2370*వ రోజు....           05-Mar-2022

ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా ఎందుకు వాడాలి?

గ్రామ స్వచ్చోద్యమంలో ఇది 2370* వ రోజు.

          శనివారం సైతం వేకువ చీకట్లో - వాతావరణం కొంత మారి, చలి పెరిగిన సందర్భంలో - 5-3-22 వ నాడు శివరామపురం రోడ్డులో విజయా/ వివేకానంద కళాశాలల సమీపంలో - 4.16 నుండి 6.24 దాక అన్ని రకాల వీధి మెరుగుదల కోసం శ్రమించిన వారు పాతిక మంది!

          కొద్ది రోజుల ముందు ఈ రోడ్డుకు అదృష్టం పట్టి, గుంటలు తగ్గి కొంత బాగుపడిన మాట నిజమే గాని - ఈ 100 - 110 గజాల రహదారిలో - ఇన్ని కళాశాలల -  కళ్యాణ మండపాల - దుకాణ సముదాయాల - నివాస గృహాల - బడ్డీ కొట్ల - ప్రదేశంలో కొంత రోజు వారీ కాలుష్యం పుట్టుకోచ్చే మాట నిజమే గాని మరీ ఇంత భీభత్సమా? 100 గజాల్లోనే కార్యకర్తలు 50 గంటలు శ్రమించవలసినంతగా, పెద్ద ట్రక్కు నిండిపోయేంతగా, కొసరుగా రెండు పెద్ద సంచుల ప్లాస్టిక్ వస్తువులూ, 11 డిప్పల మద్యం గాజు సీసాలూ పొగుబడడమా?

          స్వచ్ఛ కార్యకర్తల తెగువ సంగతికేం గాని వాళ్లెలాగూ మురుగ్గుంటల, రోడ్లు గుంటల రహదార్ల అందాన్ని దెబ్బతీసే ఖాళీ స్తలాల బాగు చేతకూ, పచ్చదానాల - పూల సొగసుల స్వచ్ఛ శుభ్రతల కల్పనలకూ ఎన్నడో అంకితమైపోయారనుకోండి! మరి వివిధ సంస్థల యాజమాన్యాల, వ్యాపారుల, స్థానిక గృహస్తుల, విద్యార్థుల బాధ్యత సంగతేమి? సామాజిక స్పృహ స్థాయి ఏమి?

          గ్రామ జనాభాలో 1 శాతంలో సగం కూడ లేని ఈ స్వచ్ఛ సైనికులు దశాబ్దాల తరబడీ గ్రామ సౌకర్యాల కోసం పాటుబడుతూనే ఉండాలా? తద్భిన్నంగా హక్కులు తప్ప ఏ బాధ్యతా పట్టని కొందరు గ్రామస్తుల వైఖరి కొనసాగుతూనే పోవాలా? కార్యకర్తలు గనుక తమ రోజు వారీ శ్రమదానంలో సరైన పరమార్థాన్నీ, సంతృప్తినీ పొందకపోతే - అయిష్టంగానూ, నటనగానూ తమ శ్రమదానాన్ని నిర్వహిస్తుంటే ఇన్ని వేల రోజులు కాదు, ఒక నెల రోజులైనా చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమం నిలబడేదే కాదు!

నేటి ఉదయం సైతం పాతిక మంది కార్యకర్తల తడాఖాతో:

- సుమారు 30 గజాల మురుగు కాల్వ బాగుపడింది;

- ఆ కాల్వగట్ల ఎండు బురద మట్టి రోడ్డు అంచుల గుంటల్లోకి చేరి బాట మరి కొంత సౌకర్యవంతమయింది;

- 10 మంది శ్రమత్యాగంతో రోడ్డుకు తూర్పు ఖాళీ స్తలం కొంతమేర రకరకాల దరిద్రాలను కోల్పోయి, కాస్త శుభ్ర - సుందరంగా కనిపిస్తున్నది,

- కనీసం రేపటికైనా - 12 రోజుల శ్రమతోనైనా బండ్రీవుకోడు వంతెన దాక 1 ½ కిలోమీటర్ల రోడ్డు తీరుగా - మెరుగ్గా రూపొందుతుందని నమ్మకమొచ్చింది;

- ఐతే, వేకువ శ్రమదానంలో స్థానికులు తగినంతగా భాగస్వాములౌతారనే భరోసానే ఇంకా రావలసి ఉంది!

          6.40 కాఫీల వేళ పశువైద్యులు గోపాలకృష్ణుల వారి 2000/- విరాళం ట్రస్టుకు అందింది. దానికి ముందు గంధం వారి - దాసరి వారి గ్రామ స్వచ్ఛ శుభ్ర సౌందర్య ప్రతిపాదక నినాదాలు ముమ్మారు విన్పించాయి.

          రేపటి వేకువ శ్రమదాన ప్రయత్నం కూడ మనం ఇదే పెదకళ్లేపల్లి రహదారిలోని వివేకానంద డిగ్రీ కాలేజి దగ్గర కలిసి చేయవలెనని నిశ్చయించబడింది!

     సమర్పిస్తున్నాం ప్రణామం 70

రెండు వేలదినాలె ఏమిటి! ముప్పై ఏళ్లకు పైగా

ప్రజా సైన్సు ప్రగతి కొరకు - వైజ్ఞానిక సుగతి కొరకు

స్వచ్చోద్యమ నిరతి కొరకు - సాహసించి గెలుపొందిన

మార్గదర్శకుల కిదిగో మనః పూర్వక ప్రణామం!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   05.03.2022.

 

డా. మాలెంపాటి గోపాలకృష్ణ గారి విరాళం