2372*వ రోజు..........           07-Mar-2022

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా ఎందుకు వాడాలి?

7-3-22 వ తేదీ నాటి శ్రమదానం @2372*

        గత 2-3 నెలలుగా సోమ - మంగళవారాల వేకువ శ్రమదానం రెస్క్యూ టీం పరమైపోయింది. ఆ రెండు రోజులకూ వాళ్ల అన్వేషణలు, అంచనాలు, ప్రణాళికలు, సంసిద్ధతలు కాస్త భిన్నంగా ఉంటాయి. వెనకటికొక ముఖ్యమంత్రి వారంలో ఒక రోజైన సోమవారాన్ని ఒక పెద్ద ప్రాజెక్టు పేర కేటాయించి పోలవారంఅని మార్చినట్లు!

        ఈ వేకువ సైతం పంచ పాండవ రెస్క్యూదళమూ, వాళ్ల మద్దతుదారులు ముగ్గురూ గంగులవారిపాలెం దారిలో - బండ్రేవు కోడు మురుగు కాల్వ ఉత్తరపు గట్టు తారు రోడ్డుకు ఇంకొన్ని మరామతులు చేస్తూ కనిపించారు. చాల వరకు ఈ బాట భద్రతకు భారీ వాహనాల రాకపోకలకు హామీ దొరికినట్లే!

        కాలువ గట్టు పొడవునా 3 - 4 అడుగుల మేర రోడ్డు విశాలం కావడంతో పాటు కొన్ని చోట్ల తాడిదూలాలు అడ్డం పెట్టి, దానికి పెగ్గులు (మేకులు) అడ్డంగా దిగగొట్టి, మట్టితో మెరక చేసి - 15 పని దినాలకు పైగా గ్రామ భద్రతాదళం కృషి ఫలించింది. ఈ వేకువ కూడ దూరంగా పడి ఉన్న 15 అడుగుల భారీ తాటి మొద్దును అలా ఉపయోగించారు.

        ఇదొకటే కాదు - ఊర్లో ఏ ప్రముఖ వీధిలో గుంటలు పడ్డా, ఆక్రమణలు జరుగుతున్నా, వీధి భద్రతకు మన్నికకు, పచ్చదనానికి ఏ కాస్త లోపం జరిగినా ఈ కార్యకర్తల స్పందన ఇలాగే ఉంటుంది.

        ఏడెనిమిదేళ్లుగా - వేకువ 3 ½ కే లేచి, 6:30 దాక ఊరి స్వచ్చ శుభ్ర సౌందర్యాల కోసం ఆరాటపడడం ఎందుకో గ్రామస్తుల్లో కొందరిప్పటికీ అలోచించకపోవడమే ఒక వింత!

        ఈ రోజున బందరు జాతీయ రహదారిలో మూల్పూరి ఉద్యానం దగ్గర క్రుంగిపోయిన రంగు రాళ్లను పీకి, ఇసుక బుసకలు నింపి, సరిజేసే బాధ్యత కూడ రెస్క్యూ టీం నెరవేర్చింది.

 

        సమర్పిస్తున్నాం ప్రణామం 73

ఆద మరచిన గ్రామ జనులకు - అయోమయ ఆలోచనలకూ

ప్రభుత్వాలకు బుద్ధి జీవికి ప్రబోధంగా - ప్రయోగంగా 

రెండు లక్షల గంటలుగ ఒక స్వచ్చ యజ్ఞం నిర్వహించిన

కదం త్రొక్కిన స్వచ్చ - సుందర కార్యకర్తల కిదె ప్రణామం!       

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   07.03.2022.