2371*వ రోజు.......           06-Mar-2022

ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా ఎందుకు వాడాలి?

2371* వ నాటి గ్రామ సామాజిక బాధ్యతా పరిపూర్తి.

            ఈ వేకువ గ్రామ ముఖ్య రహదారి పారిశుద్ధ్య కృషి 31 మందిది. 2 గంటలకు పైగాను, మొత్తం మీద 55 - 60 పని గంటలు గాను - ఒక నిబద్ధతగాను, ఏ హైదరాబాదీయులో ఐతే నమ్మజాలని వాస్తవంగాను కొనసాగిన శ్రమదానం వల్ల

1) వివేకానంద కాలిజ్,

2) విజయ కళాశాల,

3) కల్యాణ మండపం రోడ్డు సమీపాన,

4) మాంస విక్రయశాల దగ్గర చెప్పుకోదగినంత వీధి శుభ్రత సాధ్యపడింది.

            బైట సమాజంలో ఐతే కుల/ మత/ ప్రాంత విభేదాలుంటాయి గాని, చల్లపల్లి స్వచ్చోద్యమానిది ఒకే కులం - అది గ్రామ ఉమ్మడి శ్రేయో నిబద్ధం! ఈ 30 మందికీ అన్న - అక్క - బావ - తమ్ముడు  - బాబాయ్...వంటి ఐడెంటిటీలే ఎక్కువగా ఉంటాయి తప్ప, “ఊరు - వార్డు అంతస్తు - సామాజిక వర్గ...గుర్తింపులుండవు. గ్రామ సౌఖ్య - స్వస్తతా లక్ష్యాలు తప్ప వైయక్తిక స్వార్థచింతనల కంపు, రాజకీయ కశ్మలాలు, అహంకార ప్రకోపాలు కనిపించవు! నిజానికి ఏడెనిమిదేళ్లుగా ఇదొక భిన్న ప్రపంచం!

            మొత్తం చల్లపల్లి గ్రామమూ, నియోజక వర్గమూ, రాష్ట్రమూ కూడ ఇలా శాశ్వత ప్రాతిపదికన మారిపోతే రాష్ట్రంలో, దేశంలో ప్రతిరోజూ ఇలా అందరి శ్రమదానమూ చోటు చేసుకొంటే - ఫిన్లాండ్, న్యూజిలాండ్, స్వీడన్లలాగా మనరాష్ట్రం, దేశం మారిపోతే.... ఆహా! ఇదొక సుమధుర స్వప్నం! (కలలు కనండహో! అబ్దుల్ కలాం గారు చెప్పారు మరి!)

            ఏడెనిమిదేళ్ళుగా చల్లపల్లి కార్యకర్తలు కలలు కనడమే గాదు ఆ కలల సాక్షాత్కారం కోసం శక్తీ కొద్దీ పాటుబడుతూనే ఉన్నారు! ఈ జాడ్యం 30 - 40 ఊళ్లకు ఇప్పటికే అంటించారు కూడ! అట్టి కలల సంపన్నులైన 30 మంది కళ్ళేపల్లి రోడ్డులో చేసిన ఈ నాటి నిర్వాక మేమనగా :       

- ఒక జూనియర్ కళాశాల ఎదుట వచ్చే, పోయే వారు ఆగి చూసేంతగా శుభ్రపరిచారు (కళ్ళాపి మాత్రం చల్లలేదు!) 

- కళ్యాణ మండపం దారి ప్రక్క భారీ వాహనాల భారానికి పడిన లోతైన గుంటల్లోని ప్లాస్టిక్ సంచులు, ఇతర తుక్కు తొలగించారు తాతా, మనవళ్ళు ఈ పని లో నిమగ్నమైన ఒక ఛాయా చిత్రాన్ని గమనించండి!

- ఒక పెద్ద నివేశన స్తలం ప్రక్క డ్రైనునూ, గట్లను శుద్ధి చేయడానికే 12 మంది కార్యకర్తల శ్రమ ఖర్చైపోయింది.

- చీపుళ్ళతో 100 గజాల రోడ్డును ఊడ్చే పని, రెండు రకాల మద్యం సీసాల్ని, కప్పుల్ని పోగేసే పని, యదావిధిగా జరిగిపోయాయి!

- చెత్త లోడింగు, డైన్ల తుక్కు తొలగింపూ - అన్నీ అనుకొన్నట్లే నెరవేరాయి!

            ఆదివారం వస్తే ఆలస్యంగా నిద్రలేవడం చాల మంది చేసే పని. స్వచ్చ కార్యకర్తల సంస్కృతే వేరు కదా - ఆరోజు మరింత మంది, మరికాస్త ఎక్కువ శ్రమదానం చేయడం వాళ్ల అలవాటు!

            కాఫీలకదనంగా శాస్త్రి గారి పనే కాబోలు - చిరు తిండి కూడ సమకూరింది. ఫిబ్రవరి మాసపు స్వచ్చ కార్యక్రమ ఆయ వ్యయాల పట్టిక కూడా సమర్పించబడింది! ఈ వీధికి చెందిన కార్యకర్త - గోళ్ల వేంకటరత్నం ప్రవచిత గ్రామ త్రివిధ నినాదాలు విస్పష్టంగా ఉన్నాయి.

            బుధవారం వేకువ శ్రమించదగిన ప్రదేశం కూడ ఈ పెదకళ్ళేపల్లి  మార్గమే! అందుకు మనం కలుసుకోదగిన చోటు బండ్రేవు కోడు కాల్వ దగ్గరి చంద్ర హాస్పిటలే!

 

            సమర్పిస్తున్నాం ప్రణామం – 72

 

నాలుగున్నర వేకువందున సాధ్యమా శ్రమదాన ఉద్ధృతి?

రెండువేల నాల్గు వందల దీర్ఘకాలం సేవలెట్లని.....

లోకులెల్ల అవాక్కులయ్యే శ్రీకరంబగు సంప్రదాయం

పాదుకొల్పిన స్వచ్చ - సుందరపాదులకె నా తొలి ప్రణామం!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   06.03.2022.