2382*వ రోజు ....           17-Mar-2022

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడతగునా?

శివరాంపురం మునివాకిట 2382* వ నాటి రహదారి పారిశుద్ధ్యం.

15 - 20 రోజులుగా ప్రయత్నిస్తున్న పెదకళ్లేపల్లి రహదారి శుభ్ర సుందరీకరణం ఈ గురువారం (17.3.22) వేకువ 2 కి.మీ. నిడివిని దాటుకొని, శివరామపురం - కొత్తూరు మునివాకిటి తలుపు తట్టింది! నేటి వేకువ 4.17 – 6.29 కాలాల నడుమ 28 మంది శ్రమదాతలతో కదలిన స్వచ్చోద్యమ రథం నడక స్థిరంగా సాగింది. ఆ గ్రామం నుండి నలుగురు పాల్గొన్నది వాస్తవమే గాని, మరో ముగ్గురు - నలుగురు మాత్రం ఈ శ్రమదానాన్ని ఎనిమిదేళ్ల తరువాత కూడ - అదేదో అంటరానిదన్నట్లుగా, క్రొత్త వాళ్లకు నిషిద్ధమన్నట్లుగా, అనుమానంగా, బిడియంగా, సందిగ్ధంగా చూస్తున్న విషయమే నాకర్ధం కాలేదు!

ఈ మంచు కుమ్మిన వేకువ పాతిక మంది కార్యకర్తల మరీ ముఖ్యంగా 15 – 18 మంది స్వచ్ఛ సైనికుల వీరవిహారం గణనీయమైనదనడంలో సందేహం లేదు. దాదాపు ఏడు - ఎనిమిది వందల గజాల రహదారిలో సదరు విక్రమం విస్తరించింది!

5.40 దాక వాళ్లు కత్తులతో, పారలతో, దంతెలతో, గోకుడు పారలతో, వట్టి చేతులతో పీకిన కలుపులు, నరికిన పిచ్చి ముళ్ల మొక్కలు, ఏరిన దిక్కుమాలిన గ్లాసులు - సీసాలు కప్పులు - ప్లేటులు, సుందరీకరించిన చెట్ల తాలూకు కొమ్మ - రెమ్మలు 100 గజాల పొడవునా గుట్టలుగా కనిపిస్తే ఇక ఈ పూటకి వాటిని చెత్తకేంద్రానికి తరలింపు కుదరదేమో అని శంకించాను!

ఐతే - అక్కడి నుండి అరగంట పాటు పని వేగం పెరిగింది - కార్యకర్తల ఉత్సాహం గేరు మారింది - నిముషాలు గడిచే కొద్దీ పంతం హెచ్చింది - అదుగో పెద్ద ట్రాక్టరు ట్రక్కు 2 గజాల ఎత్తుకు వ్యర్ధాలు బట్వాడా ఐపోయి, పని పూర్తి చేసిన సంతృప్తి శ్రమదాతల ముఖాల్లో స్పష్టంగా కనిపించింది!

ఇవన్నీ జై  స్వచ్ఛ - చల్లపల్లి సైన్యంసామాజిక మాధ్యమంలో గ్రామస్తులెవరైనా చూడవచ్చు! ఐతే బ్రహ్మముహుర్తాన - మంచు దాడి నడుమ - ఒక సదాశయం కోసం పాతికమంది నిస్వార్థంగా 2 గంటలు శ్రమించే సన్నివేశాల్ని ప్రత్యక్షంగా చూస్తే మాత్రం వేఱుగా ఉంటుంది!

ఏమైతేనేం! ఊహల్లో, స్వప్నాల్లో మాత్రమే సాధ్యమనుకొనే ఒకానొక విశిష్ట ఆవశ్యక - ఆదర్శ శ్రమదానోద్యమం వాస్తవంలో ఋజువయ్యింది! ఇందుకు గాను ఆయాచితంగా తమ రహదార్లనీ, వీధులనీ శుభ్రపరుస్తున్న స్వచ్చంద కార్మికులకు గ్రామస్తులు బుణపడ్డారో - లేక ప్రతిరోజూ ఏమరుపాటు లేక, బద్ధ కించక – 2382* దినాలుగా బాటల్ని వీధుల్ని కలుషితం చేస్తూ కార్యకర్తలకు ఈ మాత్రం ఉద్యోగాలు కల్పిస్తున్న గ్రామస్తులకు స్వచ్ఛ సైనికులే బాకీ పడుతున్నారో  తేలవలసి ఉన్నది!

9 వ నంబరు పంటకాల్వ వంతెన మీదే 15 నిముషాల సమావేశంలో నేనే స్వయంగా - అనాయాసంగా ముమ్మారు గ్రామ స్వచ్ఛ శుభ్ర సౌందర్య నినాదాలు ప్రకటిస్తే అంతకుముందు నందేటి శ్రీనివాస్ సునాయాసంగా ఒక మంచి పాటనాలపిస్తే అతనికీ, అది వ్రాసినందుకు నాకూ అభినందనలు బాగానే గిట్టుబాటైనవి! (ఇక్కడ ఒక ఇబ్బందేమంటే -  నందేటి వానినభినందిస్తే కాస్త ఫరవాలేదు - అతడు మరెన్నో పాటలు పాడి వినిపిస్తాడు - నన్ను మాత్రం ఇంకొంచెం పొగిడితే - ఇక తప్పక మళ్ళీ ఇలాగే వ్రాస్తే - పాటల్నంతగా ఇష్టపడని శ్రోతలు తట్టుకోలేరేమో!)

రేపటి - శుక్రవారపు వేకువ సేవల నిమిత్తం మనం కలువదగిన చోటు శివరాంపురం ముఖ ద్వారమే!

 

    సమర్పిస్తున్నాం ప్రణామం - 81

గంట చొప్పున ప్రతిదినం మేం మిమ్మనుసరించుట మేలు కాదా?

మహామహుడగు జాతిపిత ఇది మాట మాత్రం చెప్పలేదా?

స్పందనార్హులు వందనార్హులు ప్రశంసార్హులు మీరు కారా?

మంది క్షేమం కోరు మీకే మా మనః పూర్పక ప్రణామం!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   17.03.2022.