2389*వ రోజు....           24-Mar-2022

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడవచ్చునా?

2389* వ వేకువ శ్రమదాన వైభవం!

మళ్ళీ అదే బందరు జాతీయ రహదారి వీధి సుందరీకరణ కోసం అదే శ్రమత్యాగం - దాతలు 27 మంది - సమయం దాదాపు బ్రహ్మ గారి ముహుర్తం 4.14 -  అక్కడి నుండి దాని నిడివి 2 గంటల 15 నిముషాలు గ్రామ కర్తవ్య నిర్వహణకు నోచుకొన్న స్థలం కూడ ఇంచుమించు నిన్నటిదే!

ఐతే - మరి నిన్న వ్రాసింది చాలక - ఈ వేళ కూడ ఎందుకు ఈ సొద సోది - బోరు....?” అనుకొనే వాళ్ళు మన్నించాలి. ఇక్కడ ఎనిమిదేళ్లుగా చల్లపల్లిలో ప్రవహిస్తున్నది ఈ గ్రామం ఎన్నడూ ఊహించని, చరిత్ర ఎరుగని, ధరిత్రి చవిచూడని అరుదైన స్వచ్ఛ సుందరోద్యమం! ఊరి సంఖ్యతో పోల్చి ఈ 27 మందిది అల్ప సంఖ్యగా చూడడం కాదు ఈ శ్రమదానం వెనకున్న సామాజిక స్పృహ గమనింప దగ్గది!

ఇక ఈ దైనందిన సుదీర్ఘ శ్రమదానం గురించి ఈ మాత్రం వర్ణనాత్మకంగా వ్రాస్తున్న సంగతంటారా? అది చూసే వాళ్ల హృదయ స్పందనను బట్టే ఉంటుంది! ఈ దిక్కుమాలిన సూర్యోదయం ఎప్పుడూ ఉండేదే; వీధి వీధినా 7 రహదార్ల కిలోమీటర్ల పొడవునా ఇన్ని పూలు, వాటి సుగంధాలు ఉన్నాయనుకో - అయితే ఏంటట? తెల్లారకముందే రోడ్లమీద ఈ మైకు పాటలేమిటి? ఈ పెద్ద మనుషుల ఊడ్పులూ, చెత్త ఏరుళ్లూ, మురుగు కాల్వల చక్కదిద్దుళ్లూ ఏం ఒరగ బెట్టాయి?....” ఇలాంటి వ్యాఖ్యానాలు అప్పుడప్పుడూ అక్కడక్కడా వినిపిస్తే వినిపించనీయండి!

కాస్త లోతైన సామాజిక పరిశీలకులకూ, జనం కోసం - జనం మధ్య పని చేయాలనుకొనే కొందరికి మాత్రం ఇదే స్వచ్ఛ కార్యకర్తల్ని, వాళ్ళ శ్రమ ప్రయోజకత్వాన్ని చూసి చలిస్తూ, వాళ్లని దగ్గరగా గమనిస్తే అలా అనిపించదు!

చీపుళ్లతో రోడ్లను శుభ్రపరుస్తున్న మహిళల్ని చూస్తేనూ, కళాశాల - ఆస్పత్రుల ఎదుటి సుందరోద్యానాల్ని చీకట్లో ఒంగి మెరుగుపరుస్తున్న శ్రమజీవుల్ని చూస్తేనూ, స్టేట్ బ్యాంకు ఎదుట దీక్షగా సుందరీకరిస్తున్న శ్రామిక బృందాన్ని చూస్తుంటేనూ, నాలాంటి కొందరి సంస్పందన వేఱుగా ఉంటుంది! ఇవాళ్టి 27 మంది పనుల్ని, ఆ కృషి వెనక సదుద్దేశ్యాల్ని, ప్రతి భంగిమను, ప్రతి కదలికను చూసినప్పటి నా మనః చలనాన్ని ఈ మాత్రం వర్ణిస్తే తప్పేమిటి?

వెనకటి - ఇప్పటి మహా తెలుగు కవులు కొందరు స్త్రీల సౌందర్యాలను వందల విధాలుగా వర్ణించారు; పనికిమాలిన రాజుల యొక్క లేనిపరాక్రమ కథల్తో కావ్యాలు నింపారు. ఆ చెత్త వర్ణనల కన్న స్వచ్ఛ కార్యకర్తల 2389* రోజుల చెత్తపనులే నాదృష్టిలో మిన్న!

అందువల్ల ఈ గ్రామం సకల సంపూర్ణ స్వచ్ఛ శుభ్ర సుందరమయ్యే దాక ఊరి జనులందర్లో  రావలసినంత సామాజిక స్పృహ వచ్చే దాక ఏ చిన్న వీధిని చూసినా గంగులవారిపాలెం బాటలా, కమూనిస్టు బజారులా కనువిందయ్యే దాక, ఈ స్వచ్చోద్యమ రథం ఆగరాదనీ, కార్యకర్తలు 50 మందే గానీ 172 మందే కానీ - సంఖ్యనేది ముఖ్యం కాదనీ అస్మదీయుల ఆలోచన!

ఇలాంటి అదర్మాన్ని నిజపరిచేందుకే ఈ 2389* నాళ్ల సదాచరణ! నేటి శ్రమ వేడుక ముగింపు వేళ - పిల్లల ఆసుపత్రి ఎదుట - నేటి వీడ్కోలు సమావేశంలో ల్యాబ్ రవీంద్రుని త్రివిధ గ్రామ స్వచ్ఛ శుభ్ర సౌందర్య సంకల్ప నినాదాలు బాగా వినిపించినవి.

రేపటి గ్రామ పరిచర్యల్లో భాగంగా - ఇదే బందరు జాతీయ మార్గంలో మునసబు గారి బజారు దగ్గరే మన కలయిక!

 

సమర్పిస్తున్నాం ప్రణామం 88

సరిగమ వలె, కవితల వలె చతురోక్తులు నింపుకొన్న-

సహన గుణం, త్యాగధనం సరిహద్దులు మీటుతున్న -

శ్రమ సంస్కృతి గుణపాఠం గ్రామానికి మప్పుతున్న

కర్మవీరులందరికీ కావిస్తాం ప్రణామం!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   24.03.2022.