2384*వ రోజు....           19-Mar-2022

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడతగునా?

బెజవాడ రహదారి బాధ్యతల పునః ప్రారంభం - @2384*.

            ఏ నెల క్రిందటో వేరే అవసరార్థం ఆపిన ఈ ప్రముఖ రాదారి కర్తవ్య నిర్వహణ కోసం 4.20 వేకువ సమయానికే డజను మంది, నిముషాల క్రమాన మరో డజను మందీ స్వచ్ఛ కార్యకర్తలు పూనుకొన్నారు. విజయా విద్యాసంస్థ ప్రవేశద్వారం నుండి జాతిపిత విగ్రహం దాక సకల విధ రహదారి సేవలూ పూర్తయ్యే సమయానికి 2 గంటల కాలం గడిచింది!

            24 మంది శ్రమదాతల కృషిని ఊరికి చెందిన పాతిక మందికి పైగా పరిచయస్తులు చూసి నిశ్చింతగా నిష్క్రమించారు. మరో 50 మందైనా సమీప నివాసాల వారు విన్నారు - గమనించారు; అది కార్యకర్తల స్వలాభా పేక్షా ప్రయత్నం కాదని ప్రతి ఒక్కరికీ తెలిసి - మొహమాటానిక్కూడా వచ్చి వేలు పెట్టలేదు!

            చల్లపల్లి గ్రామంలో అసలు ఎవరి అలవాట్లు ఎవరు మానుకొన్నారు గనుక? శుభ్ర -సుందరీకృత బాటల మీద కాలుష్యాలు విరజిమ్మే వాళ్లు ఓ వంక నీతి ప్రవచనాలు చెపుతూనే - రహదారి మార్జిన్ల ఆక్రమణదారులు – 2384* దినాలుగా స్వచ్ఛ - సౌందర్యాలు రుచి చూస్తూ కూడ ఉమ్మడి సామాజిక బాధ్యత ఊసెత్తని కొందరు గృహస్తులు, విద్యావంతులు, అధికారులు స్వచ్చోద్యమాభిలాషులై యుండి కూడ పాల్గొనడంలో బద్ధకిస్తున్న పెద్దలు - ఎవరి పాత్రలకు వారు న్యాయం చేస్తూనే ఉన్నారు ! స్వచ్ఛ సైనికులు సైతం తాము న్యాయమనుకొన్న శ్రమదానానికి కట్టుబడే ఉన్నారు!

            ప్రభుత్వం, స్థానిక సంస్థలు, గ్రామ పౌరులు విధిగా నెరవేర్చవలసిన పనులను వాళ్ళు యథాశక్తిగా నిర్వహిస్తూనే ఉన్నారు! అందుకనే వాళ్లు రోడ్ల మీద గుంటలు పడితే సరిజేయాలనీ - మురుగులు నిల్చి - దోమలు పెరగకుండ చూడాలనీ, ఉన్నంతలో ఉరి రోడ్లు పచ్చదనంతో, పూల సొగసులతో కళకళలాడాలనీ అందరికీ చెందిన శ్మశానాలు, బస్టాండు, బడులు, గుడి ప్రాంగణాలు శుభ్రపడాలనీ తపించిపోతారు. కేవలం ఈ తపనతోనే  వాళ్ళు గ్రామస్తుల్ని, ఆక్రమణ దారుల్ని పదేపదే ప్రాధేయపడేది!

            విజయా కాన్వెంటు గేటు నుండి ప్రభుత్వ పాఠశాల బారునా డ్రైనులోను, గట్ల మీద ఈ స్థాయిలో కాలుష్య కారకులు ఉభయ విద్యాసంస్థల వారో ప్రయాణికులో - మరెవరో తెలియదు గాని - శతథా అభివందనీయులు! ఈ 100 గజాల జాగాలోనే  ఇన్ని మద్యం సీసాల - ప్లాస్టిక్ తుక్కుల వైభవమేమిటో అర్థంకానే కాదు! ఈ ఉదయం 2 గంటల్లో వాటి పనిబట్టిన కార్యకర్తలు 12 మంది!

            నేటి పనిలో మార్పేమంటే - రెస్క్యూ దళం వారి వంతు కృషికి కూడ సుందరీకర్తలు పూనుకోవడం. మూడు మురుగు మట్టి గుట్టలు త్రవ్వి, చదును చేసి, ఒక పెద్ద గుంటను పూడ్చి ప్రయాణయోగ్యంగా మార్చేందుకు వాళ్ళెంత శ్రమించారో కన్నార్పకుండ చూశాను!

            పింగళి వేంకయ్య గారి విగ్రహ పరిసరాన్ని క్షుణ్ణంగా తీర్చిదిద్దే పనిని ఒక పోస్టల్ ఉద్యోగి గుత్తకు తీసుకొన్నట్లుగా - ఒక్కడే పూర్తి చేశాడు.

            రోడ్లు ఊడ్చిన మహిళలు, చెత్తను ట్రక్కులో నింపి, డంపింగ్ కు చేర్చిన వాళ్లు... ఎవరి దీక్ష, శ్రమ, బాధ్యతలు మాత్రం తక్కువ?

            బొమ్మిశెట్టి ఆత్మపరబ్రహ్మం 6.45 కు ముమ్మారు గ్రామ స్వచ్ఛ శుభ్ర సౌందర్య సంకల్పాన్ని నినదించాక - రేపటి సామూహిక పాదయాత్ర విషయం చర్చకు వచ్చింది. పరిచయస్తులైన గ్రామస్తులందర్నీ భాగస్వాములు చేయాలనే నిర్ణయం జరిగింది!

            సదరు నడక నిమిత్తం బంధు మిత్ర - సపరివారంగా మనం రేపటి వేకువ 4.45కు కలువదగిన చోటు 6 వ నంబరు కాల్వ గట్టు మీది గస్తీగది”.

 

     సమర్పిస్తున్నాం ప్రణామం - 83

ఉదర పోషణార్థంగా - మనః తృప్తి పథకంగా

ఈ లోకుల కెన్నెన్నో వింత వింత దారులు!

అనివార్యంగా ఊరికి అద్భుత సేవలొనర్చే

శ్రమదాతల కర్పిద్దాం సముచిత సత్ప్రణామం!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   19.03.2022.