2393 *వ రోజు ....           28-Mar-2022

 ఒక్క వాడకానికే పరిమితమైన (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వస్తువుల నష్టం చాలా పెద్దది.

మరొక మారు గ్రామ వికాస కృషిలో రెస్క్యూదళం! @2393*

కరోనా గందరగోళంలో - గత సంవత్సరకాలంగా ప్రతి సోమ, మంగళవారాలు అనధికారంగా గ్రామ భద్రతా దళం పరమైపోయాయి! ఈ సంగతి దుకాణదారులకూ, ఆయా వీధుల ప్రజలకూ అర్థమైపోయి, అప్పుడప్పుడూ - అక్కడక్కడా ఆయా వీధి రక్షణ చర్యల కోసం ఈ కార్యకర్తలకు విజ్ఞప్తులు, సూచనలు సైతం మొదలయ్యాయి! (షరా! ఈ విన్నపాలు, లౌక్యాలు, అంతటితో ఆగుతవి తప్ప- ఎక్కడో ఒక్కరు తప్ప ఆ విన్నపదారులు మాత్రం ఈ టీంతో కలిసి శ్రమించరు!)

 

28.3.22 (సోమవారం) వేకువన కూడ ఆరేడుగురు స్వచ్చ కార్యకర్తల (తప్పక మరో ఇద్దరు గ్రామాంతరం వెళ్లారు) శ్రమ సందడి బందరు రహదారిలో కనిపించింది. మళ్లీ - ఇందులో ఇద్దరు బాగా ముదురు ముసలి కార్యకర్తలు, వీళ్ల వెంట పనిముట్లు, మంచినీళ్ళు వగైరాలు!

రాయపాటి ప్రసాదరావు గారు మూన్నాలుగు రోజుల్నాడు తమ ఇంటి రాళ్లు ఇసుక - మట్టి గుట్టలు తమకవసరం లేదనీ గ్రామ అవసరాలకు ఉచితంగా వాడుకొమ్మనీ అనుమతిస్తే - వారి ఇంటి ఎదుట ఈ కార్యకర్తలు ఈ వేకువనే వచ్చి వాలారు.

సదరు రాళ్ల - మట్టి గుట్టను త్రవ్వడం, పారల్తో డిప్పల కెత్తి, ట్రక్కులో నింపుకొని, రిజిస్ట్రారు కార్యాలయ ద్వారం ఎదుట గుంటల్లో ఈ మిశ్రమాన్ని దింపడం, మళ్ళీ పారల్తో సర్ది చదును చేయడం, మట్టి మందంగా చల్లి, నడక కనువుగా మార్చడం ఇదీ గంటన్నరకు పైగా సాగిన - రాటు తేలిన నలుగురు పనిమంతుల కృషి!

6:40 సమయంలో - పని ముగించిన సంతోషంలో వీరిలోని శంకర శాస్త్రి గారు ముమ్మారు నినదించిన తమ ఊరి స్వచ్ఛ - పరిశుభ్ర సౌందర్య సాధనాకాంక్షతో కార్యకర్తల నేటి  దినచర్య ముగిసింది!

             

      సమర్పిస్తున్నాం ప్రణామం 92 

ఇంతకన్న ఊరి మంచికెలా పాటుబడదగునో

ఆచరణకు నిలిచినట్టి ఆదర్మము లెట్లుండునొ

చిత్తశుద్ధి - త్యాగాలకు చిరునామా లెక్కడనో

వెదుక దగిన స్వచ్ఛోద్యమ విభవానికి ప్రణామాలు!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   28.03.2022.