందల గంటలుగా చేతి నిండా పని కల్పిస్తున్న ఇక్కడి నివాసులు, వ్యాపారులు, పారిశ్రామికులకా - లేక ఇన్ని కశ్మల దారిద్రాల నుండి ఈ రహదారిని, డైన్లను, పరిసరాలను – మొత్తంగా గ్రామాన్నీ విముక్తి చేస్తున్న స్వచ్చ సైనికులకా?

          డాక్టర్లై ఉండి, ముసలోళ్లై ఉండి, ఇంట్లో - వంటింట్లో పడి ఉండవలసిన గృహిణులై ఉండి, ప్రస్తుత & మాజీ ఉద్యోగులై ఉండి ఇలాంటి మురికి - చెత్త పనుల్ని 2369* రోజులుగా, విసుగూ విరామం లేకుండ - చలీ, మంచూ, ఎండా, వానల్లో కూడ వేకువ సమయాల్లో చేస్తున్న వ్యక్తుల్ని ప్రశంసించి, అనుకూలించి, అనుసరించాలో, లేక “చీపుళ్లతో రోడ్లు ఊడవడం, ప్రసార మధ్యమాల్లో ప్రచారం చేసుకోవడం కూడ గొప్పే ఐతే - ఎవరు మాత్రం ఈ పని చేయలేరు?” అని తృణీకరించాలో  తేల్చుకోవలసింది గ్రామస్తులే.

          స్వచ్ఛంద శ్రమదాతలు మాత్రం తమ వేకువ కారక్రమం నుండి తగ్గేదేలేదని 8 ఏళ్లుగా ఋజువు చేస్తూనే ఉన్నారు! స్వచ్చ సంస్కృతి ఒంట బట్టి వదలనందున ఈ శ్రమదాతలిక వెనకడుగేయాలన్నా - మిగిలిన ప్రజల్లాగా సామాజిక చైతన్య రహితంగా ఉండిపోవాలన్నా ఇక సాధ్యం కాదు కూడ!

          ఆ కారణం గానే కదా - బ్రహ్మ ముహుర్తం కన్న ముందే ఆవురావురు మంటూ వాళ్లు 2-3-4 కిలో మీటర్లు ప్రయాణించి, నిర్దేశిత కాలుష్య కేంద్రాల్ని ఏళ్ల తరబడీ స్వచ్చ - శుభ్ర – సుందరీకరించేది?

        - నిన్న ఇక్కడ నినాదాలు వినిపించి, ఏ వెయ్యి కిలోమీటర్లో – 20 గంటల పాటు ప్రయాణించిన 84 ఏళ్ల వ్యక్తి – అక్కడి నుండే స్వచ్ఛశుభోదయంతో కార్యకర్తల్ని పలకరించడం;

          - సాయి ఆక్వామిల్లు ప్రక్కన మిట్ట పల్లాలను, వంకరగా పడి ఉన్న తూమును సుందరీకర్తలు గంటన్నర శ్రమించి తీర్చిదిద్దడం; (ఇంతా శ్రమించాక – ఆ జాగా కాస్తా ఏకబ్జాలకు గురౌతుందోనని వాళ్ల సంశయం!')

- గ్యాస్ గోడౌన్ల దగ్గరి డ్రైనును 15 20 మంది శ్రమించి చూడముచ్చటగా మార్చడం,

- ఊడ్చే వాళ్లు ఊడ్వడం, ఖాళీ మద్యం సీసాల్ని ఏరే వాళ్ళు దీక్షగా పనిచేయడం;

- ఈ తుక్కుల్ని, కొమ్మల్ని ప్లాస్టిక్ చండాలాన్ని ఐదారుగురు ట్రక్కుల్లో నింపు కొని, డంపింగ్ కేంద్రానికి చేర్చడం -

- ఇవన్నీ ఏ క్రొత్త - అర్థవంతమైన పని సంస్కృతికి సూచనలు? భావితరాల సౌకర్య కల్పనా ప్రయత్నాలు?

          డాక్టర్‌ డి.ఆర్.కె. గారు ఆనంద తన్మయత్వంతో సమీక్షించిన – శివరాత్రి సందర్భాన యార్లగడ్డ తిరునాళ్ల ప్రత్యేకతను తూము వారు వివరించిన – ప్రాత సుభాషితాన్ని గురవయ్య గారు వినిపించిన -  రామానగరం రాజు గారు విస్పష్టంగా ముమ్మారు గ్రామ స్వచ్ఛ సంకల్ప నినాదాలు వినిపించిన - 12 నిముషాల ప్రత్యేక సమావేశం ముగిసి,7.00 కో కార్యకర్తలు ఇళ్ళు చేరి ఉంటారు.

          శనివారం వేకువ మన పునర్దర్శన స్థలం కూడ పెదకళ్లేపల్లి రహదారిలోని వివేకానంద డిగ్రీ కాలేజి దగ్గరే!

 

          ఒకే చోట – ఒకే నాట...

అటువైపున విజృంభించు స్వచ్ఛ శుభ్ర ఉద్యమాలు

ఈ గట్టున కాలుష్యం వెదజల్లే ఈ జనాలు

కాలగర్భ మందు కలవు కడు విచిత్ర పోకడలు

ఒకేనాట - ఒకే ఊర ఉన్న భిన్న మగు దారులు!

 

- నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

04.03.2022.