2385*వ రోజు....           20-Mar-2022

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడవచ్చునా?

 

                2385 *వ నాటి చల్లపల్లి స్వచ్చోద్యమ పాదయాత్ర.

 

            అది ఆదివారం వేకువ 5.00 కు మొదలై, 7.50 కి ముగిసింది. అది 30-40-50 మంది వేలాది దినాలుగా చేస్తున్న శ్రమదానానికి భిన్నం! అది ఏ రాజ్యాధికారం కోసమో మహా నాయకులు చేసిన యాత్ర కాదు - పాతిక ముప్ఫై వేల గ్రామస్తుల చైతన్యం కోసం గ్రామ స్వచ్చ-శుభ్ర- సౌందర్య సమారాధనగా, ఔత్సాహికుల సమీకరణగా, స్వాతంత్ర్య ఉద్యమ ఘట్టాల్ని గుర్తుకు తెచ్చేట్లుగా జరిగిన విశిష్ట- విభిన్న- విస్మయకర పాదయాత్ర!

       

   ఈ 170 కి పైగా పాదయాత్రికుల్లో నిత్య స్వచ్చోద్యమ కారులు 50-60 మందే. గ్రామ, గ్రామేతర శతాధికులు- దుబాయి, విజయవాడ, ఇంకా పరిసర గ్రామాల స్వచ్చోద్యమాభిలాషులే! ఆహూతులు కొందరు, అనాహూతులు కొందరు! స్వచ్చ సుందర చల్లపల్లి సాధనలో తలో చెయ్యి వేసిన వాళ్లు, ఇక ముందు వేయబోయే వాళ్లు! అందరి ముఖాల్లో ఒక అంకితభావం- ప్రపంచంలో మరెక్కడా జరగని ఒక అద్భుతాన్ని తమ గ్రామంలో చూస్తున్న ఒక ఉద్వేగం!

            ఇక వీరు- 6 నుండి 83 ఏళ్ల వయస్కులు, రకరకాల సేవా సంస్థల, సంఘాల, విభిన్న నేపథ్యాల వాళ్లు! కుల-మత-ప్రాంత- దురభిమానులు కారు, సంకుచితులసలే కారు. అందరి కోరికా ఒకటే ! నిత్య స్వచ్చ శ్రమదాతల ప్రయత్నం ఫలించి, దేశానికి చల్లపల్లి ఒక దిక్సూచికగా నిలవాలని! మనసుల్లోని  కోర్కెనే జెండాలుగా ఎగరేసుకొంటూ- గస్తీ గది నుండి చెత్త సంపద కేంద్రం దాక- ఆరేడు కిలో మీటర్లు కదం త్రొక్కిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు!

 

            ఈ మార్చి 20 వ తేదీ చల్లపల్లి స్వచ్చోద్యమం లో ఒక కొండ గుర్తు ఒక మైలు రాయి - చిరస్మరణీయం చిర స్ఫూర్తిదాయక - సురుచిర సన్నివేశం! ఎట్ట కేలకు నెరవేరిన అమెరికా ప్రవాసుడు నాదెళ్ళ సురేష్ కోరిక ! ఇది 3 లక్షల పని గంటల శ్రమ దాతలకు, కోట్లాది ధన త్యాగ మూర్తుల ఔదార్యానికి ఒక విజయ సంకేతం! ఉద్యమ సారథుల సంయమనానికొక విజయ సూచన! కార్యకర్తల సముద్రమంతటి సహనానికి సముచిత ప్రతిఫలం!

            నేటి స్వచ్చ పాదయాత్ర స్ఫూర్తి ఒకనాటితో పోదు! ఒక్క చల్లపల్లి కే పరిమితమై ఆగదు! అది అన్ని ఊళ్లకూ ప్రాకి, అందరి మనసుల్నీ మధించి, అన్ని వార్డుల-అన్ని ఇళ్లలో జ్వలించి, రాష్ట్రమంతటా స్వచ్చోద్యమ జయ కేతనాన్ని ఎగరేయగలదు! అన్ని చోట్లా ఆరోగ్య ఆనంద తాండవ వాతావరణాన్ని సృష్టించగలదు.

            దిగ్విజయవంతమైన నేటి పాదయాత్ర ప్రణాళికాకర్తలకు, గాయకులకు, శ్రామికులకు, వక్తలకు, దాతలకు, స్ఫూర్తి ప్రదాతలకు, ముఖ్యంగా స్ఫూర్తి గ్రహీతలకు అభివందనాలు!

            ఇక్కడ ఒక చిన్న పాప కాంచన(తమ్మన సతీష్  తనయ)మదిలో ఉప్పొంగిన దాతృత్వ సందర్భం! తాను ఎన్నాళ్ల నుండో కిడ్డీ బ్యాంకులో దాచుకొన్న 1120/- ని చల్లపల్లి స్వచ్చోద్యమాన్నికర్పించిన వైనం.

 

            బుధవారం వేకువ బందరు జాతీయ రహదారిలో SRYSP కళాశాల దగ్గర పునః ప్రారంభమయ్యే శ్రమదానానికి తరలి వచ్చే - నేటి 170 మందిలోని క్రొత్త కార్యకర్తలకు సుస్వాగతం!

 

            సమర్పిస్తున్నాం ప్రణామం 84

రెండు వేల నాల్గొందల రోజులు గడిచే కొద్దీ

ఉత్సాహం తగ్గిందా- ఉవ్వెత్తున ఎగసిందా?

సామాజిక బాధ్యత మరి చతికిలబడెనా-నిలిచెన?

అందుకె స్వచ్చోద్యమానికి కందిస్తాం ప్రణామం!

 

            - నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

         20.03.2022.