2388*వ రోజు....           23-Mar-2022

ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడవచ్చునా?

బందరు రహదారి శుభ్ర - సుందరీకరణంలో.....2388* వ నాడు.

23-3-22 - బుధవారం వేకువ సమయం – 4.18 కే మరొక మారు చల్లపల్లి ప్రధాన వీధిలో – 6 వ నంబరు పంటకాల్వ దగ్గర పాత కథ పునరావృతయింది? అప్పటికే అక్కడ 17 మంది, తదుపరి డజను మంది వీధి కాలుష్యం మీద కాలు దువ్వుతున్నారు! ఒక ప్రక్క చీపుళ్ల బర బరల్తో దుమ్ములేస్తున్నది – శ్రావ్య హాస్పిటల్ దగ్గర పిచ్చి చెట్ల నరుకుళ్లు వినిపిస్తున్నవి. ఇక 6.20 దాక - రెండు గంటల పాటు మునసబు వీధి దాక ఈ పాతిక – ముప్పై మందిది శ్రమదాన పండుగే పండుగ!

ఔను మరి – రోడ్ల దుమ్ము, మురికి తుడవడమే, డ్రైన్ల తుక్కులు తొలగించడమే చెట్ల ఆకులు, వరిగడ్డి చెత్తలు ఊడవడమే తమ దృష్టిలో పండగనుకోకపోతే :

- ఒక ద్వితీయ బాల్యస్థుడు - ప్రక్కకు ఒరిగి నడిచే 84 ఏళ్ల వైద్యుడు ఇంట్లో పడుకోక, చీకట్లో వచ్చి ఈ పనికి పూనుకోడు గదా!

- ఎక్కడో దుబాయిలో అత్యున్నతోద్యోగి – చుట్టం చూపుగా అత్తారింటికి వచ్చి, ఇంత ప్రాతః కాలంలో - ఈ మురికి చెత్తపనులే అత్తింటి పెద్ద మర్యాదలనుకోడు గదా! (మళ్ళీ చూస్తేనేమో అత్తమామలిద్దరూ పేరున్న పేద్ద డాక్టర్లు – వేకువ జామునే ఒక మంచి చీపురు ఈయనికిచ్చి వెళ్ళి రోడ్లు ఊడ్చుకోపో అని వాళ్ళు పంపడం – ఈయనేమో మహదానందంగా సదరు మర్యాదను ఆనందించడం!)

- ఐదారుగురు ప్రస్తుత, విశ్రాంత ఉద్యోగులు, 7 గంటలకే ఆస్పత్రి విధుల్లో చేరాల్సిన నర్సులు, ముగ్గురు రైతులు.... ఇలా బ్యాంకు ముంగిట, కళాశాల ఎదుట, రిజిస్ట్రార్ కార్యాలయాల ముందు, రోడ్లనాక్రమించిన దుకాణాల ప్రక్కల ఇన్నిన్ని ఖాళీ మద్యం సీసాల నేరి, గడ్డిచెక్కి, డిప్పల్తో దుమ్ములెత్తి, ఆ డిప్పల్ని మోసి ట్రక్కుల్లో నింపి, డంపింగ్ కేంద్రానికి చేర్చడమే ఒక వేడుకగా వేలాది రోజులుగా శ్రమిస్తున్నారంటే – ఏదో పరమార్ధముంటేనే గదా!

- బొత్తిగా తీరిక లేని ఇద్దరు - ముగ్గురు గృహిణులు గబగబా వచ్చి, శక్తి వంచన లేనంతగా ఈ వీధిని చకచకా సుందరీకరించి, హడావిడిగా మళ్లీ ఇంటి బాధ్యతల కోసం వెళ్తున్నారంటే - ఈ సామూహిక శ్రమ సంతోషాన్ని, తాము నివసించే ఊరి బాధ్యతల్ని వాళ్లెంతగా ఇష్టపడి చేస్తున్నట్లు?

(అసలింతకీ నా కృతజ్ఞత ఎవరికి? థైర్యంగా - సామాజిక బాధ్యతగా - లక్షల కొద్దీ పని గంటలుగా - పారదర్శకంగా - శ్రమిస్తున్న స్వచ్ఛ కార్యకర్తలకా - లేక వీధి శుభ్రతలు పట్టించుకోని - గ్రామ ఉమ్మడి ఆరోగ్య అనందాల్ని ఆలోచించని - అందమైన వీధుల్ని కలుషితం చేస్తున్న - అందినకాడికి ఆక్రమిస్తున్న - కార్యకర్తలకిన్ని వేలరోజుల పని కల్పిస్తున్న కొందరు గ్రామ సహోదరులకా?)

సరే – పోనీండి - ఎవరి ‘హక్కులు’ వాళ్లవి! గ్రామ మెరుగుదలకై శ్రమించే స్వచ్ఛ కార్యకర్తల సంతృప్తి మాత్రం వాళ్లకదే గొప్పది - తరగనిది!

కాఫీల, కబుర్ల - పిదప 6.45 కి ఒక సుదీర్ఘ చరిత్ర ముగిసిన పురాతన కళాశాల ద్వారం ఎదుట జరిగిన సమీక్షా సమావేశంలో :

- స్వచ్చోద్యమ ఆర్థిక - శ్రమదాత వల్లభనేని వీరేంద్రుని తనది కాని గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సౌందర్యాకాంక్షాపూరిత నినాదాలు, స్వచ్ఛ కార్యక్రమం పట్ల అతని నిబిడాశ్చర్య వ్యక్తీకరణా చోటు చేసుకొని,

- ఒకరి తిరుపతి ప్రసాదం, మరొకరి కోవా బిళ్లల పంపకం వంటివి జరిగి, 7.00 కు ముందే నేటి శ్రమదాన వినోదం ముగిసింది.

రేపటి వేకువ సైతం మన స్వచ్ఛ - శుభ్ర - విధులు ఈ బందరు జాతీయ రహదారిలోనే - మనం కలువదగింది రిజిస్ట్రారు వారి కార్యాలయ ద్వారం ముందే!

 

సమర్పిస్తున్నాం ప్రణామం 87

ఇది సందడి, పెను పండుగ – ఇరుగు పొరుగు మనుషులకై

పదం కదిపి, కదం త్రొక్కి, ఇంతటి ఆరాటమై

ప్రతి వేకువ బాధ్యతతో పాటుబడే వారిపై

కురిపిస్తాం పూల జల్లు - జరిపిస్తాం ప్రణామం!

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   23.03.2022.