2380*వ రోజు.......           15-Mar-2022

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడతగునా?

గ్రామ రక్షక దళం కొనసాగించిన రోడ్డు భద్రత/ సుందరీకరణ చర్యలు @2380*

        4.24 కే గ్రామం నడిబొడ్డున శ్రమదాన ఉద్యుక్తులైన ఐదుగురు, తదుపరి వచ్చి కలిసిన ముగ్గురు - మొత్తం ఈ అష్ట సంఖ్యాకుల - 3 విధాల ప్రయత్నంలో - చల్లపల్లిలో కనీసం 3 చోట్ల ఊరి దుస్థితి తొలగింది! బ్రహ్మముహూర్త వేళ కనుక వీధుల్లో రద్దీ కాస్త తక్కువగా ఉండి, స్వచ్ఛ కార్యకర్తల యథేచ్చా వీర విహారం సులువయింది!

        నేటి 2 గంటల 14 నిముషాల తమ ప్రయత్నంలో ఈ కొద్ది మంది తెగబడి సాధించినవేమనగా:

- 3 రోడ్ల కూడలి నుండి అవనిగడ్డ బాటలో పోతురాజు గుడి దాక మరొకమారు చకచకా కాగితాల, ప్లాస్టిక్ సంచుల అశుభ్రతను తొలగించుకుంటూ పోవడం;

- ఈ నడుమ వందలాది దుకాణాలు, టీ - టిఫిన్ షాపులు, ఉంటే నిత్యం తమ వాపారాల్లో మునకలేయడానికే సమయం చాలదు వాళ్ళకు! చినిగి, అసహ్యంగా వేళాడే ప్రకటనల కాగితాలైనా వినియోగ దార్ల దృష్టిలో పడవు!

- పోతురాజు గుడి ఎదుట నిన్న పూడ్చిన వీధి గుంటలు ద్విచక్రవాహనాలకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా తాము సేకరించిన మట్టిని మళ్లీ సర్దిన కార్యకర్తలకొక సంతృప్తి!

- పెదకళ్లేపల్లి బాటలో సగం ఎండిన కొమ్మలు పడి ఉంటే వాటిని ట్రాక్టర్ట్ లో నింపుకొని, చెత్త కేంద్రానికి చేర్చిన పని కూడ వీళ్లదే!

 

గ్రామ సహృదయులకూ, స్వచ్చోద్యమ సానుభూతి పరులకూ మళ్ళీ విన్నపమేమంటే – “ఇది మన ఊరు, దీని స్వచ్చ శుభ్ర సౌందర్యాలు, బాగోగులు, భవిష్యత్తులు మనవే! ఇక్కడ 8 ఏళ్ళుగా అవిచ్చిన్నంగా జరుగుతున్నదేమో ఒక అరుదైన - విశిష్ట - నిర్దిష్ట - నిర్దుష్ట ఆదర్శ శ్రమదానం! మంచి సమయం మించిపోతున్నది మిత్రులారా! త్వరగా వచ్చి, పాల్గొని ఎవరి వంతు కర్తవ్యాన్ని వాళ్లు పూరించండి....

        6.40 కి నేటి గ్రామ స్వచ్చోద్యమ లక్ష్యాలను నినాదాలుగా చెప్పిన వారు గంధం బృందావన్.

        రేపటి మన శ్రమదాన అవకాశం -  అదృష్టం శివరామపురం దగ్గరలోని 7 వ నంబరు కాలువ వంతెన దగ్గర నుండే.

 

        సమర్పిస్తున్నాం ప్రణామం – 80

వీధి గోడల నందగిస్తూ - ఊరి శోభలు పెంచివేస్తూ

సహృదయతలను స్వాగతిస్తూ - సమంజసతలను వృద్ధిచేస్తూ

ప్రజలలో పెను మార్పు కోసం బృహత్ ప్రయత్నంలోన మునిగిన

చల్లపల్లి స్వచ్చ - సుందర సాహసికులారా! ప్రణామం!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   15.03.2022.