2387*వ రోజు....           22-Mar-2022

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడవచ్చునా?

రెస్క్యూ టీం కర్తవ్య నిర్వహణ – 2387* వ నాడు కూడ!

మంగళవారం (22-3-22) కూడ అదే వరస! - 4.30 సమయానికే ఊరి రక్షక దళం పెదకళ్లేపల్లి మార్గంలో తొలుత నలుగురైదుగురు, కాస్త వ్యవధిలో మరో నలుగురు చేరిక! నిన్నటి శేష కర్తవ్య పరిపూర్తి కోసం చేసిన ప్రయత్నం ఫలించి ప్రభుత్వ మద్య వ్యాపార సంస్థ దగ్గర రహదారి శుభ్రపడి వైనం!

కొన్నాళ్ల క్రితం ఎవరో చమత్కరించినట్లు - ఏడెనిమిదేళ్ల వ్యసనపరులు వీళ్ళు (కాకపోతే ఒక మంచి ఆదరణీయ – అనుసరణీయ వ్యసనం)! వేకువ 3.30 దాటితే ఇక నిదర పట్టని రకాలు! స్వలాభం కోసం వెంపర్లాటేమీ కాదు; ఊరి మురుగుల్నీ – రోడ్ల గుంటల్నీ, చల్లపల్లి ప్రవేశానికి సంబంధించిన 7 రహదార్ల కాలుష్యాన్నీ – అశుభ్రతనీ -  అస్తవ్యస్తతనీ సహించలేని, ఉపేక్షించలేని బలహీనత వాళ్లది. ఆ బలహీనతే - అదౌర్బల్యమే ఇంత ఊళ్ళో ఒక 50 - 60 మందిని స్వచ్ఛ కార్యకర్తలుగా మార్చేసింది! అందులో 10 మందిని రెస్క్యూ టీంగా తీర్చిదిద్దింది!

ఆ బలహీనత ఈ పరిణతి స్వచ్ఛ సైనికుల ఖర్మ! గ్రామ కోణం నుండి చూస్తే - అవి చల్లపల్లికి అనుకోని, ఎనలేని అదృష్టాలు!

వరిగడ్డి బళ్ల వల్ల ఈ నాలుగు రోజుల్లోనే శివరాంపురం రోడ్డు మీద రాలిపడిన చెత్త, మందు వీరుల ప్రతాపంతో మళ్ళీ రోడ్డునాక్రమిస్తున్న గ్లాసులు, ప్లేటులు, కాగితాలు స్వచ్ఛ కార్యకర్తలే గదా తీయాల్సింది – ఏరాల్సింది? వాటికి తోడు తాడి చెట్ల మాటున కొన్ని పిచ్చి చెట్లు, వ్యర్థాలు కూడ వీళ్ళు నేడు తొలగించి, శుభ్రపరచిన సంగతులు!

చల్లపల్లి గ్రామస్తుల్లో రావలసినంత స్వచ్ఛ స్పృహ, సామాజిక చింతన వచ్చే దాక – పరిశుభ్ర – సౌందర్యపరంగా ఊరు స్వయం సమృద్ధమయే దాక చల్లపల్లి స్వచ్ఛ సైనికుల ఈ సుదీర్ఘకాల వ్యసనం ఇలాగే కొనసాగాలని ఇందు మూలంగా దీవించడమైనది!

ఒక లుంగీధారుడైన వేముల శ్రీనివాసుడు ఈ నాటి గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య సంకల్ప నినాదకుడు!

రేపటి గ్రామ ప్రధాన వీధి కాలుష్యాల పనిబట్టేందుకున్నూ, “స్వచ్ఛ - సుందర చల్లపల్లి పేరును సార్థకం చేయుటకున్నూ, మనం వేకువనే కలిసి శ్రమించదగిన చోటు బందరు రహదారికి చెందిన “శ్రావ్య” ఆస్పత్రి ఎదుటే!

 

సమర్పిస్తున్నాం ప్రణామం 86

ఒకోమారు చరిత్రలో ఊహించని పెనుమార్పులు

స్వచ్చోద్యమ చల్లపల్లి చరిత్రలో పదయాత్రలు

అలాంటి వనుచు ఊహించుట కాకపోదు యధార్ధం

పాదయాత్రికులకందుకె ప్రకటిస్తాం ప్రణామం!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   22.03.2022.