2374*వ రోజు....           09-Mar-2022

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా ఎందుకు వాడాలి?

అవలీలగా 2374* రోజులకు స్వచ్ఛ కార్యకర్తల శ్రమదానం.

        బుధవారం మార్చి నెల 9వ దివసం! మళ్లీ వేకువ 4.13 కే డజను మంది కార్యకర్తల వీధి పారిశుద్ధ్య పనులు మొదలు! క్రమంగా మరో 17 మంది - వెరసి 29 మంది క్రమబద్ధ ప్రయత్నంలో –

1) బండ్రేవుకోడు మురుగు కాల్వ దక్షిణపు గట్టు

2) చంద్ర హాస్పిటల్‌ పరిసరాలు

3) వంతెన వగైరాల దుమ్ము వదలి, తుక్కు తొలగి, నీచ నికృష్ట ప్లాస్టిక్ సారా సీసాల బెడదపోయి, మరొక 100 గజాల వీధి స్వచ్చ - సుందరంగా మారింది.

        అదేంటో గాని - ఈ పెద్ద డాక్టర్లకు, విశ్రాంత ఉద్యోగులకు, గృహిణులకు, రైతులకు తమ పేర్ల ప్రక్క డిగ్రీల హోదాల ఐడింటిటీలకన్న స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తఅనే హోదా తగిలించుకోవడమే ఇష్టం! చరిత్రకు, సంప్రదాయాలకు భిన్నంగా ఇలాంటి అభీష్టాలు ఏ ఊళ్ళోనైనా చూశామా? తదేక నిబద్ధతగా, వ్యసనంగా, అనన్య సామాన్యంగా 2374* రోజులుగా తమ గ్రామ స్వస్తతా సంక్షేమం కోసం శ్రమించడం విన్నామా?

        ఏ దేశం - ఏ ఊరు - ఏ ఇంట్లో నైనా భిన్న దృక్పథాలుంటాయి గాని, ఈ ఒక్క ప్రత్యేకత మాత్రం చల్లపల్లికే సొంతం! వాన - వరదలొస్తే, ఎండలు తుక్కు లేపితే, మంచులు ముంచితే, కరోనా గడగడలాడిస్తే కూడ వెనకడుగేయని అచంచల - ఆవశ్యక, ఆదర్శ శ్రమదానానికి అభివందనలు! ఈ శ్రమదానం వెలుగులో

1) స్వచ్చ - పరిశుభ్ర - స్వస్త -  సుందర చల్లపల్లే కావాలో

2) వీధి ఆక్రమణల - ప్లాస్టిక్ తుక్కుల - అస్తవ్యస్త - కంపుల చల్లపల్లే మంచిదో తేల్చుకోవలసింది మాత్రం 26 - 27 వేల మంది గ్రామస్తులే!

        నేటి శ్రమత్యాగంతో 2 గంటలకు పైగా వీధి కశ్మలాల మీద కార్యకర్తల పోరు వల్ల వచ్చిన ఫలితం స్థూలంగా:

- నూనె మర ఉత్తరంగా, వంతెన దగ్గరగా - కాళ్లు జారిపోతున్న ఏటవాలులో 12 మంది కత్తులు, దంతెలతో మొండి పిచ్చి - ముళ్ల - చెట్లనూ, తీగల్ని నరికి, లాగి, పోగుల్ని ట్రాక్టర్ లోకి ఎక్కించడం (ఇదేమీ తొలి మారు కాదు - ఏడో, ఎనిమిదో పర్యాయం!);

- బెత్తెడు మందాన మురుగు కాల్వ వంతెన మీద పేరుకొన్న దుమ్ము - ధూళి, ప్లాస్టిక్ తుక్కులు, పేడల్ని ఐదారుగురు శుభ్రపరచడం (ఇంత నికృష్టపు కాలుష్యం మధ్యనే కొందరు వంతెన గోడల మీద సాయంత్రాలు ఎలా కూర్చొంటారో!)

- రోడ్డుకు పడమర ఖాళీ భాగాన్ని మరికొందరు మెరుగు పరచడం - 2 డిప్పల ఖాళీ గాజు సీసాలు, గోనె సంచెడు ప్లాస్టిక్ బుడ్లు, కప్పులు, గ్లాసులు, ప్లేటులు - వాటిని వంగి ఏరిన ఇద్దరు ముదుసలులు!

- ఇక్కడికి దూరంగా - మాంసం అంగడి ఎదురుగా రోడ్డు మార్జిన్ గుంటల్ని ముగ్గురు సుందరీకర్తలు సమపరచి, చెమటలు చిందించడం;

        ఇలా వివరిస్తూ పోతే ఇది అనంతం!

6.40 వేళ జరిగిన 3 విశేషాలు:

1) గూడునొప్పెడుతున్నా సరే - ఊరి ఉషోదయ బాధ్యతలు వదలని - నినాదాలకంతగా ఇష్టపడని పసుపులేటి సత్యం ప్రకటించిన త్రివిధ స్వచ్చ - శుభ్ర - సౌందర్య నినాదాలు;

2) కోడూరు వేంకటేశ్వరుని నెలవారీ 520/-  విరాళం,

3) ఈ సాయత్రం 6 గం.లకు గంగులవారిపాలెం బాటలోని గస్తీ గది” అనబడే చుట్టు గూడు ప్రారంభానికి ఆహ్వానం.

        రేపటి శ్రమదాన బాధ్యత కోసం మనం కలువదగిన చోటు బస్టాండు దగ్గరి మురుగు కాల్వ వంతెనే!

 

        సమర్పిస్తున్నాం ప్రణామం 75

 

ఇదేం లోకమొ! యుగయుగాలుగ చెడుకు మంచికి నిత్య ఘర్షణ

మంచి ముసుగున చెడే నడచుట! వంచనల సయ్యాట లిచ్చట!

కశ్మలాల నధఃకరిస్తూ - కల్మషాలను తరిమి కొడుతూ

మీరు సాగిస్తున్న క్రతువుకు మేము చేస్తున్నాం ప్రణామం!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   09.03.2022.