2386*వ రోజు....           21-Mar-2022

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడవచ్చునా?

రెస్క్యూదళం వారి గ్రామ రహదారి బాధ్యత – 2386*

          సోమవారం (21-3-22) నాటి తొలి ఉషః కాంతులకు చాల ముందే - 4.29 కే సప్త సంఖ్యాక గ్రామ రక్షక భటుల హాజరు! అందులో ఇద్దరు వృద్ధవీరులు, మిగతా ఐదుగురు కాకలు తీరిన – చావ తేలిన కార్యకర్తలు, మురుగు గుంటల చండాలాల్ని తోడడం, రోడ్ల గుంటలు పూడ్చడం, బాటల మార్జిన్ల ఆక్రమణలు వద్దని ప్రాధేయపడినందుకు చడామడా తిట్లు తినడం, ప్లాస్టిక్ వ్యర్థాల్ని, మద్యం సీసాల్ని గోతాల కొద్దీ ఏరడం వంటివి ఈ కరుడు గట్టిన కార్యకర్తల కొన్ని పనులు!

          వీళ్ళ అవసరాన్ని గమనించి, మంచి నీరందించడం, కత్తి – గొర్రు – డిప్ప - గోనె సంచి వంటివి సమకూర్చడమనేవి ఒక 84 ఏళ్ల డాక్టరు, మరొక 75 ఏళ్ల విశ్రాంత హిందీ పంతులు గార్ల కర్తవ్యాలు!

          ఒక మినపచేను దగ్గర రహదారి శుభ్రతను మాత్రం 15 రోజుల నాడు స్వచ్ఛ కార్యకర్తలెందుకో గాని వదిలేస్తే - శివరామపురం బాటలో ఈ వేకువ సమయంలో - మేకలడొంకకు ఉత్తరాన - ఈ పంచ సంఖ్యాక స్వచ్ఛవీరులు ఆ

 30 40 గజాల బాట వ్యర్ధాల తొగింపు పనిని పూర్తిచేశారు.

          “రవి (= సూర్యుడు) కాంచనివి కూడ కవి కాంచగలడు” అనే పాత సామెతలాగే “స్వచ్ఛ కార్యకర్తలు కాంచనివి రెస్క్యూ టీం కనిపెట్టగలదుఅనేది క్రొత్త నానుడి!

          మేకలడొంక ప్రాంతంలో ప్లాస్టిక్ కప్పులేరుతున్న, డిప్పల్తో ఖాళీ మద్యం సీసాలు, సేకరిస్తున్న, డ్రైను వ్యర్థాలు ఊడుస్తున్న... ఈ గ్రామ బాధ్యతామూర్తుల్ని మన వాట్సప్ చిత్రాల్లో గమనించండి! గమనించి, అయ్యో! ఈ చీకటి వేళ – ఈ ముసలోళ్లకి, ఇతర ఐదుగురుకీ ఎందుకీ ఖర్మ!అని మాత్రం సానుభూతి చూపకండి!

          “స్వచ్ఛ కార్యకర్తలు ఇన్ని వేల దినాలుగా ఎవరికో సేవలు చేస్తున్నారు...అని కూడ మెచ్చుకోనవసరం లేదు! తమది సేవ కాదు, సామాజిక బాధ్యత అని వాళ్లేనాడో నిర్ణయించుకొన్నారు. స్వార్థమాసించేదైతేనో, ఎవరో చెప్పితే చేసేదైతోనో అప్పుడది “ఖర్మ – గ్రహచారం”.. అనిపించవచ్చుగాని, ఎవరికి వాళ్ల ఆంతరింగిక ప్రేరణతోను, ఆత్మఘోషతో చేస్తుంటేనూ అలా అనిపించదు!

          84 ఏళ్ళు వచ్చినా, ఇంకా నిష్కల్మష బాల్యం వదలని వైద్యుడు - గోపాలకృష్ణయ్య ముమ్మారు ప్రకటించిన గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య నినాదాలతో నేటి శ్రమదానానికి స్వస్తి!

 

నిన్నటి పాద యాత్రికులకు సమర్పిస్తున్నాం ప్రణామం – 85

ఏవైవాహిక శోభలకీ సందడి తీసిపోదు

ఏ ఒక్కరి ఉత్సాహం ఇంచుక చల్లార లేదు

పాదయాత్ర తుది దాకా స్వచ్చోద్యమ సంకల్పం

ప్రకటించిన యాత్రికులకు స్వచ్చోద్యమ ప్రణామం!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   21.03.2022.