2381*వ రోజు....           16-Mar-2022

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడతగునా?

అలుపెరగని స్వచ్చోద్యమ ప్రస్థానం - @2381*

          ఇదొక మంచు క్రమ్మిన (బుధవారం - 16/3/22) వేకువ! 9వ నంబరు పంట కాలువ! - శివరామపురం సమీపించే చోటు! అక్కడ 4.20am కే ఫొటోలో అస్పష్టంగా కనిపిస్తున్న 13 మంది కారకర్తలు! వాళ్ల దగర్లోనే కత్తీ కటార్ల వంటి ఆయుధాలతో ఒక ట్రాక్టరు! చూస్తుండగానే 3 కి.మీ దూరం నుండి వచ్చి చేరిన 10 -12 మంది మిగతా స్వచ్ఛ సైనికులు! 150 గజాల రహదారి నేటి యుద్ధరంగం!

          ఈ పరోపకార ధురీణుల యుద్ధం ఎవరి మీదో కాదు - ప్రకృతిని ధిక్కరిస్తున్న, వాతావరణ సమతౌల్యాన్ని అధఃకరిస్తున్న చెత్త దుమ్ము - ప్లాస్టిక్ వంటి వ్యర్ధాల మీదనే! 2381* నాళ్లుగా ఈ యోధులు క్రియాపూర్వకంగా గ్రామ పౌరులకు పదేపదే గుర్తుచేస్తున్నది ఈ సామాజిక బాధ్యతనే! పైగా ఇదేమీ అపూర్వం కూడ కాదు గౌతమబుద్దుళ్లు, జీసస్ క్రైస్త్ లు, రామానుజాచార్యుళ్లు, గాంధీ మహాత్ముళ్లు, బుద్ధగయజిల్లాకు చెందిన దశరధ మాంఝీలు చేసి వదిలిన సమరమే!

          80 – 90 - 100 ఏళ్ల క్రిందటి విదేశీ శత్రువు మీద రాజకీయ విముక్తి కోసం 2 - 3 తరాల దేశభక్తులు ఇలాగే అలుపు లేని సమరం చేశారు. మరి, ఇప్పుడేమో కనిపించని శత్రువులు! రాజకీయ, సామాజిక, పర్యావరణ కాలుష్యాలే ఇప్పుడు బోర విరుచుకు తిరుగుతున్న విలన్లు! తమ శక్తివంచన లేకుండా చల్లపల్లి స్వచ్ఛ సైనికులు ఎనిమిదేళ్ల సుదీర్ఘ కాలంగా సంఘర్షిస్తున్నది తమ వీధి కాలుష్యాలపైనే! లక్ష్యించింది పాతిక - ముప్పైవేల ప్రజల శాంతి సౌమనస్యాలనే!

          మంచు గట్టిగా విజృంభిస్తున్న ఈ వేకువలో – 2 గంటల పాటు చలపల్లికి 3 కి.మీ. దూరంగా రహదారి ఆహ్లాదకర సౌకర్యాల కోసం శ్రమించిన ప్రతి కార్యకర్త ఉభయ గ్రామాల ప్రజల అభివందనలకు పాత్రుడే! వాళ్ల నిష్కామ కర్మ ఎప్పటికీ ఆదర్శమే! రాష్ట్రంలోని 13 వేల గ్రామాల వారికీ తక్షణ అనుసరణీయమే!

- నలుగురైదుగురేమో మినుం పొలం అంచుల మీది, రహదార్ల మీది చెత్తను, కొబ్బరి బొండాల వ్యర్ధాల్నీ, ప్లాస్టిక్ తుక్కుల్నీ, తదితరాల్ని లాగి, ఏరి గుట్టలు చేస్తే

- ముగ్గురు గృహిణీమతల్లులేమో తదేక దీక్షగా రహదారిని ఊడిస్తే

- కత్తి వీరుల ధాటికి తాటి, ముళ్ళ మొక్కల తలలు తెగిపడుతుంటే

- దంతెల వాళ్ళు బళ్ల కొద్దీ వ్యర్ధాల్ని రోడ్డు పొడుగునా గుట్టలు పేరుస్తుంటే

- పదును తగ్గిన కత్తుల్ని నూరే వాళ్లు, మధ్యలో కొన్ని పూల చెట్లను సుందరీకరించే వాళ్లు, అరుదైన ఈ శ్రామిక ఘట్టాల్ని కెమెరాలో బంధించేవాళ్ళు, వీటిని చేస్తూ - చూస్తూ పరవశించే ఒక స్వచ్ఛ వైద్యుడు... ఇవే నేటి శ్రమ జీవన వినోదాలు!

నా దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించినవి మాత్రం రెండు విషయాలు:

మొదటిది పని ముగింపు వేళ ఒక భారీ ఆజానుబాహుడి భుజం మీద భీముడి గద లాంటి గొర్రూ, రెండోది ఒక బలిష్టుడి రెండు చేతుల్లో రెండు కత్తులూ!

          6.45 వేళ సజ్జా ప్రసాదు నామ ధేయుని గ్రామ మెరుగుదల ప్రతిజ్ఞల తర్వాత చీరాల దగ్గరి గొనసపూడి గ్రామస్తుని - విక్రమ్ నారాయణుడి అనుకోని ఆశ్చర్యకర విరాళం – 1,55,555/-  డాక్టరు డి.ఆర్.కే. గారికి అందిన విశేషం మూడోది! సదరు సుదూర విశేష దాతకు మన కృతజ్ఞతాంజలి!

          రేపటి మన శ్రమదానం పొడిగింపు కూడ శివరామపురాల గ్రామంలోనే!

 

          అనుకరణే అభినందన

అనుకరణలె అత్యుత్తమ అభినందనలనుకొంటే

స్వచ్చోద్యమకారులకీ అభినందన పరంపరలె

అవి సామాజిక హితమై అలరారుటె ప్రత్యేకత!

నిత్య స్ఫూర్తి ప్రదమై నిలబడుటే విశిష్టత!

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   16.03.2022.