2373*వ రోజు....           08-Mar-2022

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా ఎందుకు వాడాలి?-

కొనసాగిన రెస్క్యూ టీం రోడ్డు భద్రతా సేవలు - @2373*

        మంగళవారం (8-3-22) వేకువ కూడ గ్రామ రక్షక దళానిది అదే సమయపాలన - అదే క్రమశిక్షణ - ఊరిజనుల సౌకర్య కల్పన పట్ల అదే మన్నన! వాళ్ళున్నది ఏడెనిమిది మందే -  ప్రతి వారంలో గ్రామ వీధుల్లో ఏదో ఒక చోట గుంట పడుతూనే ఉంటుంది; ఏదో ఒక ప్రధాన వీధిలో అసౌకర్యకారకమైన ఆక్రమణ జరగనే జరుగుతుంది; ఎక్కడ ఏ చెట్టు కొమ్మో దాని హద్దు మీరి రోడ్డునాక్రమిస్తుంది...

        ఐతే? మరి అవన్నీ వీళ్ళ దృష్టిలోనే పడాలా? వాటి పరిష్కారానికి స్వచ్చ కార్యకర్తలే పూనుకోవాలా? అందునిమిత్తం 3.30 కే లేచి, 4.30 కు ముందే పనిముట్లతో 6.30 దాక కష్టించి, అయా చిక్కుముడుల్ని విప్పాలా? అటు ప్రక్కెమో స్వార్ధపూరితంగా – తెలివిగా ఊరికి రకరకాల ఇబ్బందుల్ని సృష్టిస్తున్న కొందరు! ఇటు ప్రక్క అల్పసంఖ్యాకులైనా సరే వెనకాడక – తమ డబ్బునీ, కాలాన్ని శక్తియుక్తుల్నీ 2373* నాళ్లుగా వెచ్చిస్తున్న స్వచ్చ సైనికులు! ఇంకా ఎన్నాళ్లు ఈమోహరింపులు! ఈ అరాచక చర్యల హుంకరింపులు?

        ఎక్కడో పాత కస్తూర్బాయి అస్పత్రి ప్రక్కన ఎవరో రోడ్డు మీద వదలిన రద్దు గుట్ట! వేకువ చలిలోనే పారల్తో - డిప్పల్లో దాన్ని ట్రక్కులోకి ఎక్కిస్తున్న రెస్క్యూదళం! పనిలో పనిగా ఒక స్వచ్చ గృహిణి - పలనాటి అన్నపూర్ణకు వీళ్ళ ద్వారా మహిళా దినోత్సవ మన్నన! (మామూలు స్వచ్చోద్యమ దిన చర్య కాక రెస్క్యూ టీం పనుల్లో కూడ తగుదునమ్మా అని ఈమె వేలూ – కాలూ పెట్టుతుంటుంది)

        ఆ మట్టిలోడును 1 ½ కిలో మీటరు దూరాన – బండ్రేవుడు కోడు మురుగు కాల్వగట్టు రోడ్డు భద్రతకై ఈ ఆరేడుగురు తీసుకెళ్ళి, సర్ది, కొన్ని గజాల రోడ్డు కోత పడకుండా రక్షించగలిగినందుకు సంతసిస్తున్న వైనాలను శంకర శాస్త్రి గారి సామాజిక మాధ్యమ  చిత్రాల్లో గమనించండి! (ఎందుకంటే – కళ్లెదుటి వాస్తవాల్ని కూడా “గ్రాఫిక్స్” అని కొట్టిపడేసే విచిత్ర పోకడల సమాజంలో ఉన్నాం మరి!)

        6.30 తరువాతనే గౌరిశెట్టి గారి నినాదాల పిదప మాత్రమే - ఈనాటి - ఈ వారపు భద్రతా కృషి ముగిసింది.

 

       సమర్పిస్తున్నాం ప్రణామం 74

చారిత్రక సత్యాలను - సామాజిక ధోరణులను

నేటి గ్రామ అవసరాలు - ప్రజా స్వస్తతా చర్చను

సమీక్షించి, నిదానించి సత్కార్యాచరణకు దిగు

స్వచ్చోద్యమ కారులకే జయ మంగళ ప్రణామాలు!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   08.03.2022.