1903 * వ రోజు....           27-Jan-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1903* వ నాటి వార్తలు.

మంచు, చలి కొద్దిగా శాంతించిన ఈ వేకువ 4.05-6.15 నిముషాల నడుమ నిన్నటి శ్రమదాన ప్రదేశమైన రాష్ట్ర రవాణా సంస్థ ప్రాంగణంలోనే కొనసాగిన కృషిలో పాల్గొన్న వారు 30 మంది. ఏనాటి శ్రమదాన ప్రత్యేకత ఆరోజుదే గాని, నేటి కృషి కొంత కష్టతరం, ప్రత్యేకం అనవచ్చు! పాయిఖానాల చుట్టు ప్రక్కల శుభ్ర పరచవలసి రావడమే అందుకు కారణం!

 

- మహిళా కార్యకర్తల సుందరీకరణ విషయానికొస్తే- వీరు బాటకు దక్షిణంగా, పాత మరుగుదొడ్ల ప్రక్కగా ఊడ్చడం, ఏరడం, ఊడ్చిన దుమ్ము, మట్టి, ఇసుకలతో తారుదారి అంచుల్ని బలిష్టం చేయడం, కళ్లాపి చల్లి  ముగ్గులేయలేదు గాని, - ఆపాటి పరిశుభ్రతను కల్పించడం చూడ ముచ్చటైన విశేషం.

 

- 15 మంది కత్తుల-గొర్రుల కార్యకర్తలు ప్రాత- క్రొత్త మరుగుదొడ్ల మద్యస్త ప్రాంతంలో దట్టంగా పెరుగుతున్న ముళ్ల పొదలను (ఆ పెరుగుదలకు కారణం వాటి టాంకు లీకేజీ కంపు నీరు కావచ్చు) నరికి, లాగి ట్రస్టు ట్రాక్టర్ లో కెత్తడం కష్టమైన-క్లిష్టమైన పనే.

 

- మిగతా కార్యకర్తలు ప్రధానంగా చీపుళ్లనే ప్రయోగించి, ప్రవేశ మార్గం , నిష్క్రమణ మార్గం రెండు ప్రక్కలా అన్ని వ్యర్ధాలను తొలగించారు.

 

నేటి సమీక్షా సమావేశపు ముఖ్యాంశాలు:

1. నిన్న డాక్టరు గార్ని కలిసిన ఇంగ్లాండులోని ప్రవాసి- తుంగల లక్ష్మీకాంత్ గారు చల్లపల్లిని గంటల తరబడి పర్యటించి, పరిశీలించి, నిబిడాశ్చర్యంతో ప్రశంసించి, మనకోసం మనం ట్రస్టుకు 5000/- విరాళం సమర్పించడం.

2. కంఠంనేని అచ్యుత రామయ్య గారి కుమార్తె జ్యోత్స్న గారు తూము వేంకటేశ్వర రావు గారి ద్వారా ట్రస్టుకు గత సంవత్సరాలలో వలెనే 12000/-ల చెక్కు రూపంలో అందించడం.

గతంలో ఇచ్చిన విరాళాలతో సహా ఇప్పటికి వారు 52000/- విరాళంగా ఇచ్చారు.

 

3. RTC ప్రాంగణంలో పూల తోట అభివృద్ధికి- సదరు అవనిగడ్డ డిపో మేనేజరు గారిని అనుమతి కోరగా- అది RM గారి పరిధిలోనిది కాబట్టి వారిని కలవవలసినదిగా చెప్పడం.

 

గోళ్ల కృష్ణ తన పద్ధతిలో ప్రకటించిన స్వచ్చ సంకల్ప నినాదాలతో 6.45 కు నేటి మన బాధ్యతలకు స్వస్తి!

రేపటి కర్తవ్యం కూడా బస్ సముదాయ ప్రాంగణంలోనే నిర్వహిద్దాం!

 

       ఏవం విధ శ్రమ సంస్కృతి!

స్వచ్చోద్యమ చల్లపల్లి శ్రమ సంస్కృతి ఎట్టి దనగ....

సామాజిక ఋణం తీర్చు సాహసిక ప్రయత్నంలో...

ఒక్కసారె వాడివదలు ఫ్లెక్సీలను, ప్లాస్టిక్ లను

ఏ మాత్రం వాడకుండ నిరుత్సాహ పరచడం!         

 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

సోమవారం – 27/01/2020

చల్లపల్లి.