2383*వ రోజు....           18-Mar-2022

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడతగునా?

శివరామపురం రహదారి ముస్తాబుల ముగింపు కథ - @2383*

18.3.22 - శుక్రవారం – (చల్లపల్లి స్వచ్చోద్యమం ఇలాంటి ఏ 400 శుక్రవారాలో చూసి ఉంటుంది.) వేకువ 4. 16 కే 14 మంది ఛాయా చిత్రం 9 వ నంబరు కాలువ వంతెన దగ్గర కనిపిస్తున్నది!

మిగిలిన 17 మంది వెరసి ముప్పదినొక్కొరు శ్రమ సందేశ కర్తల రాదారి మెరుగుదల కృషి 6.17 దాక కొనసాగి - అదీ ఉద్యమ సారధి గారి అభ్యర్థనల వల్ల ముగిసింది!

జపాను దేశంలో ఉద్యోగ - కార్మికుల సమ్మెలు రివర్స్ లో ఉంటాయట! ఇంకా ఎక్కువ సమయం పని చేసి, ఎక్కువ ఉత్పాదనతో నిరసన తెలుపుతారట! మరి - ఈ స్వచ్చ కార్యకర్తలు జపనీయులు కాదు - భారతీయులే, చల్లపల్లీయులే! జపాన్ కార్మిక లక్షణాలు ఎలా వంటబట్టాయోగాని వీళ్ళ పద్ధతి అపసవ్యంగా - అంటే పనిలోకి దిగటం సులభమూ, విరమించడమేమో బహుకష్టమూ!

సోదర గ్రామస్తులకు నా సవినయ సూచన ఏమంటే:

మీలో కొందరు స్వచ్చ కార్యకర్తల నిరంతర కఠిన శ్రమ పట్ల సానుభూతి చూపుతారు - మరికొందరేమా మంచి మంచి పదాలతో ప్రశంసిస్తారు స్వచ్ఛ సైనికుల మనకోసం మనంట్రస్టును ఆర్థికంగా పరిపుష్టం చేస్తారు. మరి ఎందుకు సంకోచిస్తారో గాని ఒక మంచి ముహూర్తం చూసుకొని వచ్చి, భుజం కలిపి ప్రతి రోజూ గాని, వారంలో ఒకటి - రెండు రోజులు గాని గంట సమయం మాత్రం కేటాయించరు.

ఈ సదాశయులది హిపోక్రసీ కాదు బద్ద కస్తులనీ అనలేము బిడియస్తులనీ చెప్పరాదు! కాని, వాళ్ళ జన్మభూమి చల్లపల్లి మాత్రం ఈ సహృదయుల శ్రమదాన సేవల్ని కోల్పోతూనే ఉన్నది!

అట్టి సందిగ్ధుల సౌకర్యార్థం నా ఉచిత సలహా – “దయచేసి స్వచ్ఛ కార్యకర్తల నిస్వార్థ ఆశయాన్ని ప్రతి ఉదయం జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యంమాధ్యమంలో సచిత్రంగా - సవివరంగా వీక్షించండి! చాలు...

 

స్వచ్ఛ సైన్యం నిన్నటి పోరాటం ముగిసిన చోటు నుండి ట్రస్టు కార్మిక సోదరుల కృషి ప్రారంభమైనది. బహుశా ఉభయ శివరాంపురాల పర్యంతం అది విస్తరించవచ్చు! అందువల్ల ఈ శుభోదయంలో ఈ కళ్ళేపల్లి మార్గపు సుందరీకరణ ప్రయత్నం స్వచ్చ కార్యకర్తల వరకూ ఇంతే సంగతులు! చిత్త గించవలెను!

ఈ సంగతి పసిగట్టి కాబోలు ఐదారుగురు పనిమంతులు తాము రేపు చేయదగిన పనికూడ ఈ

రోజే చకచకా ముగించారు!

దేసు మాధురీ ఎస్టేట్స్అని ఒకరు  చంత్కరించిన శివరామపుర ముఖద్వార సుందరీకరణమే నేటి ముఖ్య విశేషమైపోయింది. షరామామూలుగానే  -

1. ప్లాస్టిక్ కవర్లు, సీసాలు, కప్పులు, మద్యం సీసాలు, తదితర వీధి నికృష్టాల్ని ఏరుట,

2. ఒక విశ్రాంత BSNL ఉద్యోగి చెట్టుపై కెగ బ్రాకి రోడ్డు మీద బళ్ళ కడ్డొచ్చే కొమ్మల్ని నరుకుట,

3. రహదారిని మరొక మారు ఊడ్చుట..... వగైరాలన్నీ జరిగిపోయినవి!

ఈ మధ్య సహ కార్యకర్తలకు తిను బండార వితరణలో కొంచెం దూకుడుగా ఉన్న సుభాషిణి  గారి పప్పుండల ప్రదానం కూడ జరిగింది. పసుపులేటి సత్యన్నారాయణ ప్రవచిత స్వచ్చోద్యమ నినాదాలతో నేటి శ్రమ ముగిసింది! ఆదివారం నాటి నాదెళ్ల సురేష్ ప్రేరిత 6 కిలోమీటర్ల పాదయాత్రకు చల్లపల్లిలో వివిధ సంఘాల సమీకరణ ప్రస్తావన కూడ జరిగింది!

రేపటి మన శ్రమదాన వేదిక విజయవాడ దారిలోని విజయా విద్యాసంస్థ సమీపాన!

 

         సమర్పిస్తున్నాం ప్రణామం - 82

కదం త్రొక్కు గుఱ్ఱం వలె - పదంపాడు కోకిల వలె

సుప్రభాత సూర్యుని వలె సొంత ఊరికై శ్రమించి

అన్ని హంగు లమర్చుటకు అహర్నిశలు పాటుబడే

స్వచ్చోద్యమ కారులకే సమర్పింతు ప్రణామాలు!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   18.03.2022.