2390*వ రోజు....           25-Mar-2022

 ఒక్క వాడకానికే పరిమితమైన (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వస్తువులు ఎవరైనా వాడవచ్చునా?

గ్రామ స్వచ్చ – సుందరోద్యమాభిలాషుల 2390* వ నాటి పట్టుదల!

కాలం కొలతలో ఐతే - ఇది శుక్రవారం (25.03.2022) – వేకువ 4.18, 6.28 నడిమి సమయంలో. సంఖ్యాపరంగా చూస్తేనేమో శ్రమదాతలు 30 మంది; రావలసీ కారణాంతరాల వల్ల ఆగిపోయిన వారు 10-15 మంది; వీళ్ల శ్రమత్యాగానికవకాశమిచ్చింది అమరావతి రాజుల భవనం చుట్టు ప్రక్కల - అనగా పింగళివారి ఆస్పత్రి ఎదుట, కర్మకాండల ఆవరణ వగైరాలు! ఈ నిరవధిక సేవామూర్తులు తమకు ఉరి బాధ్యతలింతగా అప్పగించినందుకు, దక్కినందులు కృతజ్ఞులు కావలసివస్తే - అది దేవునికి కాదు, 100 గజాల జాగాలో బండెడు కాలుష్యాలు నింపిన గ్రామస్తులకే!

ఇద్దరు మహిళలతో సహా డజను మంది శ్రాద్ధ కర్మల ఆవరణలో గంటకు పైగా శ్రమించడాన్నీ, ఏ సెంటిమెంట్లూ పెట్టుకోక – కాలుష్య కారకుల్ని విసుక్కోక - పాటించిన సంయమనాన్నీ – వాట్సప్ చిత్రాలుండ బట్టి సరిపోయింది గాని – లేకపోతే పొరుగూళ్ల మనుషులు, దేశ విదేశాల ప్రవాసులు నమ్ముతారా?

నమ్మి అర్థం చేసుకొన్న అట్టి వారిలో కొందరు బహుశా “అరే! ఈ గృహిణులకు, పెద్ద ఉద్యోగులకు, వయోవృద్ధులకు ఇన్ని వేలదినాలుగా ఇదేం ఖర్మరా నాయనా! మురుగగ్గుంటల్ని దేవే -  ప్లాస్టిక్ తుక్కుల్ని ఏరే బాధ్యతలింకెన్నాళ్లురా తండ్రీ!...”అని కూడ అనిపించీ ఉండొచ్చు!

ఇంతకీ చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తల బలహీనతలూ, మనస్తత్వాలూ ఏమిటిరా అని ఆరాతీస్తే – నా కనిపించేదేమంటే :

1. మిగతా వేల మంది గ్రామీణుల్లాగా కాక, తోటి వాళ్లకూ గ్రామ సమాజానికీ తమ వంతుగా ఏ కొంచెమైనా ఉపయోగపడాలనుకొనే నిర్ణయం,

2. ఇన్ని లక్షల గంటలుగా ప్రతిరోజూ తమ సహకార్యకర్తల 2 గంటల సాహచర్యాన్నీ, సందడినీ శ్రమజీవన సౌందర్యాన్నీ వదులుకోలేకపోవడం;

3. ఇక్కడి దైనందిన సామూహిక శ్రమదాన మాధుర్యం, మధ్యలో కొందరి ఛలోక్తులు, కొన్ని పని సంబంధమైన హెచ్చరికలు, కూనిరాగాలు, తరతమ భేదాలు లేక అభిమానంగా ఒకరినొకరు “అన్నా, బాబాయ్, వదినా, తమ్ముడా...” వంటి అభిమానపూర్వక పిలుపులూ, ఇదంతా కలిపి ఒక ప్రత్యేక – విశిష్ట స్వచ్చ సంస్కృతిగా అలవాటుపడ్డ వైనమూ..

మరి - ఇవన్నీ కొందరికి బలహీనతలనిపిస్తాయేమో గాని, నా దృష్టిలో ఇవే బలాలు! నేటి మన సమాజానికావశ్యమైన కార్యకర్తకల సంఘటిత మహాశక్తులు!!

అందుకే ఇందులో ఐదారుగురైతే, పాపం మరీ ఆందోళన చెందుతారు... ఎక్కడ ఏ దిక్కుమాలిన కరోనా వచ్చి, తమ శ్రమదాన కార్యక్రమం కొన్నాళ్లు ఆగుతుందో అని! అందుకే అ ప్రయత్నంగానే 3.30 కే మేల్కొంటారు - అనుకోకుండానే వాళ్ల కాళ్ళు శ్రమదాన స్థలం వైపుకు దారితీస్తాయి.

అందుకే - నాకైతే ఒక స్పష్టత ఉంది - ఈ చల్లపల్లి స్వచ్చ – సుందరీకరణ కార్యక్రమం మరో 8 ఏళ్ళైనా - తన లక్ష్యాలు సాధించే దాక -  ఆగదని!

నేటి శ్రమ దీక్షకు తార్కాణంగా తక్కిన వివరాలట్లా ఉంచి, నలుగురు ధృఢకాయులైన కార్యకర్తల ఒక ఛాయా చిత్రాన్ని గుర్తించండి - వాళ్ల బట్టలు నిజమైన చెమటతో తడిసి ముద్దై – దుమ్ము కొట్టుకొన్న (ఇవి గ్రాఫిక్స్ కానే కావు) వైనం గ్రహించండి!

6.50 సమయంలో నేటి స్వగ్రామ స్వచ్చ – శుభ్ర సౌందర్య సాధనా సంకల్పాన్ని ముమ్మార్లు గర్జా సదృశంగా నినదించినది ఒక కళాశాలోపన్యాసకుడు - వేముల శ్రీనివాసుడు.

రేపటి వేకువ మన 30 - 40 మందిమి కలసి శ్రమించే అదృష్టాన్ని, కల్పించపోయేది - బందరు రహదారి మార్గంలో - రాయపాటి సోదరుల నివాస భవనాల ప్రాంతం!

 

     సమర్పిస్తున్నాం ప్రణామం – 89

 

ఇంతకన్న ఊరి మంచి కెలా పాటుబడదగునో -

ఆచరణకు నిలిచినట్టి ఆదర్మము లెట్లుండునొ-

చిత్త శుద్ధి - త్యాగాలకు చిరునామా లెక్కడనో –

వెదుక దగిన స్వచ్చోద్యమ విభవానికి ప్రణామాలు!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   25.03.2022.